ఇవాళ రైతులకోసం నారా లోకేష్ మొసలి కన్నీరు కారుస్తుండడం చూస్తోంటే చిత్రంగా అనిపిస్తోంది. రైతులను అక్రమ కేసులతో వేధిస్తున్నారంటూ లోకేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి ప్రాంత రైతులు మాత్రమే లోకేష్ కు రైతుల కింద కనిపిస్తున్నట్లుగా ఉన్నది అనేది కొందరి వాదన అయితే.. రైతులను కాల్చి చంపించిన చంద్రబాబు కొడుకు కేసుల మాటెత్తడం చోద్యం అని కొందరు అంటున్నారు. ఇంకా అనేక కారణాల్ని ప్రస్తావిస్తూ.. రైతులపై కేసులను తప్పు పట్టేంత నైతిక అర్హత ఒక్క లోకేష్ కే కాదు.. ఏ తెలుగుదేశం నాయకుడికైనా ఉందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అమరావతి ప్రాంతంలో రాజధాని అక్కడే ఉండాలని, వికేంద్రీకరణ వద్దని డిమాండ్ చేస్తూ 72 రోజులుగా దీక్షలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ దీక్షల్లో ఎంతో మంది కూర్చుంటున్నారు. వారందరి మీదా పోలీసు కేసులు నమోదు కాలేదు కదా? అనేది ప్రజల ప్రశ్న. ఆందోళనల పేరుతో దాడులకు తెగబడిన అతివాదుల మీద మాత్రమే పోలీసు కేసులు నమోదయ్యాయి. అలాంటి వారిలోనే కొందరు అరెస్టు అయ్యారు. వారు జైల్లో ఉండగా.. తెలుగుదేశానికి చెందిన నాయకులు.. వ్యవహారాన్ని రాద్ధాంతం చేయడానికే అన్నట్లుగా రోజుకొకరు వంతున వెళ్లి జైల్లో ఉన్నవారిని కలుస్తూ.. అరెస్టుల చుట్టూ ఒక అబద్ధపు ప్రచారాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు.
ప్రజాస్వామ్యంలో తమ వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పే హక్కు, ఒక కోరికతో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అధికార వికేంద్రీకరణను వ్యతిరేకించే హక్కు అమరావతి రైతులకు ఉంది. వారి హక్కును వైకాపా ప్రభుత్వం గౌరవిస్తున్నది గనుకనే వారు 72 రోజులుగా నిరాటంకంగా దీక్షలు చేయగలుగుతున్నారు.
దీక్షల ముసుగులో, ఆందోళనల ముసుగులో మధ్యలో ఆగడాలకు పాల్పడిన వారి మీద మాత్రమే కేసులు నమోదు అవుతున్నాయి. నారా లోకేష్ జైలు వద్ద ఇలా మొసలి కన్నీరు కార్చడం ముందు మానుకోవాలి. మందడం ఘటనతో సంబంధం లేనివారిపై కేసులు పెట్టారనే నింద వేసే బదులు ఆ విషయం కోర్టులో నిరూపించుకోవాలి. కిడ్నీ బాధితులను జైల్లో పెట్టారనే బదులు వారికోసం పిటిషన్ వేసి.. బెయిల్ ఇప్పించుకోవాలి. అంతే తప్ప.. కల్లబొల్లి ఏడుపులతో పని కాదనేది జనం మాట.
చంద్రబాబు హయాంలో ప్రత్యేకహోదా కోసం పోరాడిన వారిమీద దారుణంగా కేసులు పెట్టారు. చంద్రబాబు యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా కావాలనే పాట ఎత్తుకున్న తర్వాత కూడా.. వారి మీద కేసులు మాత్రం తొలగించలేదు. ఇలా విద్యార్థులు, అమాయకులు అని కూడా చూడకుండా.. వేలమందిపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు పెట్టిన దుర్మార్గపు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన లోకేష్.. ఇవాళ ఒక ప్రాంతంలోని కొందరు రైతుల ఆగడాల మీద కేసులు పెడితే రాద్ధాంతం చేయడానికి నైతిక అర్హత ఉన్నదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.