ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అనేది ఒక అమరావతిలో మాత్రమే ఉండాలని…. రాజధాని అనే ట్యాగ్ లైన్ తో రాష్ట్రంలోని ఏ ఇతర ప్రాంతాల అభివృద్ధికి నోచుకోకూడదనే ఒక సంకుచితమైన డిమాండ్తో సుమారు రెండున్నర నెలలకు పైగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అసంబద్ధమైన, తర్కరహితమైనతమ డిమాండ్ ను ఎక్కువ కాలం పాటు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలో అర్థం కాకుండా… అమరావతి రైతులు రకరకాల కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిలో అనేకం హాస్యాస్పదం అవుతున్నాయి. ఆ క్రమంలో భాగంగానే… అంతర్జాతీయంగా కూడా అమరావతి పోరాటం నవ్వులపాలయ్యే తాజా ఈ సంఘటన ఇది.
అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయుడు కావేటి శ్రీనివాసరావు అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి అమరావతి వ్యవహారాన్ని తీసుకువెళ్లారు. ఇక్కడ మానవ హక్కులకు భంగం కలుగుతున్నదంటూ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆయన అంతర్జాతీయ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణంలో రైతులను భాగస్వాములను చేసిన తర్వాత ప్రభుత్వం వారితో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూన్నదని… ఆయన అంతర్జాతీయ న్యాయస్థానానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
అయితే ఇక్కడ తమాషా ఏమిటంటే… కావేటి శ్రీనివాసరావు రాసిన లేఖను… అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటిషన్ వేసినంత గొప్పగా పచ్చ మీడియా స్థానికంగా ప్రచారం చేస్తోంది. ఆయన రాసిన లేఖ మాత్రమే… దానిని అంతర్జాతీయ న్యాయస్థానం వర్గాలు.. తమకు అందినట్లు గా కరెస్పాండెన్స్ రిజిస్టర్లో నమోదు చేశాయి తప్ప…. పిటిషన్ గా ఇంకా పరిగణించలేదు. అయితే మీడియా హడావుడి మాత్రం చాలా జరుగుతోంది.
అమరావతి ప్రాంత రైతులు రకరకాల చిత్ర విచిత్ర రూపాలతో ఆందోళనలు చేస్తూ హాస్యాస్పదం అవుతున్నారు. వారికి తోడు, అంతర్జాతీయంగా కూడా నవ్వులపాలయ్యే ప్రయత్నం ఇది అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం ఒక ప్రాంతానికి చెందిన ప్రజల ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడిన అంశాన్ని… యావత్తు రాష్ట్ర సంతులన అభివృద్ధి కాంక్షించే… అధికార వికేంద్రీకరణ ఆలోచనలతో ముడిపెట్టి అడ్డుకోవడం మంచిది కాదని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.