వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా తనదైన శైలిలో చంద్రబాబు, బోండా ఉమలపై అదిరిపోయే పంచ్‌లు విసిరారు. తమపై విసిరిన విమర్శల బౌన్సర్లకు టీడీపీ అధినేత చంద్రబాబు, బోండా ఉమ గిలగిల కొట్టుకోవాల్సిందే. తాడేపల్లిలో మంగళవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బాబుతో పాటు టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం పోవడంతో టీడీపీ నేతలు పిచ్చెక్కి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
కల్లు తాగిన కోతుల్లా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యేతో శాసనసభలో మద్యం బ్రాండ్స్ గురించి మాట్లాడించిన ఘనత బాబుకే దక్కుతుందన్నారు. మద్యం ధరలు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినట్లు టీడీపీ నేతలు భాధపడుతున్నారన్నారని రోజా ఎద్దేవా చేశారు.
టీడీపీ హాయాంలో ఒక్క బెల్ట్ షాపు అయినా తగ్గించారా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 20 శాతం షాపులను తగ్గించారని వివరించారు. బోండా ఉమ లిక్కర్ షాప్‌లో వర్కర్‌లా మాట్లాడుతున్నారని రోజా అదిరిపోయే పంచ్ విసిరారు. టీడీపీ కార్యాలయాలను లోకేష్ మద్యం దుకాణాలుగా మార్చారన్నారు. బీరును హెల్త్ డ్రింక్ అని గతంలో టీడీపీ నేత జవహర్ పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. ప్రజల కోసం పనిచేస్తున్న సీఎం జగన్‌పై టీడీపీ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.