బాబుపై సొంత పార్టీ మాజీ ఎమ్మెల్యేల అసంతృప్తి!

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడిపై సొంత పార్టీకి చెందిన ఇద్ద‌రు మాజీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ని స‌మాచారం. మాజీ మంత్రి ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి వైసీపీ నేత‌ల‌తో చెట్ట‌ప‌ట్టాలేసుకుని తిరుగుతూ అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నా, ఎలాంటి చ‌ర్య‌లు…

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడిపై సొంత పార్టీకి చెందిన ఇద్ద‌రు మాజీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ని స‌మాచారం. మాజీ మంత్రి ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి వైసీపీ నేత‌ల‌తో చెట్ట‌ప‌ట్టాలేసుకుని తిరుగుతూ అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నా, ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌న్న కోపం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డిలో ఉంది. 

మ‌రోవైపు అధిష్టానం ఆదేశాల‌ను లెక్క చేయ‌కుండా త‌న నియోజ‌క‌వ‌ర్గ‌మైన పుట్ట‌ప‌ర్తి విష‌యాల్లో జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, వివాదాల‌ను సృష్టిస్తున్నా ప‌ట్టించుకోలేద‌నే ఆగ్ర‌హం ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డిలో ఉంది.

రోజురోజుకూ ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డిపై జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి విమ‌ర్శ‌లు పెంచుతున్నారు. అధికార పార్టీ నేత‌ల అండ‌తో భూఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని, ప‌ల్లె అవినీతి అంతా త‌న‌కు తెలుస‌ని తాజాగా జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. సొంత పార్టీ నేతే అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తుండ‌డం వ‌ల్ల ప్ర‌త్య‌ర్థులకు ఆయుధం ఇచ్చిన‌ట్టైంద‌ని ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌ని స‌మాచారం.

ఇటీవ‌ల పుట్ట‌ప‌ర్తిలో ఉజ్వ‌ల భూవ్య‌వ‌హారంపై క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు సాకుతో త‌న‌ను ఇబ్బంది పెట్టాల‌ని జేసీ దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అధిష్టానానికి ప‌ల్లె ఫిర్యాదు చేసిన‌ట్టు స‌మాచారం. అయిన‌ప్ప‌టికీ అధిష్టానం జోక్యం చేసుకోకుండా, సొంత పార్టీలో ర‌చ్చ‌ను సినిమా చూస్తున్న‌ట్టు ప్రేక్ష‌క‌పాత్ర పోషించ‌డం ఏంట‌ని ప‌ల్లె అనుచ‌రులు ప్ర‌శ్నిస్తున్నారు. 

ప‌ల్లెకు వ్య‌తిరేకంగా మ‌రో నాయ‌కుడిని జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ప్రోత్స‌హిస్తుండ‌డంపై టీడీపీ పెద్ద‌లు జోక్యం చేసుకోవాల‌ని ర‌ఘునాథ‌రెడ్డి అనుచ‌రులు కోరుతున్నారు. త‌మ నాయ‌కుడి మెత‌క స్వ‌భావాన్ని అలుసుగా తీసుకుని జేసీ రెచ్చిపోతున్నార‌ని ప‌ల్లె అనుచ‌రులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

సొంతింటిని చ‌క్క‌బెట్టుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని ప‌ల్లె వ‌ర్గీయులు కోరుతున్నారు. మ‌రోవైపు ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి అరాచకాలు పెరిగిపోయాయ‌ని, అధిష్టానం జోక్యం చేసుకుని క‌ట్ట‌డి చేయ‌క‌పోతే పార్టీ న‌ష్ట‌పోతుంద‌ని జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇలా ఇద్ద‌రి నేత‌ల ఫిర్యాదులు, అభిప్రాయాల‌ను టీడీపీ అధిష్టానానికి తెలియ‌జేశారు. 

అయిన‌ప్ప‌టికీ అటు వైపు నుంచి ఎలాంటి స్పంద‌న రాక‌పోవ‌డంతో చంద్ర‌బాబుపై ఇద్ద‌రు నేత‌లు గుర్రుగా ఉన్నార‌ని స‌మాచారం.