సినిమా వాళ్ల టికెట్ రేట్ల వ్యవహారం పై వాళ్లలో వాళ్లకే ఒక ఏకాభిప్రాయం ఉందో లేదో కానీ.. ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలను, అవసరానికి తగ్గట్టుగా మార్చేసుకోవగ సినీ జనాలు టికెట్ల రేట్ల వ్యవహారంలో ఇప్పుడు కొత్త రకంగా మాట్లాడుతున్నారు. మొన్నటి వరకూ టికెట్ రేట్ల పెంపు వ్యవహారంలో బాగా నానిన పేరు నిర్మాత దిల్ రాజుది.
సినిమా టికెట్ రేట్లను తమకు అయిన కాడికి పెంచుకునే అవకాశం ఇవ్వడం లేదంటూ జగన్ మోహన్ రెడ్డిని పవన్ కల్యాణ్ నిందించిన సినిమా ఫంక్షన్లో కూడా దిల్ రాజు ఉన్నారు. ఆ సమయంలో చిరునవ్వులు చిందిస్తూ దిల్ రాజు, ఆ తర్వాత సినిమా టికెట్ రేట్ల వ్యవహారంలో పరిశ్రమ తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసిన వారిలో ఒకరు. ఎట్టకేలకూ సినీ పరిశ్రమ పెద్ద మనుషులు తమకు కావాల్సిన విధంగా సినిమా టికెట్లను పెంచుకుంటూ ఉన్నారు.
అయితే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఈ మధ్యకాలంలో వచ్చిన కళాఖండాల దెబ్బకు.. టికెట్లను అధికధరకు విక్రయిస్తే..ఆ సినిమాలకు డివైడ్ టాక్ వచ్చినప్పుడు మొత్తానికే తేడా కొట్టేస్తుందని అర్థం అయ్యింది సినిమా వాళ్లకు. ఇలాంటి విషయంలో తెలివైనవారైన దిల్ రాజు.. తన తదుపరి సినిమాకు అధిక టికెట్ల ధర వద్దంటున్నారు!
అదేమంటే ఆయనో రీజన్ కూడా సెలవిచ్చారు. టికెట్లను అధిక ధరకు అమ్మడం వల్ల మధ్యతరగతి థియేటర్ కు దూరం అయ్యిందని ఆయనకు తెలిసొచ్చిందట. అందుకే ఎఫ్ త్రీ విషయంలో టికెట్ల ధర అదనపు పెంపు ఏమీ ఉండదట. సినిమా టికెట్ ధర ఎక్కువ పెడితే పెట్టుబడులు త్వరగా వచ్చేస్తాయని, అయితే తక్కువ ధరకు అమ్మితే మళ్లీ మళ్లీ చూసే ప్రేక్షకులు వస్తారంటున్నారు ఈ సీనియర్ నిర్మాత!
మొత్తానికి చాలా త్వరగానే జ్ఞానోదయం అయినట్టుగా ఉంది. టాలీవుడ్ తీసే కళాఖండాలకు ఒక్కో టికెట్ కు నాలుగైదు వందలు పెట్టి చూసే వాళ్లు ఉండరని, డివైడ్ టాక్ కనుక వస్తే .. రెండో రోజుకే బుకింగ్స్ ఉండవనే విషయాన్ని సినిమా జనాలు అర్థం చేసుకున్నారు. అందుకు నిదర్శనం లాగుంది దిల్ రాజు స్పందన!