పోయిన ఆస్తి పోతే పోయింది కానీ కోర్టు పద్దతులు తెలిసివచ్చాయి అన్నాడట వెనకటికి ఎవడో. సైరా సినిమా వల్ల నలభై కోట్ల మేరకు నష్టాలు వస్తే వచ్చాయి కానీ, నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవికి సర్వం తెలిసివచ్చింది. రామ్ చరణ్ నిర్మాత అంటే చిరంజీవి కూడా నిర్మాత అనేగా. అందువల్ల ఎక్కడ ఏం జరుగుతోంది? ఎక్కడ వృధా అవుతోంది అన్నది క్లియర్ గా తెలిసివచ్చినట్లుంది.
కేరవాన్ ల సంస్కృతి అన్నది ఇప్పుడు బాగా పెరిగింది. క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా క్యారవాన్ లు ఇవ్వాల్సి వస్తోంది ఇప్పుడు. ఒక్కో కేరవాన్ కు రోజుకు ఏడు వేల వరకు అద్దె వుంటోంది. వంద రోజుల షూట్ అంటే కనీసం ఏడులక్షలు. అదీ ఒక్క కేరవాన్ కు. మరి షూట్ అంటే కనీసం అరడజను కేరవాన్ లు తప్పడం లేదు. అంటే అర కోటి హాంఫట్ అన్నమాట.
అంతే కాదు, కేరవాన్ ల్లో సేదతీరే నటులను షాట్ రెడీ అంటూ పిలవడానికి అసిస్టెంట్ డైరక్టర్లను మరే పని చెప్పకుండా ఇదే పని మీద వుంచాల్సి వస్తోందట. అది కూడా వృధానే కదా. అందుకే ఇప్పుడు మెగాస్టార్ ఇదంతా మారాలి అంటూ ప్రవచిస్తున్నారు. నటులు అంతా చక్కగా కుర్చీల్లో సెట్ లోనే కూర్చుంటే, షూటింగ్ చకచకా జరిగిపోతుంది. కాలం, డబ్బు ఆదా అవుతుంది. కేరవాన్ ల డబ్బు ఆదా అవుతుంది. ఇంకా చాలా చాలా అంటున్నారు.
ప్రతి హీరో నిర్మాతగా మారితే, ఇలా నిర్మాతల కష్టాలు, వృధా ఖర్చులు తెలిసి వస్తాయేమో? నిర్మాతగా మారడం అంటే కాల్ షీట్లు ఇవ్వడానికి లాభాల్లో వాటా కోసం పేరు వేసుకునే నిర్మాతగా కాదు, స్వంత డబ్బులు తీసి, సినిమా తీసే నిర్మాతగా మారితే, మెగాస్టార్ మాదిరిగానే మంచి విషయాలు నేర్పే ప్రయత్నం చేస్తారేమో?
అంతా బాగానే వుంది. తండ్రి మాటను ఆదర్శంగా తీసుకుని, కేరవాన్ లో కాకుండా సెట్ లోనే కూర్చునే సంప్రదాయానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెరతీస్తే, మిగిలిన వారు ఫాలో..ఫాలో అంటారేమో ?