తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ కదిలారు. ఎన్నికలు అయిపోయిన మూడు సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనలను చేపట్టారు. పదే పదే ముందస్తు ఎన్నికలు అంటున్న చంద్రబాబు నాయుడు ఆ మేరకు తన పని మొదలుపెట్టుకున్నట్టుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు జనం మధ్యకు వెళ్లడం గురించి కాదు కానీ, ఈ వయసులో ఆయన స్వయంగా తనే రంగంలోకి దిగడం మాత్రం అనేక రకాల విశ్లేషణలకు దారి తీస్తోంది.
ప్రస్తుతం చంద్రబాబు నాయుడు వయసు 72 సంవత్సరాలు. రాజకీయాల్లో ఇది పెద్ద వయసు కాదు అని వాదించినా, ఒక రాజకీయ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడే వయసు అయితే ఇది కాదు! అది కూడా 23 సీట్లకు పరిమితం అయ్యాకా, సొంతంగా మళ్లీ కూడా అధికారంలోకి రావడం కష్టం అయ్యాకా.. అన్నింటికీ మించి తన కన్నా వయసులో చాలా చిన్నవాడైన, జనాల్లో పట్టు సంపాదించిన నాయకుడిని ఎదుర్కొనదగ్గ వయసైతే ఇది కాదు!
ఒకవేళ చంద్రబాబుకు ఈ సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డే ప్రత్యర్థిగా ఉండి ఉంటే, ఇప్పుడు చంద్రబాబు వయసు గురించి అనడానికి ఏమీ లేదు! వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడి చేతిలో చంద్రబాబు చిత్తయ్యాడు. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బాధ్యతలను లోకేష్ తీసుకుని కష్టమో, నష్టమో పోరాడి ఉంటే… అదో రకం!
అయితే లోకేష్ పై జనాలకు ఏమో కానీ చంద్రబాబుకే నమ్మకం లేనట్టుగా ఉంది. లోకేష్ ను ఒకవైపు రాజకీయ వారసుడిగా ప్రొజెక్ట్ చేసుకుంటూ కూడా.. మరోవైపు ఆయనకు పూర్తి బాధ్యతలు కానీ, ఫ్రీ హ్యాండ్ కానీ ఇవ్వడం లేదని అడుగడుగునా స్పష్టం అవుతూనే ఉంది.
ఇప్పుడు లోకేష్ కు పగ్గాలు అప్పగిస్తే మహా అంటే జరిగే నష్టం వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయే ప్రమాదం ఉండవచ్చు. అలాగని చంద్రబాబు నాయుడు తిరిగినా ఫలితంలో పెద్ద మార్పేమీ ఉండదు. కానీ ఇప్పుడు ధైర్యం చేసి లోకేష్ కు పగ్గాలు అప్పగిస్తే.. 2029 ఎన్నికల నాటికి అయినా లోకేష్ కు రాజకీయంలో డక్కామొక్కీలు తెలుస్తాయి!
వచ్చే ఎన్నికల విషయంలో కూడా చంద్రబాబు నాయుడే అంతా తానై వ్యవహరించి, టీడీపీని ఎన్నికలకు తీసుకెళితే, అప్పుడు ఫలితంలో తేడా వస్తే.. అప్పటికీ పార్టీ శ్రేణుల్లో నిస్పృహ తీవ్ర స్థాయికి చేరుతుంది. వచ్చే ఎన్నికల్లో ఓడితే, చంద్రబాబే పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుని కొడుకు బాధ్యతలు అప్పగించవచ్చు. కానీ, అప్పటికే తీవ్రమైన నష్టం జరిగినట్టే. వరసగా రెండు సార్లు ఓడాకా.. లోకేష్ అనుభవానికి, ఆయన ట్యాలెంట్ కూ పార్టీని డీల్ చేసే శక్తి సామార్థ్యాలు ఉంటాయని ఎవ్వరూ అనుకోరు!
ఇప్పుడు చంద్రబాబు చేయాల్సింది జనం మధ్యకో, పార్టీ శ్రేణుల మధ్యకో వెళ్లడం కాదు. తనయుడిని పంపడం. వీలైతే గైడ్ చేయడం. కోచ్ గా పని చేయాల్సిన వయసులో చంద్రబాబు నాయుడు ప్లేయర్ గా తాపత్రయపడుతున్నారు. ఎంత గొప్ప ప్లేయర్ అయినా, ఓల్డ్ ఏజ్ లో ఎవరినీ ఆకట్టుకోలేడు. ఇలాంటి వారి ఆటలను చూడటానికి కూడా జనాలు ఇష్టపడరు. మరి చంద్రబాబుకు ఈ విషయం బోధపడటం లేదేమో!