నరేంద్రమోడీ ప్రధాని అయిన తర్వాత.. భారతీయ జనతా పార్టీ రాజకీయాల్లో విలువలు అనేవాటిని తుంగలో తొక్కింది. కేవలం ఒక్క ఎంపీ సంఖ్యాబలం తేడా వస్తే.. ప్రతిపక్షాల వాళ్లను ప్రలోభ పెట్టిలోబరచుకునే కుటిలరాజకీయాలు ఇష్టం లేక ప్రధానిగా వాజపేయి గద్దెదిగిపోయిన రోజులు పాతబడ్డాయి. ఇవాళ.. నయానో భయానో.. ప్రలోభపెట్టో మొత్తానికి తమకు సంఖ్యాబలం తక్కువగా ఉన్నా కూడా..ప్రతిపక్షాల వాళ్లను లోబరచుకుని, తమలో కలిపేసుకుని.. అధికారమే పరమావధిగా ఇవాళ్టి భాజపా వర్తిస్తోంది.
భాజపా ప్రలోభ రాజకీయాలకు దేశంలో చాలా ఉదాహరణలే దొరుకుతాయి. అలాంటిది.. ఏకంగా మోడీ సామ్రాజ్యం అయిన గుజరాత్ లో , మోడీ దళంలోని ప్రముఖులకే ప్రలోభాల ‘బిస్కట్’ వేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుండడం చిత్రమైన పరిణామంగా కనిపిస్తోంది. అదికూడా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కాదు.. కేవలం ఒక రాజ్యసభ ఎంపీ సీటును దక్కించుకునే యావతో కావడం మరీ చిత్రం.
గుజరాత్ లో భాజపా ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న నితిన్ పటేల్ కు కాంగ్రెస్ పార్టీ ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఆయన భాజపాను వీడి, తనతోపాటూ 20 మంది భాజపా ఎమ్మెల్యేలను తీసుకువస్తే గనుక.. ఆయనకు ముఖ్యమంత్రి పీఠం కానుకగా ఇస్తామని ప్రకటించింది. నిజానికి ఇది బూరెల గంపను ఆఫర్ గా ప్రకటించడం వంటిదే. కానీ మోడీ – అమిత్ షాల చాణక్యం ముందు ఇలాంటి ఓపెన్ ఆఫర్లు పనిచేస్తాయా? అనేది సందేహం!
182 సీట్లున్న గుజరాత్ అసెంబ్లీలో భాజపా 99 సీట్లలో గెలిచి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ కూటమికి అంతా కలిపి 77 స్థానాలు దక్కాయి. అయితే ఇన్నాళ్లుగా భాజపానుంచి ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తే గద్దెఎక్కవచ్చుననే ఆలోచన కాంగ్రెసు వారికి వచ్చినట్టు లేదు. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు ముంచుకు వచ్చేసరికి గుజరాత్ లో కాస్త బొటాబొటీగా ఉన్న బలాల మీద వారు కన్నేశారు. భాజపా ఎమ్మెల్యేల మద్దతు కూడా కూడగట్టుకుంటే అదనంగా ఒక ఎంపీసీటు దక్కుతుందనే ఆశ వారిని ఫిరాయింపులకు ప్రేరేపిస్తున్నట్లుంది.
అయితే ప్రధానిగా మోడీ ఎంత బలమైన నాయకుడిగా ఎదిగారో, గుజరాత్ లో ఆయన అంతకంటె బలమైన నాయకుడు. అలాంటప్పుడు ముఖ్యమంత్రి పదవిని ఎర చూపినంత మాత్రాన నితిన్ పటేల్, ప్రధాని మోడీ ప్రాపకాన్ని వదులుకోవడానికి సిద్ధపడతారా? ఆయన సిద్ధపడినా సరే.. ఆయన వెంట వెళ్లడానికి మరో ఇరవై మంది దొరకడం సాధ్యమేనా అనే చర్చలు సాగుతున్నాయి.