బాలీవుడ్ లో కాస్త ఎదిగిన హీరోయిన్లు చిత్ర పరిశ్రమ మీద రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే నెపోటిజం మీద కంగనా రనౌత్, ఆమె సోదరి చాలా ఘాటుగా స్పందించారు. హిందీ చిత్ర పరిశ్రమలో బంధుప్రీతి ఎక్కువని, ఎవరికి వారు తమ తమ బంధుగణాన్ని ఇండస్ట్రీలో సెటిల్ చేస్తూ ఉన్నారని వారు వాపోయారు. ఇప్పుడు ఇలా గళం విప్పిన వారిలో తాప్సీ కూడా చేరింది! ఇప్పుడు సోలోగా తన పేరు మీదే మార్కెట్ అయ్యే వివిధ సినిమాలు విడుదల అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాప్సీ ధైర్యంగా స్పందిస్తున్నట్టుగా ఉంది.
కంగనా స్థాయిలో సెటిల్ కాకపోయినా, ఇప్పుడిప్పుడు తాప్సీ కూడా సెటిలవుతూ ఉంది. హారర్, థ్రిల్లర్, రియలిస్టిక్ సినిమాల్లో ప్రధాన పాత్ర ల స్థాయికి చేరింది తాప్సీ. ఈ నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాల గురించి స్పందిస్తూ ఉంది. ఇది వరకే సౌతిండియన్ చిత్ర పరిశ్రమ మీద, తన తొలి తొలి సినిమాల్లో తనతో చేయించిన ఎక్స్ పోజింగ్ ఫీట్ల మీద తాప్సీ కౌంటర్లు వేసింది. బొడ్డు, పూల దర్శకుడి పై ఆమె సెటైర్లు వేసింది. తను పడ్డ ఇబ్బందులు చెప్పుకుంది.
ఇక ఇప్పుడు బాలీవుడ్ లో తను కూడా నెపోటిజం బాధితురాలినే అని తాప్సీ అంటోంది. తనకు రావాల్సిన వివిధ అవకాశాలను, తన వరకూ వచ్చిన అవకాశాలను కొంతమంది తారల వారసులు తన్నుకుపోయారని తాప్సీ వాపోతూ ఉంది. వారసత్వమే అర్హతగా కొందరు తన అవకాశాలను తీసుకెళ్లిపోయారని ఈమె చెబుతూ ఉంది. అయితే అలా తను కోల్పోయిన సినిమాలు- పాత్రలేవో తాప్సీ చెప్పలేదు. 'తప్పడ్' సినిమా విజయవంతంగా సాగుతున్న నేపథ్యంలో ఉత్సాహంగా ఉంది ఈ నటీమణి. దీంతో బాలీవుడ్ లో నెపోటిజంపై స్పందించేస్తున్నట్టుగా ఉంది.