పాపం.. వివాదాస్పదుడైన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ప్రజాధనం వృథా కావడం గురించి దారుణంగా చింతిస్తున్నారు. ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగం చేయకుండా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. అందుకు ప్రభుత్వానికి ఉచితంగా సలహాలు కూడా ఇస్తున్నారు.
ఇంతకూ విషయం ఏమిటంటే.. ఏబీ వెంకటేశ్వరరావు అనే అధికారి చంద్రబాబు నాయుడు పాలనలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉంటూ పలు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల మీద వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దానిపై కోర్టుకు వెళ్లిన ఏబీవీ నెగ్గారు. ఆయన సస్పెన్షన్ ఎత్తేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఎట్టకేలకు సస్పెన్షన్ తొలగిపోయింది. అయితే ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.
అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేక మంది అధికారులను ప్రభుత్వం జీఏడీకి ఎటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం చాలా మామూలు సంగతి. అయితే తిరిగి విధుల్లోకి వచ్చిన ఏబీ వెంకటేశ్వరరావు తన జీతం గురించి ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నారు. జీఏడీలో పనిలేకుండా కూర్చోబెట్టడం వలన తనకు జీతం ఇస్తారో లేదోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కనీసం ఒక నెల పనిచేసిన తర్వాత.. జీతం రాకపోతే.. అప్పుడు ఈ విషయం మాట్లాడితే మర్యాదగా ఉండేది. కానీ.. జగన్ ప్రభుత్వం మీద బురద చల్లడమే తన కార్యక్రమంగాపెట్టుకున్న ఏబీవీ ఇటు విధుల్లోకి వచ్చిన నాటినుంచే నాటకం మొదలెట్టారు.
జీఏడీకి ఎటాచ్ చేసిన చాలా మందికి జీతాలు ఇవ్వడం లేదని అంటున్నారు. ఒకవేళ తనకు పోస్టింగు ఇవ్వకుండా జీతం ఇచ్చినా కూడా.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టేనని పాపం ఆయన ప్రజాధనం గురించి ఆవేదన చెందుతున్నారు.
ఆయన అవినీతి పరుడని భయపడి.. ప్రభుత్వం పోస్టింగు ఇవ్వకుండా కూర్చోబెట్టగా.. అలా కూర్చోబెట్టడం వల్ల ప్రజాధనం వేస్టవుతున్నదని ఆయన ఆవేదన చెందడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంది.
పోస్టింగ్ ఇస్తే.. ప్రజలను ప్రభుత్వాన్ని ఎడాపెడా దోచేస్తాడనే భయంతోనే ఆయనను దూరం పెట్టారనేది అందరూ అనుకుంటున్న సంగతి. ఆయన మాత్రం రివర్స్ స్ట్రాటజీ తో ఇలాంటి ప్రజాధనం గురించిన విలాపాలు చేయడం విశేషం!