కాంగ్రెస్ పార్టీలో మిగిలిన స్క్రాప్ మెటీరియల్ ను భారతీయ జనతా పార్టీ సొంతం చేసుకుంటూ ఉంది. పంజాబ్ లో కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సునీల్ ఝక్కర్ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన పుచ్చుకోవడం ఎలా ఉన్నా.. ఆయనను బీజేపీ సొంతం చేసుకోవడమే ఆశ్చర్యకరంగా ఉంది.
తనకు కాంగ్రెస్ తో అనుబంధం 50 సంవత్సరాలది అని ఝక్కర్ ప్రకటించుకున్నారు. అలాంటి బంధాన్ని తెంచుకుని ఈయన బీజేపీలో చేరారు పాపం! అది కూడా ఇటీవల పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది కాబట్టి! కాంగ్రెస్ చేతిలో అటు కేంద్రంలో అధికారంలో లేదు, ఇప్పుడప్పుడే అందే దాఖలాలు కనిపించడం లేదు. పంజాబ్ లో ఆ పార్టీ ఉండేది కాబట్టి..పవర్ కు డోకా లేదు ఇన్నాళ్లు.
ఇప్పుడు పంజాబ్ లో కూడా కాంగ్రెస్ ఓడటంతో.. నెలలైనా గడవక ముందే ఈ సీనియర్ కాంగ్రెస్ నేత, బీజేపీ నేతగా మారిపోయారు. పార్టీలు అధికారం కోల్పోగానే ఇలా బిచాణాలు ఎత్తేసే బ్యాచ్ ను జనాలు చిన్నచూపు చూస్తారు. కానీ బీజేపీకి అలాంటి ఇబ్బంది లేదు!
ఇప్పటికే కాంగ్రెస్ నుంచి చాలా మంది నేతలకు బీజేపీ వెల్కమ్ చెప్పింది. కాంగ్రెస్ రాజకీయ వారసులు, కురువృద్ధ కాంగ్రెస్ నేతలూ.. ఇలాంటి వాళ్లెంతో మంది ఇప్పుడు కమలం పార్టీ కండువాలు వేసుకుని తిరుగుతున్నారు. వారసత్వ రాజకీయాలను నిరసించే పార్టీ కాంగ్రెస్ నేతల తనయులకు రెడ్ కార్పెట్ లు పరిచి మరీ చేర్చుకుంది.
ఝక్కర్ లాంటి కురువృద్ధులకూ, అవకాశవాదులకూ కూడా కమలం పార్టీ స్థానం కల్పిస్తూ ఏం సందేశం ఇస్తున్నట్టో!