కరోనా వైరస్.. ఇప్పటికే ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఉంది. అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. ఇది మానవాళిలోకి ప్రవేశించిన రెండు మూడు నెలల్లోనే కొన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారాన్ని కూడా ప్రభావితం చేస్తూ ఉంది. ఒక్క చైనాలోనే వేల మంది ఈ వైరస్ లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పటి వరకూ 60 దేశాల్లో కరోనా జాడను గుర్తించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఇండియాపై కూడా ప్రభావాన్ని చూపుతున్నట్టుగా ఉంది. అయితే ఇప్పటి వరకూ ఇండియాలో కరోనా నియంత్రణలో ఉన్నట్టే. ఇండియా వంటి వాతావరణ పరిస్థితుల్లో ఈ వైరస్ నియంత్రణ సాధ్యమే కావొచ్చు. ఆ సంగతలా ఉంటే.. ఇంతకీ కరోనా ఎలా వ్యాపిస్తోంది, దీని నివారణకు ఎలాంటి చర్యలు అవసరం అనే విషయం గురించి వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అవేమిటంటే…
-మానవుడి వెంట్రుకలో 900వ శాతం సైజు కన్నా తక్కువ పరిమాణంలో ఉంటుందట కరోనా వైరస్.
-ప్రధానంగా చాలా వైరస్ లు వ్యాపించే లాగా, అంటే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఒకరిని ఉంచి మరొకరికి ఈ వైరస్ వ్యాపిస్తుంది. అలాగే ఆల్రెడీ వైరస్ సోకిన ఒక మనిషికి అతి దగ్గరగా ఉన్నప్పుడు కూడా ఈ వైరస్ వ్యాపిస్తుంది.
-కరోనా సోకిన మనిషి నుంచి వెలువడే సలైవా నుంచి ఎక్కువగా ఈ వైరస్ వ్యాపిస్తుంది.
-ఒకవేళ ఈ వైరస్ సోకినా మనిషిలో ఉండే వ్యాధి నిరోధకత శక్తి ఈ వైరస్ ను మొదట్లోనే చంపేందుకు ప్రయత్నిస్తుంది. వ్యాధినిరోధకత శక్తి తక్కువగా ఉండటం, వయసు, అనారోగ్యం.. వంటి కారణాల వల్ల కరోనా వైరస్ ప్రభావం మనిషిపై పెరగవచ్చు.
-వ్యాధిగ్రస్తులకు కాస్త దూరం ఉండటం మంచిదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వైద్యులు చెబుతున్నారు. ఎంత దూరం ఉంటే అంత మంచిదని చెబుతున్నారు.
-మెటల్, గ్లాస్, ప్లాస్టిక్ వస్తువుల మీదకు చేరినా కరోనా వైరస్ కనీసం రెండు గంటల నుంచి తొమ్మిది రోజుల వరకూ ఇంకొకరికి వ్యాపించే అవకాశం ఉందని పరిశోధకులు తేల్చారు. దీంతో ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్టుంది.
-చైనాలో, హాంకాంగ్ గత ఏడాది డిసెంబర్ ఆఖర్లో కొన్ని ఫెస్టివల్స్ జరగడం, ఆ సమయంలో ప్రజలంతా దాదాపుగా ప్రయాణాలు చేయడం, వేల మంది ఒకే చోట గుమిగూడటం.. ఈ కారణాల చేతే ఎక్కువగా ఈ వైరస్ వ్యాపించిందని పరిశీలకులు చెబుతున్నారు.
-ఎదురింట్లోనో, పక్కింట్లోనో ఎవరైనా చీదుతూ, తుమ్ముతూ ఉంటే.. కాస్త ఎడంగా ఉండటమే ప్రస్తుతానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు.
-సెక్స్ వల్ల ఈ వైరస్ సంక్రమిస్తుందని డబ్ల్యూహెచ్ వో ఇంకా ధ్రువీకరించలేదు. ఇది సెక్సువల్ ట్రాన్స్ మీటెడ్ డిసీజ్ అవునా కాదా ఆ సంస్థ చెప్పాల్సి ఉంది. అయితే ముద్దుల వల్ల మాత్రం ఈ వైరస్ సంక్రమించే అవకాశాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
-చైనాలోని కొన్ని ప్రావీన్స్ లలో గత రెండు నెలలుగా చాలా మంది ఇళ్లకే పరిమితం అయ్యారు. ఆఫీసుల్లేవు. వర్క్ ఫ్రమ్ హోమ్ లే. విదేశాల్లో పని చేసే చైనా ఉద్యోగులు తమ దేశం వెళితే వారు మళ్లీ సరిహద్దులు దాటడం లేదు. మనిషీ మనిషీ కలవడానికి కూడా భయపడుతూ ఉన్నారు. అయినా ఇంకా అక్కడ పూర్తిగా నియంత్రణ కాలేదు.
-వీలైనంతగా సమూహాల్లోకి వెళ్లకపోవడం, వెళ్లాల్సి వస్తే మాస్క్ లు వంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే. అయితే ఇండియాలో ఈ వైరస్ మరీ ప్రమాదకరమైన స్థితిలో లేదు. ఒకరిద్దరిలో గుర్తించినా వారికి చికిత్స అందించి డిశ్చార్జి చేసి పంపారు వైద్యులు.