ఇంత కాలం సినిమాల్లో తన హీరోయిజంతో రజినీకాంత్ పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. నిజ జీవితంలో ఆయన సాధారణ జీవితాన్ని గడుపుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. రజినీకాంత్ ఎక్కడా ఆడంబరాలు, ఆర్భాటాలకు వెళ్లడని పేరు. అంతేకాదు తమిళనాడు రాజకీయాల్లో కూడా వేలు పెట్టాడు. సామాజిక, రాజకీయ పరిస్థితులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటాడు.
తాజాగా ఈశాన్య ఢిల్లీ అల్లర్లు దేశాన్ని భయాందోళనకు గురి చేశాయి. దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై రజినీకాంత్ తనదైన శైలిలో స్పందించాడు. ట్విటర్ వేదికగా ఢిల్లీ అల్లర్లను ఆయన ఖండించాడు. అంతేకాదు ఢిల్లీలో అల్లర్లను అదుపు చేయలేక పోయిన వారు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశాడు. దేశంలో శాంతి స్థాపన కోసం ఏం చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నాడు. దేశంలో శాంతి, సమైక్యతను నెలకొల్పడమే తన తొలి ప్రాధాన్యం అని రజినీకాంత్ ట్వీట్ చేశాడు.
ఢిల్లీ అల్లర్లపై రజినీకాంత్ స్పందించడం అభినందనీయం. కానీ ఆయన ఢిల్లీ అల్లర్లను అదుపు చేయలేక పోయిన వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడే తప్ప…అందుకు ఫలానా వాళ్లే కారకులు అని ధైర్యంగా చెప్పలేకపోయాడు. ఢిల్లీలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర హోంశాఖది. అంటే అమిత్‌షా బాధ్యత వహించాలి. అమిత్‌షా రాజీనామా చేయాలని డిమాండ్ చేసేందుకు రజినీకాంత్ ఎందుకు భయపడుతున్నాడనే ప్రశ్న తలెత్తుతోంది. రజినీకాంత్ బాగా భయపడుతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అమిత్‌షా రాజీనామాకు పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాలు సోమవారం గట్టిగా పట్టు పట్టాయి. ఈ సందర్భంగా లోక్‌సభ, రాజ్యసభలను ప్రతిపక్ష సభ్యులు స్తంభింపజేశారు. అమిత్‌షా రాజీనామా చేయాలని డిమాండ్ చేయడానికి బదులు…రజినీకాంత్ ఎందుకంత లౌక్యం ప్రదర్శిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. దేశంలో శాంతి, సమైక్యతను నెలకొల్పడమే తన తొలి ప్రాధాన్యం అని రజినీకాంత్ ట్వీట్‌తో సరిపెట్టడం కాదని…అందుకు తగ్గ కార్యాచరణ ముఖ్యమని ఆయన అభిమానులు కూడా అంటున్నారు.