అనుభవానికి మించిన పాఠాలు లేవంటారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, అనేక పరీక్షలను దాటుకుని…చివరికి నష్టపోయామని తెలుసుకుని, వెనక్కు తిరిగి చూసుకుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటారు. అలాంటి వాళ్లు తమ జీవితానుభవాలను భవిష్యత్ తరాలకు గుణపాఠాలుగా చెబుతుంటారు.
పెళ్లికి ముందే తల్లై సమాజంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు బాలీవుడ్ నటి నీనా గుప్తా. వెస్ట్ ఇండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి, ఆ తర్వాత కళ్లు తెరిచేసరికి తానెంతో నష్టపోయానని గ్రహించారామె. పెళ్లి కాకుండానే 1989లో కూతురికి జన్మనిచ్చారు. ఆమే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా. కొంతకాలానికే నీనా గుప్తా, వివియన్ రిచర్డ్స్ విడిపోయారు. మళ్లీ వేర్వేరుగా వివాహాలు చేసుకున్నారు.
తన జీవితంలో ఎదురైన అనుభవాల నుంచి నేర్చుకున్న గుణపాఠాన్ని అభిమానులతో ఆమె తాజాగా పంచుకున్నారు. ముఖ్యంగా మహిళలు ఎలా ఉండాలో ఆమె సూచిస్తున్నారు. తనలా మరొకరి జీవితం నాశనం కావద్దని ఆమె కోరుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లయిన వాడితో మాత్రం ఎలాంటి సంబంధం పెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఓ వీడియో పోస్ట్ చేశారు.
‘అతను తన భార్య అంటే ఇష్టం లేదంటాడు. ఇంకా ఎంతోకాలం కలిసి ఉండలేం అని చెప్తాడు. అది నిజమేనని నమ్మి నువ్వు అతన్ని గాఢంగా ప్రేమిస్తావు. అతన్ని రహస్యంగా కలుస్తూ, షికార్లకు తిరుగుతూ, రాత్రిళ్లు ఏకాంతంగా గడుపుతూ ఇలా అన్నింటికీ ఒప్పుకుంటావు. అలా చాలారోజులు గడిచిపోతాయి. అయినా మొదటి భార్యతో విడాకులు అంత సులువు కాదు అంటూ ఏవేవో కుంటిసాకులు చెప్తూ మాట మార్చేస్తాడు. నా జీవితంలోనూ సరిగ్గా ఇలాంటిదే జరిగింది. ఆ సమయంలో ఎంతో వేదన అనుభవించా. అందుకే చెప్తున్నా.. దయచేసి ఎవరూ అలాంటి పిచ్చిపనులు చేయకండి. పెళ్లైన వ్యక్తితో అస్సలు ప్రేమలో పడకండి’ అంటూ సలహా ఇచ్చారు.
ఈ మాటలే కాదు, ఇంకా అనేక విలువైన సందేశాన్ని ఆమె ఆ వీడియోలో ఇచ్చారు. ప్రతి మాట ఓ బుల్లెట్‌లా ఆమె నోటి నుంచి దూసుకొచ్చింది. తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఆమె కళ్లకు కట్టారు.