కొందరు ఏవేవో వ్యాఖ్యలు చేస్తున్నా నేను పురాణ సంబంధమైన విషయాలపై విరివిగా రాయబోతున్నాను. కారణం ఏమిటంటే మనలో చాలామందికి మన పురాణాల గురించి పూర్తిగా తెలియదు. మా తరంలో బాలల బొమ్మల రామాయణం.. లాటివి చదివేవాళ్లం, తర్వాతి తరం వాళ్లు అమర్ చిత్ర కథ కామిక్స్ చదివారు. చాలామంది పుస్తకాల జోలికి వెళ్లకుండా సినిమాలు, సీరియల్స్‌తో సరిపెట్టారు. వందలాది పేజీలున్న మూలగ్రంథాలు గ్రాంథిక భాషలో చదివేవారు అరుదు. అయితే కాస్త వయసు వచ్చాక క్యూరియాసిటీ పెరుగుతోంది. టీవీ ఛానెళ్లలో, యూట్యూట్‌లో ప్రవచనాలు వింటున్నారు. వీటికి ఆదరణ రావడంతో చెప్పేవాళ్లు ఎక్కువై పోయారు.
గతంలో గుళ్లల్లో పురాణాలు చెప్పే శాస్తుర్లతో ఫర్వాలేదు. పురాణాల్లో ఉన్నది యథాతథంగా చెప్పేవారు. శ్రావ్యంగా పద్యాలు పాడేవారు. శ్రోతలు కూడా- అలా ఎలా ఎందుకు చేశాడు? ఇలా ఎందుకు చేయలేకపోయాడు? వంటి ప్రశ్నలు అడిగేవారు కాదు. అయితే నేటి సమాజం మారింది. చిన్నపిల్లలు సైతం నిర్భయంగా తమ సందేహాలను వెలిబుచ్చుతున్నారు. రథచక్రం భూమిలో క్రుంగింది, బయటకు తీస్తున్నా, కాస్త ఆగు, అప్పుడే బాణం వేయకు అని అడిగిన కర్ణుడిపై అర్జునుడు బాణం వేయడం తప్పు కదా అనే లాజిక్కు లాగుతున్నారు. ఇలాటి రిడిల్స్‌ను ఎదుర్కోవడానికి ప్రవచనకారులు ‘ఇందులో ఒక దేవరహస్యం ఉంది’ అంటూ ఏవేవో కల్పించి చెప్పేస్తున్నారు. మూలంలో అది లేదు కదా అంటే, ఎక్కడో జానపదగాథలో ఉందంటారు.
వీరికి ప్రతిగా పురాణాలను వ్యతిరేకించేవాళ్లు బయలుదేరారు. రాక్షసులకు నీలం రంగు పులిమి, వాళ్లంతా ఉత్తమోత్తములని, దళితులని, అగ్రకులాల అన్యాయాలకు బలై పోయారని కథలు సృష్టించసాగారు. హిడింబాసురుడు గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్యమం ప్రారంభిస్తే కురురాజులైన దుర్యోధనుడు, ధర్మరాజు తమలో తాము కుమ్మక్కై, లాక్షాగృహదహనమనే నాటకం ఆడి భీముడి చేత హిడింబుణ్ని చంపేసి, అతని సోదరిని చెఱచి, ఉద్యమాన్ని నామరూపాలు లేకుండా చేశారని ఓ నాటకం కూడా రాసేసే పరిస్థితి వచ్చింది. వీళ్లూ ఏ ఆధారాలూ చూపరు. అసు అప్పట్లో దళితకులం ఉందా? అని అడిగినా విరుచుకు పడిపోతారు.
మనం మూడ్‌ను బట్టి కాస్సేపు అటూ, కాస్సేపు యిటూ మొగ్గు చూపుతూ ఉంటాం. చిన్నప్పణ్నుంచి వింటూ వచ్చిన దాని కంటె డిఫరెంట్‌గా, వెరైటీగా ఎవరేం చెప్పినా కాస్త ఎక్సయింట్‌గా ఉంటుంది. అది గ్రహించి యిటీవల ఇండియన్ రచయితలు ఇంగ్లీషులో పురాణాల పేరు చెప్పి తెగ రాసేస్తున్నారు. తమకు తోచిన విధంగా మలిచేస్తున్నారు. అవి చదివి నమ్మేస్తున్నాం కూడా. ఎందుకంటే మన విశ్వాసాలు మరీ అంత దృఢమైనవి కావు. మనకు యీ కథలన్నీ చెప్పిన అమ్మ, అమ్మమ్మ పెద్దగా చదువుకోనివారని తెలుసు. వాళ్లకు వాళ్ల అమ్మమ్మ, నాయనమ్మలు చెప్పిందే మనకు చెప్పేశారని, ఎవరూ పండితులు కారని తెలుసు. మధ్యలో ఎవరూ సందేహాలు లేవనెత్తిన బాపతు కాదు. పుస్తకాల్లో అసలు ఉన్నదేమిటి, వీళ్లు చేరుస్తున్నదీ, వక్రీకరిస్తున్నదీ ఏమిటి అనేది క్లియర్‌గా తెలుసుకోవాలని కొంతమంది పాఠకులకైనా అనిపిస్తుంది. ఆ కొంతమంది కోసమే నేను రాస్తున్నాను. నేను అక్కడ ఉన్నదేమిటో చెప్తాను. అది కూడా సంస్కృత ఒరిజినల్స్‌లో ఉన్నది చెప్తాను. ప్రాంతీయ భాషల్లో అనువాదాలు చేసినపుడు కొందరు మార్చారు, వేర్వేరు కవులు రాసినపుడు కొన్ని చేర్చారు, కొన్ని వదిలేశారు, స్థానికంగా వినబడే జానపద గాథల్ని జోడించారు. అందువలన సంస్కృత మూలమే బెస్ట్ సోర్స్. తెలుసుకున్నాక దాన్ని సహజాతమైన మీ బుద్ధి, వివేకంతో అన్వయించుకోండి, నాతో ఏకీభవించాలని లేదు.
గతంలో పండితులకు తమకు ఫలానా కర్మకాండలో లేదా జ్ఞానకాండలో ఎందుకు విశ్వాసం ఉందో స్పష్టమైన అవగాహన ఉండేది. దానితో బాటు అవసరమైతే ఆ విశ్వాసాన్ని మార్చుకునే ధైర్యమూ ఉండేది. ఇతర విశ్వాసులతో తర్కబద్ధంగా చర్చలు జరిపేవారు. ఎవరిది సత్యమని తేలితే, వారి మార్గంలోకి వెళ్లేవారు. ఆదిశంకరులు, రామానుజాచార్యులు, గౌతమ బుద్ధుడు – అందరూ యిలాటి పద్ధతుల్లోనే అనేకమంది విద్వాంసులను తమ మార్గంలోకి మార్చుకోగలిగారు. మనం అప్పటి పండితుల వంటివారం కాము. మనకు ఫలానా దానిలో ఎందుకు విశ్వాసం ఉందో మనకు తెలియదు. ఏదో ఫలానా మతంలో పుట్టాం, ఫలానాది మా యింటి ఆచారం – అనే అనుకుంటాం తప్ప మనకు సంబంధించిన మతగ్రంథాలపై లోతైన జ్ఞానం లేదు. అందుకే అది మూఢవిశ్వాసంగా పరిణమిస్తోంది. విషయం తెలిసి, విశ్వసించిన రోజున అది పరిపూర్ణ విశ్వాసంగా మారుతుంది.
నేను పురాణాల గురించి ఏదైనా రాయగానే హిందువులం కాబట్టి ఊరుకుంటున్నాం, అదే యితర మతస్తులైతే నీ తాట తీసేవారు అని కొందరు వ్యాఖ్యలు రాస్తూంటారు. అదేమీ లేదు, నేను బైబిల్ తెలుగులో రాయడానికి పూనుకున్నపుడు కొన్ని సంఘటనల అన్వయం కుదరలేదు, అదేమిటాని నెట్‌లోకి వెళ్లి చూస్తే ‘డిస్క్రపాన్సీస్ యిన్ బైబిల్’ అని వందలాది ఎంట్రీలు కనబడ్డాయి! గ్రహించవలసిన దేమిటంటే ప్రతి మతంలోనూ ప్రశ్నించే వారుంటారు. మతం వ్యక్తిగతంగా ఉన్నంతకాలం మంచిదే. వ్యవస్థాగతం కాగానే అవక్షణాలు వచ్చి చేరతాయి. కొంతకాలానికి కొందరు అడ్డు తిరిగి సంస్కరిస్తారు, అయితే ఛాందసులు కొందరు సంస్కరణలను అడ్డుకుంటారు. సిద్ధాంతభేదాలు వస్తాయి. అధికారం కూడా తోడైతే వర్గాలుగా విడిపోతారు.
క్రైస్తవంలో కేథలిక్-ప్రొటెస్టెంట్, ఇస్లాంలో షియా-సున్నీ, యిలాగే ప్రతీమతంలోనూ రకరకాల చీలికలుంటాయి. కలహాలుంటాయి. అది సహజం. నా వరకు వస్తే బైబిల్ ఓల్డ్ టెస్ట్‌మెంట్ పూర్తిగా రాశాను. నాకు ఎబ్బెట్టుగా కనబడిన చోట వ్యాఖ్యానాలు చేశాను. అది యూదులకు, క్రైస్తవులకు, కొంతవరకు ముస్లిములకు పవిత్ర గ్రంథం. అది రాసినప్పుడు ఎవరూ నన్ను అడ్డుకోలేదు. తిట్టలేదు. పైగా ఖురాన్ గురించి కూడా రాయమని అడిగారు. మాలతీ చందూర్ గారి అద్భుత అనువాదం ఉండగా నేను వేరే రాయడమెందు కనుకున్నాను. పైగా నా బైబిల్ సీరియల్ పాఠకులు నానాటికీ తగ్గిపోసాగారు. దానితో న్యూ టెస్ట్‌మెంట్ రాయడం వాయిదా వేసేశాను.
పురాణగ్రంథాలను చర్చించడం ఎక్కడైనా పరిపాటే. నాకు బాగా తెలిసున్నవి హిందూ పురాణాలు గురించి కాబట్టి వాటి గురించి బాగా రాయగలుగుతాను. వీటితో బాటు అప్పుడప్పుడు యితర మతాల గురించి కాస్తయినా రాయాలని ప్లాను. అంతా పాఠకాదరణపై ఆధారపడి వుంటుంది. ఇక మతవిశ్వాసాల విషయానికి వస్తే మనకు వింతగా తోచే వాటి గురించి వ్యాఖ్యానించవచ్చు. కానీ ఎందుకలా విశ్వసిస్తున్నావ్ అని ప్రశ్నించడం కష్టం. ప్రశ్నించినా సమాధానం రాదు. హేతువాద సంఘాల వారుంటారు. చేపమందు గురించి, వరుణయాగాల గురించి అనేక ప్రశ్నలు లేవనెత్తుతారు.
మంచిదే, అదే నోటితో క్రైస్తవుల స్వస్థత సమావేశాల గురించి కూడా అడగాలిగా, అడగరు. క్రీస్తుని నమ్మినంత మాత్రాన మూగవాడికి నోరొచ్చింది, కుంటివాడికి నడక వచ్చింది అంటూంటే అలా ఎలా, మా ఎదురుగా చేసి చూపించు అని అడగాలి కదా! టీవీల్లో యంత్రాలు, తాయెత్తులు అమ్మేవాళ్లు కూడా యిలానే చెప్తారు. ఎవరూ అడగరు. వరుణయాగాలు చేస్తే వర్షాలు కురిసే మాటయితే రాజస్థాన్‌లో వేదపండితులు యీ పాటికి అక్కడ ఎడారి లేకుండా చేయగలిగేవారు కదా! అమరావతిలో మూడు సార్లు శంకుస్థాపన చేసిన ఖర్చులో సగంతో బాబు అనంతపురంలో ఓ యాగం చేయించేవారు కదా! అక్కడ కష్టపడి మైక్రో ఇరిగేషన్ ద్వారా పొలాలు తడపడం దేనికి?
ఇలా ప్రశ్నలు వేస్తూంటే అద్భుతాలు జరగవంటావా? అని ఎదురు ప్రశ్నిస్తారు. ఈ అద్భుతాల విషయంలో నా అభిప్రాయం చెప్తాను. ఇది పూర్తిగా వ్యక్తిగత అభిప్రాయం. ఈ అద్భుతాల గురించి క్రైస్తవులకు నమ్మకం మెండు. ఎవరైనా ఒక భక్తుణ్ని లేదా భక్తురాల్ని సెయింట్ (స్వర్గలోకవాసి – దేవత లేదా దేవుడు) గా గుర్తించడానికి అద్భుతాలు జరిగాయని నిరూపించడం అత్యవసరం. ఇక్కడ తమాషా ఏమిటంటే ఫలానా వారు దేవత అని నిర్ణయించేది నరుడే! భవిష్యత్తులో దేవుడిగా గుర్తింపబడతాడో లేదో తెలియని నరుడు. అసలు ఎవరైనా నరుడు దేవుడు కాగలడా? నరుడికి స్థలకాల పరిమితుంటాయి. దేవుడంటే నిర్వచనం ఏమిటి? సర్వకాల సర్వావస్థల యందు ఉండేవాడే, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు, ఆద్యంతములు లేనివాడు.
ఉదాహరణకి విష్ణువు దేవుడు. త్రేతాయుగంలోనే ఉండి ద్వాపరయుగంలో లేని రాముడుకానీ ద్వాపరయుగంలోనే ఉండి త్రేతాయుగంలో లేని కృష్ణుడుకానీ దేవుళ్లు కారు. నరులే. పరిమితులున్న నరజన్మ ఎత్తినా ఏం సాధించవచ్చో చూపారు. మనలో కంటె వారిలో దైవాంశ అధికంగా ఉందనుకుని మనం వాళ్లని దేవుళ్లగా కొలవవచ్చు. అలాగే గౌతమ బుద్ధుడు, జీసస్ క్రైస్తు, సాయిబాబా, సత్యసాయిబాబా.. మరోరూ మరోరూ. పేర్లకు ముందు భగవాన్ అని పెట్టుకున్నా, వాళ్లకు పుట్టుక, మరణం ఉన్నాయంటే దేవుళ్లని అనలేం. ఇక అద్భుతాలంటారా క్రైస్తు నుంచి కల్కి భగవాన్ వరకు ఒకే రకమైనవి వింటాం. కళ్లు వచ్చాయి, కాళ్లు వచ్చాయి.. వెరైటీ.
మా గుజరాతీ మేనేజర్ ఒకాయన సత్యసాయి భక్తుడు. బాత్‌రూమ్‌లో పడి కాలు వాచిపోయింది. డాక్టరు వద్దకు వెళ్లి చూపించుకోండి అంటే సత్యసాయి విబూది రాసుకున్నాను చాలు అన్నాడు. విబూదితోనే పని అయిపోయే మాటైతే పుట్టపర్తిలో అత్యంత అధునాతనమైన ఆసుపత్రిలో డాక్టర్లు ఎందుకున్నారు? హోమియో మాత్ర పొట్లాలు కట్టి యిచ్చే కుర్రాళ్లను పెట్టి విబూది పొట్లాలు కట్టించి యిచ్చేవారుగా అన్నాను. నిజమేస్మీ అంటూ ఆయన డాక్టరును చూడబోయాడు.
వాటికన్ ఎవరినైనా సెయింట్‌గా ప్రకటించే ప్రక్రియను కాననైజేషన్ అంటారు. దానికి ముందు తెలుసుకోవలసినది వాటికన్ వ్యవస్థ ఏ సామ్రాజ్యపు వ్యవస్థకూ తీసిపోదు. దాని చుట్టూ నడిచిన రాజకీయాలు, వేల సంవత్సరాలుగా రాజులతో, చక్రవర్తులతో నడిచిన లావాదేమలు ఎన్నో, ఎన్నో ఉన్నాయి. అందువలన కొంతమందిని కాననైజ్ చేసిన విధానం చూసి నివ్వెరపోవద్దు. ఇప్పటిదాకా వాటికన్ 3 వేల మందికి దైవత్వం ప్రసాదించింది. చాలా శతాబ్దాలపాటు ప్రజాభిప్రాయాన్ని తీసుకుని సెయింట్స్‌గా ప్రకటించేవారు. 10వ శతాబ్దం నుంచి కాననైజేషన్‌కు ఒక ప్రక్రియను ఏర్పరచారు. గత వెయ్యేళ్లలో అది మార్పులకు గురైంది.
1983 నుంచి యీ కాననైజేషన్ అనేక మార్పులతో ఊపందుకుంది. పోప్ జాన్ పాల్ సెకండ్ 300 మందిని కాననైజ్ చేసేశారు. మదర్ థెరిసా 1997లో చనిపోయారు. ఎవరైనా వ్యక్తి చనిపోయిన ఐదేళ్ల దాకా కాననైజేషన్ ప్రక్రియ ప్రారంభమవకూడదనే రూలు ఉంది. అయితే థెరిసా శిష్యు ఆ రూలు ఎత్తేయమని గొడవ చేసి సాధించుకున్నారు. దాంతో1999 నుంచే ఆ ప్రక్రియ ప్రారంభించేశారు. అంటే రాజకీయ ఒత్తిళ్లకు లొంగి రాజ్యాంగం మార్చేస్తూన్నట్లే, యీ దైవప్రక్రియ కూడా పలుకుబడికి లోనయి మార్పులకు గురవుతుంది. చివరకు 2003లో థెరిసాను దేవతగా ప్రకటించేశారు.
ఈ దైవత్వ ప్రక్రియ అంచెలంచెలుగా ఉంటుంది. చనిపోయాక స్థానిక బిషప్ వాళ్ల జీవితం గురించి విచారణ జరిపి వాటికన్‌కు రికమెండేషన్ పంపుతాడు. వాటికన్‌లోని కార్డినల్స్, కొందరు థియాజియన్లు కలిసి ఆ జీవితాన్ని మూల్యాంకనం చేస్తారు. ఆ పానెల్ అంగీకరిస్తే అప్పుడు ఆ వ్యక్తిని ‘వెనరబుల్’ (కాథలిక్ విలువలు పాటించిన ఆదర్శవ్యక్తి)గా గుర్తిస్తారు. ఆ తర్వాత బీటిఫికేషన్ జరిగి దీవిత/దీవితుడుగా గుర్తిస్తారు. దీనికి గాను ఆ మనిషి మరణానంతరం ఒక అద్భుతానికి కారకుడైనట్లు రుజువు కావాలి. మతం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ల విషయంలో యీ అద్భుతాలు కంపల్సరీ కాదు.
బీటిఫికేషన్ తర్వాత మరొక అద్భుతం కూడా జరిగినట్లు రుజువైతే అప్పుడు సెయింట్‌గా గుర్తిస్తారు. రుజువు చేసేది వాటికన్ నియమించిన వైద్యుల, నిపుణుల బృందం! మదర్ థెరిసా విషయంలో అమెరికాలోని ఒక ఫ్రెంచి యువతికి కారు యాక్సిడెంటులో పక్కటెముకలు విరిగిపోయాయని, కానీ మదర్ లాకెట్ మెళ్లో వేసుకోవడం వలన అతి త్వరగా నయం అయిపోయాయని, అదొక అద్భుతమని అన్నారు. రెండో అద్భుతమేమిటంటే ఒక పాలస్తీనా బాలిక కలలోకి వచ్చి నీ కాన్సర్ నయమైపోయిందని చెప్పడం! (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2020)