చీప్ ట్రిక్స్ ను ప్రదర్శించడంలో తెలుగుదేశం పార్టీ వీరాభిమానులకు హద్దు లేకుండా పోతూ ఉంది. ఇప్పటికే అమరావతి విషయంలో హద్దుల్లేని వేషాలు వేశారు. మోడీ అయిపోయింది, ట్రంప్ మాస్కులూ అయిపోయాయి.. ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎక్కారట. ఏపీ రాజధానిగా అమరావతి నే కొనసాగించాలంటూ తెలుగుదేశం భక్తులు కొందరు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో పిటిషన్ దాఖలు చేశారట. ఆ పిటిషన్ ను ఆ న్యాయస్థానం విచారించేస్తుందట కూడా!
ఇంకేముంది… అయిపోయినట్టే! అమరావతికి మళ్లీ మంచి రోజులు వచ్చేసినట్టే!అంతర్జాతీయ న్యాయస్థానం అంటే మాటలా.. సుప్రీం కోర్టు కన్నా పెద్దే సుమా! జగన్ కు ముకుతాడు వేసేస్తుంది, ఏపీకి మూడు రాజధానులు ఎందుకని జగన్ కు నోటీసులు ఇచ్చేస్తుంది! అమరావతే రాజధాని అని ఆర్డర్ ఇచ్చేస్తుంది. ఇంతటితో జగన్ మూడు రాజధానుల ఫార్ములా అటకెక్కినట్టే! అంతర్జాతీయ న్యాయస్థానం అంటే మాటలా మరి! తెలుగుదేశం పార్టీ మేధావులు అదేదో పెద్ద కోర్టు అని దానిలో పిటిషన్ వేసేసినట్టుగా ఉన్నారు.
అయితే కాస్తైన ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్లు ఆలోచించాల్సిన అంశం ఏమిటంటే.. ఒక దేశ సార్వభౌమాధికారంలోకి అంతర్జాతీయ న్యాయస్థానం తలదూరుస్తుందా? అందునా తమ రాష్ట్ర పరిధిలో రాజధాని ఎక్కడ ఉండాలనే అంశం గురించి ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, అందులోని తర్కాలను ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ప్రశ్నిస్తుందా? ఏ దేశంలో ఏ రాష్ట్రానికి ఏది రాజధానిగా ఉండాలి? అనే అంశాలను ప్రభావితం చేసే శక్తి కానీ, ఆ ఆసక్తి కానీ, అందులోని తర్కాలను ప్రశ్నించే హక్కు కానీ.. ఆ న్యాయస్థానానికి ఉంటుందా? కాస్తైనా సెన్స్ ఉన్న వాళ్లు ఎవరికైనా ఆ విషయాలు అర్థం అవుతాయి. అయితే పచ్చ దళానికి మాత్రం అలాంటి అంశాలతో పని లేదు. అమరావతి పేరిట ఏదో ఒక హైడ్రామా నడిపించాలి, అలాంటి చీప్ ట్రిక్స్ లో ఇదీ భాగం తప్ప అంతకు మించి ఈ పిటిషన్ కు చిత్తు కాగితానికి ఉండే పాటి విలువ కూడా ఉండకపోవచ్చు.
అయినా తెలుగుదేశం జనాలు ఇంతటితో ఆగితే సరిపోదేమో! రేపోమాపో చంద్రమండలానికి, వీలైతే ఇతర గ్రహాంతర వాసులు ఎవరైనా ఉంటే వారికి కూడా..తమ ఫిర్యాదులను పంపిస్తే మరింత ప్రచారం వస్తుందేమో. బహుశా పచ్చబ్యాచ్ తదుపరి ప్రయత్నాలు ఇలానే ఉంటాయేమో!