'బాహుబలి' తర్వాత ఆ స్థాయిలో మరే ఇండియన్ సినిమా వసూళ్ళను సాధించలేకపోయింది. 'థగ్స్ ఆఫ్ హిందోస్తాన్'పై భారీ అంచనాలు నెలకొన్నా, అత్యంత ఘోరమైన పరాజయం చవిచూడాల్సి వచ్చింది. అమీర్‌ఖాన్, అమితాబ్ బచ్చన్ వంటి హేమాహేమీలు 'థగ్స్ ఆఫ్ హిందోస్తాన్'ని కాపాడలేకపోయారు. అమీర్‌ఖాన్ కెరీర్లో తొలిసారిగా, ఎగ్జిబిటర్లు – డిస్ట్రిబ్యూటర్లకు తిరిగి డబ్బులు చెల్లించాల్సిన వస్తోందిప్పుడు. 'మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్' ఇలా చేశాడేంటి.? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
ఇక, ఇప్పుడు '2.0' సినిమాపై 'బాహుబలి' తరహా అంచనాలేర్పడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాపై ఆసక్తివున్న మాట వాస్తవం. ప్రపంచ వ్యాప్తంగా అని ఎందుకు అనాల్సి వస్తోందంటే, వివిధ దేశాల్లో రజనీకాంత్ అభిమానులు ఆ స్థాయిలో వున్నారు మరి. భారతదేశానికి చెందిన ఓ నటుడిపై వివిధ దేశాల్లో ఈస్థాయి ఫాలోయింగ్ వుండడం.. అదీ రజనీకాంత్‌కే చెల్లింది.
అయినాసరే, రజనీకాంత్‌కి ఇటీవలి కాలంలో సరైన సక్సెస్‌లు లేవు. సూపర్ స్టార్ అనే ఇమేజ్ ఇటీవలి కాలంలో బాగా మసకబారిపోయింది. చేస్తున్న ప్రతి సినిమా పరాజయం పాలవడమే కాదు, సినిమా విడుదలయ్యాక డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆయా సినిమాల కారణంగా తాము నష్టపోయిన వైనాన్ని చెప్పుకుంటూ, ఆందోళనలు కూడా చేయాల్సి వస్తోంది.
ఈ నేపథ్యంలో '2.0' సినిమా, పెరుగుతున్న అంచనాల్ని తట్టుకుంటుందా.? లేదా.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఇది శంకర్ సినిమా.. అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే, శంకర్ 'ఐ' సినిమాతో ఎంతలా నిరాశపర్చాడో చూశాం.
శంకర్ – రజనీకాంత్ కాంబినేషన్లో వచ్చిన 'రోబో' హిట్టయ్యింది గనుక.. ఇదీ హిట్టవుతుందనే నమ్మకం చాలామందిలో వుండడం సహజం. కానీ, ఈక్వేషన్స్ మారిపోయాయి. '2.0' సినిమా ఏడాది క్రితమే విడుదల కావాల్సి వుంది.. అనివార్య కారణాలతో సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చి, ఎట్టకేలకు ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఏదేమైనా.. ఇప్పటికైతే, 'బాహుబలి'ని టార్గెట్‌గా చేసుకుని వచ్చిన ఏ సినిమా నిలదొక్కుకోలేకపోయింది. అంచనాల పరంగా పీక్స్‌లోకి వెళ్ళిన 'థగ్స్ ఆఫ్ హిందోస్తాన్' దారుణమైన రిజల్ట్ చవిచూసిన దరిమిలా, '2.0' సినిమాపై అంచనాలు, రజనీకాంత్ అభిమానుల్నీ భయపెడ్తున్నాయి.
అంచనాల్ని అందుకుంటే మాత్రం, 'బాహుబలి'కి ధీటైన సినిమా అయ్యే అవకాశాలు '2.0'కి వున్నాయన్నది నిర్వివాదాంశం.
కులం చెడ్డా సుఖం దక్కుతోందా! చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్