నిర్భయ తల్లి ప్రశ్న: వ్యవస్థ క్రిమినల్స్‌ కోసమే వుందా.?

ఢిల్లీలో కొన్నేళ్ళ క్రితం జరిగిన దారుణ అత్యాచార ఘటనలో బాధితురాల్ని ‘నిర్భయ’గా వ్యవహరిస్తున్నాం. అత్యంత పాశవికంగా ఆమెపై కొన్ని మానవ మృగాలు దాడి చేశాయి. తీవ్ర గాయాలతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత…

ఢిల్లీలో కొన్నేళ్ళ క్రితం జరిగిన దారుణ అత్యాచార ఘటనలో బాధితురాల్ని ‘నిర్భయ’గా వ్యవహరిస్తున్నాం. అత్యంత పాశవికంగా ఆమెపై కొన్ని మానవ మృగాలు దాడి చేశాయి. తీవ్ర గాయాలతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత ప్రజాగ్రహం పెల్లుబికింది.. దేశ రాజధాని ఆందోళనలతో అట్టుడికిపోయింది. ఈ క్రమంలోనే నిర్భయ చట్టం తెరపైకొచ్చింది. ఆ తర్వాత మళ్ళీ అలాంటి సంఘటనలు జరగలేదా.? అంటే, జరుగుతూనే వున్నాయి. తాజాగా దిశ పేరుతో ఆంధ్రప్రదేశ్‌ ఇంకో చట్టం తీసుకురావాల్సి వచ్చింది. అయినా, మహిళలపై అకృత్యాలు ఆగడంలేదు.

ఇదిలా వుంటే, నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఎప్పుడో ఉరిశిక్ష అమలు కావాల్సి వుంది. దురదృష్టవశాత్తూ అది పదే పదే వాయిదా పడుతూ వస్తోంది. దోషులు తెలివిగా, వ్యవస్థలోని లోపాల్ని తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. ఇంతటి దయనీయ స్థితిపై నిర్భయ తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు.. పదే పదే న్యాయం కోసం ఆ తల్లి న్యాయస్థానాల సాక్షిగా బోరున విలపిస్తున్నారు.

తాజాగా మరోమారు నిర్భయ నిందితులకు ఉరిశిక్ష వాయిదా పడింది. డెత్‌ వారెంట్‌ జారీ అయ్యాక మరణ శిక్ష వాయిదా పడటం ఇది ముచ్చటగా మూడో సారి. దాంతో నిర్భయ తల్లి మరోమారు బోరున విలపించారు.. వ్యవస్థ మీద తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘ఈ వ్యవస్థ కేవలం క్రిమినల్స్‌ని కాపాడేందుకే వుంది.. న్యాయం కోసం ఏళ్ళ తరబడి నిరీక్షిస్తున్న మాకు న్యాయం జరిగేలా కన్పించడంలేదు..’ అంటూ కన్నీరు మున్నీరయ్యారు నిర్భయ తల్లి.

ఇలాంటి సందర్భాల్లోనే, ఇన్‌స్టంట్‌ జస్టిస్‌ అనే అంశం తెరపైకొస్తుంటుంది. దిశ ఘటనలో నిందితులు ఎన్‌కౌంటర్‌లో చనిపోతే.. అప్పట్లో పోలీసు వ్యవస్థపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. అది చట్ట సమ్మతం కాకపోయినా, వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతి, అక్రమాలు, అలసత్వం.. ఇతరత్రా లోటుపాట్ల నేపథ్యంలో.. ప్రజలు ఇన్‌స్టంట్‌ జస్టిస్‌ కోరుకోవడం  జరుగుతోంది.

తాజా పరిణామాల నేపథ్యంలో నిర్భయ కేసులో దోషులకు ఇంకో 14 రోజుల వరకూ మరణ శిక్ష అమలు చేసే అవకాశాలు లేనట్లే తెలుస్తోంది.