తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో నారా లోకేష్‌కి చుక్కలు చూపించారు వైసీపీ కార్యకర్తలు. ఇటీవల విశాఖలో చంద్రబాబుకి ఎయిర్ పోర్ట్ ప్రాంగణంలో దిమ్మ తిరిగిపోయే షాక్‌ని వైసీపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఇచ్చిన విషయం విదితమే. అచ్చం అలాంటి సన్మానమే ఈ రోజు చినబాబు నారా లోకేష్‌కి జరిగింది.. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి సంబంధించి చంద్రబాబు హయాంలో పెద్దయెత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తిన విషయం విదితమే. ప్రాజెక్టు నిర్వాసితుల్ని తీవ్ర ఇబ్బందులు పెట్టారనే విమర్శలు అప్పట్లో చాలా గట్టిగా విన్పించాయి కూడా.
ఆ నిర్వాసితులే, ఈ రోజు నారా లోకేష్ పర్యటనని అడ్డుకున్నారు. ఆ ఆందోళనకారులకు వైసీపీ కార్యకర్తలూ జతకూడారు. ‘పప్పు గో బ్యాక్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు వైసీపీ కార్యకర్తలు. ‘జయంతికీ వర్ధంతికీ తేడా తెలియని నారా లోకేష్..’ అంటూ ప్లకార్డులు కూడా దర్శనమిచ్చాయి. ఒకటా రెండా.? నారా లోకేష్ గుణగణాల్ని వివరిస్తూ చాలా ప్లకార్డులు కన్పించాయక్కడ.
అయితే, ఆందోళనకారులపై టీడీపీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. ఇరువర్గాలూ బాహాబాహీకి దిగాయి. దాంతో పోలీసులు రంగంలోకి దిగి, పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. మరోపక్క, షరామామూలుగానే పులివెందుల రౌడీలు, రాష్ట్రమంతటా అలజడి సృష్టిస్తున్నారంటూ నారా లోకేష్ నానా రకాల ఆరోపణలూ చేసేశారు. ‘ఖబడ్దార్..’ అంటూ హెచ్చరించేశారు కూడా.
పోలవరం ప్రాజెక్టుని పక్కన పెట్టి, ఎత్తిపోతల పథకాలపై గతంలో చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? ఈ క్రమంలో ఎన్ని విమర్శలు వచ్చినా, చంద్రబాబు మొండిగా తన పని తాను చేసుకుపోయారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం విషయంలో ఇంకా ఎక్కువ విమర్శలొచ్చాయి.. ఓ దశలో పనుల్ని న్యాయస్థానం నిలిపివేసింది కూడా.
తమను అక్రమంగా వేదించినందుకు బాధితులు నిరసన తెలుపుతోంటే, వారిని పులివెందుల రౌడీలనడమేంటి.? పైగా, తమ హయాంలో ఇలాంటి ఘనకార్యాలు ఎన్నో చేయించిన చంద్రబాబుకీ, చినబాబుకీ.. ఇప్పుడు మంటెక్కిపోవడమంటే అది వింతే మరి.!