స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారంలో హైకోర్టు ఏం తీర్పు చెబుతుందనే మీమాంస నిన్నటిదాకా ఉంది. ఇవాళ ఆ సందిగ్ధం తొలగిపోయింది. స్థానిక ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలిపి 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. గతంలో ఉన్న సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా 50 శాతానికి దాటిన రిజర్వేషన్లు చెల్లవని తేల్చింది. దీంతో మార్చినెలలో మొదలవుతుందనుకున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కనీసం రెండునెలలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. పర్యవసానంగా. జగన్ సర్కారు బడ్జెట్ సమావేశాలకు ఎలాంటి ఆటంకం లేదని మాత్రం అర్థమవుతోంది.
వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థలకు గరిష్టంగా ప్రయోజనం కల్పించే ఉద్దేశంతో జగన్ సర్కారు రిజర్వేషన్ల కోటాను మార్చింది. ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లడంతో.. ఇన్నాళ్లూ తీర్పు కోసం నిరీక్షిస్తున్నారు. స్థానిక ఎన్నికలకు యంత్రాంగం మొత్తం సిద్ధం అయింది. నేడో రేపో హైకోర్టు తీర్పు వచ్చేస్తుందనే ఉద్దేశంతో వారం రోజులుగా ఎన్నికల నిర్వహణకు కసరత్తులు చేస్తున్నారు. ఏ క్షణమైనా స్థానిక ఎన్నికలు జరగవచ్చునంటూ మంత్రి కూడా గతంలో ప్రకటించారు. జిల్లా అధికార యంత్రాంగాన్ని ఎన్నికల సంఘం అప్రమత్తం చేసింది కూడా.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చి.. మార్చి నెలలోనే ఎన్నికలు జరిగేట్లయితే గనుక.. బడ్జెట్ సమావేశాలకు అవి ఆటంకం అవుతాయేమోననే అభిప్రాయం కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పూర్తి బడ్జెట్ పెట్టే అవకాశం ఉండకపోవచ్చునని.. ప్రస్తుతానికి ఒకటిరెండునెలలకోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వస్తుందని అనుకున్నారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి తప్పింది.
59.85 శాతం రిజర్వేషన్ల చెల్లవని చెప్పిన హైకోర్టు.. బీసీ రిజర్వేషన్లను నెలలోగా మళ్లీ ఖరారు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంటే నెలలోగా ప్రభుత్వం మళ్లీ బీసీ రిజర్వేషన్లను ఖరారుచేస్తుందా… లేదా, హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళుతుందా అనేది తేలలేదు. ఏది ఏమైనప్పటికీ.. ఈ నెలలో బడ్జెట్ సమావేశాలకు ఇబ్బంది లేదు. జగన్ సర్కారు పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టవచ్చు.