మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీసీలపై కపట ప్రేమ ప్రదర్శిస్తున్నాడు. ఆయనకు సామాజిక ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ప్రధానం. అందుకు ఏ స్థాయికైనా దిగజారేందుకు వెనుకాడరు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లపై కూడా ఆయన కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు. నిజంగా ఆయనకు బీసీలపై ప్రేమ ఉందా అంటే లేదనే సమాధానం వస్తుంది. నిజంగా ఆయనకు బీసీ, ఎస్సీ, ఎస్టీలపై ప్రేమే ఉంటే రాజధానిలో ఆ కులాల్లోని నిరుపేదలకు ఇంటి స్థలం ఇస్తుంటే ఎందుకు అడ్డు తగులుతున్నారు?
ముఖ్యమంత్రి జగనే బీసీల ద్రోహి అని ధ్వజమెత్తుతున్న చంద్రబాబు…వారికేం చేశారో చెప్పగలరా? తమకు కనీస వేతనం ఇవ్వాలని అభ్యర్థించడానికి వచ్చిన నాయీబ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తానని నడిరోడ్డుపై హెచ్చరించడాన్ని యావత్ లోకం చూసి నివ్వెరపోయింది. అందుకే తొమ్మిది నెలల క్రితం చంద్రబాబుకు బీసీలు తగిన బుద్ధి చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి కుదించాలన్న నిర్ణయం ద్వారా బీసీలకు జగన్ తీరని ద్రోహం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఈ చర్య వల్ల సుమారు 16 వేల పదవులు బీసీలకు పదవులు దక్కకుండా పోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లను 50 శాతానికి కుదించడంపై తమ పార్టీ కోర్టుకు పోతుందని ఆయన అన్నారు.
వినే వాళ్లు, రాసేవాళ్లు ఉంటే చంద్రబాబు ఏమైనా మాట్లాడుతారు, ఎన్ని అబద్ధాలైనా చెబుతారనేందుకు ఇంత కంటే నిదర్శనం ఏం కావాలి? ఏపీలో బీసీల జనాభా ప్రాతిపదికన జగన్ సర్కార్ రిజర్వేషన్లు కల్పించి, అందుకు తగ్గట్లు సీట్లను కేటాయించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళుతున్న తరుణంలో టీడీపీ తన మనుషులతో కోర్టులో కేసులు వేయించడమే కాకుండా , ఇప్పుడు బుకాయిస్తోంది.
నిజంగా చంద్రబాబుకు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలపై ప్రేమ, గౌరవం ఉంటే రాజధానిలో 1,251 ఎకరాల్లో వాళ్లలోని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇస్తుంటే ఎందుకు అడ్డు పడుతున్నారో సమాధానం చెప్పాలి. జగన్ సర్కార్ ఎంతో సదాశయంతో రాజధాని అమరావతిని ప్రజారాజధాని చేయాలనే సంకల్పంతో , బీసీ, ఎస్సీ, ఎస్టీ నిరుపేదలైన 54 వేల మందికి ఇంటిస్థలాలు ఇస్తుంటే, బాబు నిర్దాక్ష్యిణ్యంగా అడ్డుపడుతుండడాన్ని ఎవరూ గుర్తించలేదనుకుంటే పొరపాటే.
రాజధాని భూమిలో అణగారిన వర్గాల వారికి ఇంటి స్థలాలను కేటాయిస్తూ జారీ చేసిన జీఓ 107ని రద్దు చేయాలని చంద్రబాబు తన అనుచరులతో హైకోర్టులో పిటిషిన్ వేయించిన విషయం వాస్తవం కాదా? చంద్రబాబుకు నిజంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలపై గౌరవం ఉంటే , 107 జీవోకు వ్యతిరేకంగా కోర్టులో వేయించిన పిటిషన్ను వెనక్కి తీసుకోవాలి. అలా కాకుండా కేవలం మాటలకే పరిమితమైతే ఎవరూ నమ్మే పరిస్థితి ఉండదు.