మోసాలు ఎన్నో రకాలు. అలాంటిదే ఇది కూడా. డైరక్టర్ సందీప్ రెడ్డి వంగ పేరుతో ఓ అగంతకుడు ఫోన్ చేశాడు. ప్రభాస్ తో సినిమా ఉందని చెప్పాడు. ముంబయి వస్తే స్టోరీ డిస్కషన్స్ తో పాటు ఆడిషన్స్ కూడా ఒకేసారి పూర్తిచేసేద్దామని నమ్మబలికాడు. దీంతో ఆ హీరోయిన్ నమ్మింది. ముంబయి వెళ్లింది.
ఆ హీరోయిన్ పేరు కృతి గార్గ్. రీసెంట్ గా వచ్చిన రాహు సినిమాలో హీరోయిన్.
ఈరోజు ఉదయం నుంచి కృతితో మాట్లాడ్డానికి ప్రయత్నించిన రాహు సినిమా దర్శకుడు సుబ్బు. ఆమెను ఫోన్ లో కాంటాక్ట్ చేయలేకపోయాడు. అప్పటికే జరిగిన విషయం అతడికి తెలుసు కాబట్టి, అనుమానంతో వెంటనే పోలీసుల్ని సంప్రదించాడు. తన దగ్గరున్న సమాచారంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
విచారణ ప్రారంభించిన తర్వాత కృతి అందుబాటులోకి వచ్చింది. తను సేఫ్ అంటూ దర్శకుడికి సమాచారం ఇచ్చింది. కృతి ఉండేది ముంబయిలోనే. నిన్నటివరకు రాహు ప్రమోషన్ లో ఉన్న ఆమె ఎలాగూ తన ఇంటికి వెళ్లాలనుకుంటోంది. సరిగ్గా అదే టైమ్ లో ఫోన్ కూడా రావడంతో ఆమె ముంబయి వెళ్లింది. తనకు వచ్చింది ఫేక్ కాల్ అని ఆమె నిర్థారించుకొని జాగ్రత్త పడింది.
అయితే ఈ వ్యవహారం ఇక్కడితో ఆగిపోలేదు. ఓ తెలుగు టీవీ యాంకర్ కు కూడా ఫోన్ వచ్చింది. ఆమెకు కూడా సందీప్ రెడ్డి వంగ పేరిట కాల్స్ చేశాడు అగంతకుడు. ముంబయి వచ్చి కాల్ చేయమన్నాడు. ఇలా టాలీవుడ్ లో చాలామందికి కాల్స్ వెళ్తున్నాయి. ప్రస్తుతం రాహు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ రాకెట్ గుట్టు రట్టు చేసే పనిలో పడ్డారు. టీవీ యాంకర్ కు, హీరోయిన్ కు వచ్చిన కాల్ రికార్డింగ్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
ఈరోజు ఉదయం నుంచి హైడ్రామాను తలపించిన కృతిగార్గ్ మిస్సింగ్ వ్యవహారం సుఖాంతం అయినప్పటికీ.. ఆ రాకెట్ ను పట్టుకునే వరకు టాలీవుట్ హీరోయిన్లకు, హీరోయిన్ కావాలని ఆశపడే అమ్మాయిలకు ప్రమాదం తప్పదు.