మోడీకి జగన్ షాక్!

ముఖ్యమంత్రి జగన్- ప్రధాని నరేంద్రమోడీకి షాక్ ఇచ్చారు. కేవలం మోడీకి మాత్రమే కాదు.. జగన్మోహన రెడ్డి భారతీయ జనతా పార్టీ కనుసన్నల్లో నడుస్తున్నాడని.. వారు ఏం చెబితే అదే ఆయనకు వేదమని.. వారి స్నేహం…

ముఖ్యమంత్రి జగన్- ప్రధాని నరేంద్రమోడీకి షాక్ ఇచ్చారు. కేవలం మోడీకి మాత్రమే కాదు.. జగన్మోహన రెడ్డి భారతీయ జనతా పార్టీ కనుసన్నల్లో నడుస్తున్నాడని.. వారు ఏం చెబితే అదే ఆయనకు వేదమని.. వారి స్నేహం కోసం అర్రులు చాస్తున్నాడని వ్యూహాత్మకంగా దుష్ప్రచారం సాగిస్తున్నవారికి  కూడా జగన్ షాక్ ఇచ్చారు.

మోడీ ప్రభుత్వం తీసుకునే ప్రతినిర్ణయానికి తాము జైకొట్టేది జరగదని, రాష్ట్రంలోని ప్రజల  మనోగతానికి అనుగుణంగా వర్తించడమే తమ ఎజెండా అని జగన్ స్పష్టం చేశారు. ఎన్‌పిఆర్ పై శాసనసభలో కొన్ని మార్పులు కోరుతూ తీర్మానం చేసి.. దానిని కేంద్రానికి పంపనున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.

సీఏఏ, ఎన్నార్సీ, ఎన్‌పీఆర్ వ్యవహారాలపై కొన్ని వారాలుగా దేశం గగ్గోలు అవుతున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్, ఢిల్లీలలో అదుపుతప్పిన అల్లర్లు ఎంతటి మారణకాండకు దారితీశాయో కూడా అందరికీ తెలుసు. అదే సమయంలో.. సీఏఏ, ఎన్నార్సీ చట్టాలపై వ్యతిరేకత దేశవ్యాప్తంగా కూడా విస్తరించింది.

ముస్లిం మైనారిటీలో భయాందోళనలు పెరుగుతున్నాయి. ఈ చట్టాల పట్ల వారు కొత్త భయాలను తెలుసుకుంటున్నారు. అనివార్యంగా స్థానిక ప్రభుత్వాలను తమకు మద్దతుగా ఉండాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అనేక సదస్సులు జరుగుతున్నాయి. స్థానిక నాయకులు ఈ సమావేశాల్లో పాల్గొన్నప్పుడు జగన్ ప్రభుత్వం ముస్లింలను భయపెట్టే ఏ నిర్ణయానికీ మద్దతివ్వదని స్పష్టం చేస్తూనే ఉన్నారు.

కాగా, మంగళవారం నాడు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ఆధ్వర్యంలో ముస్లిం పెద్దలు అనేకమంది జగన్ ను కలిశారు. తమలోని భయాలను వెళ్లబోసుకున్నారు. వారి బాధలను, భయాలను సావధానంగా విన్న జగన్మోహన రెడ్డికి వారికి భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందన్నారు.

భేటీ వెంటనే.. జగన్ ట్వీట్  చేస్తూ.. ఎన్పీఆర్ లో విధిగా కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని ఆమేరకు తమ ప్రభుత్వం రానున్న శాసనసభ సమావేశాలలో తీర్మానంచేసి కేంద్రానికి పంపుతుందని చెప్పారు. అయితే సీఏఏకు వైకాపారాజ్యసభలో మద్దతిచ్చిన నేపథ్యంలో సీఏఏ, ఎన్నార్సీల గురించి మాత్రం జగన్ తన ట్వీట్ లో ప్రస్తావించలేదు.