ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. రికార్డుల పరంగా వివాహితుడే అయినప్పటికీ.. ఆచరణలో ఆయన బ్రహ్మచారి కిందే లెక్క! ఈ విషయాన్ని ఎవ్వరూ కాదనలేరు. అనుకూలరు అదే ఆయన గొప్పదనమంటారు.. వ్యతిరేకులు- ఆయనలోని నెగటివ్ కోణంగా ప్రచారం చేస్తారు. అదంతా పక్కన పెడితే.. ఈ బ్రహ్మచారి ప్రధాని… భద్రత దళాల్లో పనిచేసే జవాన్లు తమ కుటుంబాలతో గడపడం, కాపురాలు చేసుకోవడం మీద మాత్రం కొత్త శ్రద్ధను కనబరుస్తుండడం విశేషం.
భద్రత దళాల్లో పనిచేసే జవాన్లు ఏళ్లకు ఏళ్లు తమ స్వస్థలాల్లోని కుటుంబాలకు దూరంగా గడుపుతుంటారు. ఏడాదిలో అతి కొద్ది రోజులు మాత్రం స్వగ్రామాలకు వచ్చి.. కుటుంబంతో గడిపి వెళ్లిపోతుంటారు. భార్యా పిల్లలు, వారి జీవనగమనం, పిల్లల చదువు సంధ్యలు వీటన్నింటి మీద వారు అవసరమైన సమయంలో దృష్టి పెట్టడం తక్కువగానే ఉంటుంది. అయితే మోడీ సర్కారు ఈ విషయంలో కొన్ని మార్పులు చేయడానికి సంకల్పించినట్లుగా కనిపిస్తోంది.
భద్రతా దళాల్లో పనిచేసే జవాన్లు ఏడాదిలో 100 రోజుల పాటూ కుటుంబంతో గడిపేలా ఒక కొత్త విధానం తీసుకు రావడానికి ప్రధాని నరేంద్రమోడీ కసరత్తు చేస్తున్నారట. ఈ విషయాన్ని హోంమంత్రి అమిత్ షా స్వయంగా వెల్లడించారు. పశ్చిమబెంగాల్ పర్యటనలో ఎన్ఎస్జీ కొత్త భవనాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగానే జవాన్లకు తీపి కబురు చెప్పారు.
భద్రతా బలగాలు, సైనికులు, జవాన్లలో తమ క్రేజ్ పెంచుకునేలా మోడీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఒకే పెన్షన్ విధానం కూడా ఇప్పుడు అమల్లోకి వచ్చింది. వారి సంక్షేమంతో పాటూ.. మోడీ ప్రభుత్వ గైడెన్స్ లో రెండు దఫాలుగా జరిగిన సర్జికల్ దాడులు కూడా కేంద్ర ప్రభుత్వం పట్ల జవాన్లకు అభిమానం పెంచుతాయనే అనిపిస్తుంది. అలాంటి క్రేజీ నిర్ణయాలతో పాటూ.. వారు ఏ లోటునైతే అనుభవిస్తుంటారో.. ఆ లోటును పూరించేలా కుటుంబాలతో గతంలో కంటె ఎక్కువ రోజులు గడిపేలా విధానాలలో మార్పులు తీసుకురావడం విశేషమే.