‘హారిక’ను వీడనున్న పీడీ ప్రసాద్?

శ్రీశ్రీ అంటాడు. తాజ్ మహాల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు? అని. సాధారణంగా నిర్మాతలు కనిపిస్తారు కానీ, లోపల ఆఫీస్ లో వుండే జనాలు పెద్దగా పరిచయం వుండరు. ఇండస్ట్రీ సర్కిళ్లకు మాత్రమే తెలుస్తారు. పిడీ…

శ్రీశ్రీ అంటాడు. తాజ్ మహాల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు? అని. సాధారణంగా నిర్మాతలు కనిపిస్తారు కానీ, లోపల ఆఫీస్ లో వుండే జనాలు పెద్దగా పరిచయం వుండరు. ఇండస్ట్రీ సర్కిళ్లకు మాత్రమే తెలుస్తారు. పిడీ ప్రసాద్ అనగానే బయ్యర్లకు, ఇండస్ట్రీ జనాలకు హారిక హాసిని గుర్తుకు వస్తుంది. ఆయన గతంలో దాసరి దగ్గర నుంచి ఎందరితో అనుబంధంగా వున్నా, హారిక హాసినిలోకి వచ్చాక, బాగా సినిమా జనాలకు దగ్గరయ్యారు.

ముఖ్యంగా నిర్మాణంలో కొసరి కొసరి ఖర్చు చేయడం, తనదైన చాదస్తం కావచ్చు, పాత పద్దతులు కావచ్చు, వాటినే నమ్ముతూ ముందుకు సాగడం, ముఖ్యంగా సినిమాను తాను అనుకున్న రేట్లకు అమ్మగలగడం వంటి విశేషాలు పిడి ప్రసాద్ ను మిగిలిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లకు భిన్నంగా తయారుచేసాయి.

అలాంటి పిడీ ప్రసాద్ ఇప్పుడు హారిక హాసిని సంస్థను వదిలేస్తున్నారన్న వార్తలు ఇండస్ట్రీలో గుప్పుమంటున్నాయి. హారిక హాసినిలో యంగ్ జనరేషన్ భావాలకు, ఆయన పద్దతులకు అంతగా పొసగడం లేదని, అందువల్లే ఆయన తప్పుకుంటున్నారని వార్తలు వినవస్తున్నాయి. ఆయన అక్కడ నుంచి మైత్రీమూవీస్ కు వెళ్తారని కూడా వినిపిస్తోంది.

అయితే వీటిని పిడీ ప్రసాద్ ధృవీకరించడం లేదు. తాను హారిక హాసిని ఆఫీసుకు వస్తున్నానని, అయితే ఇక తన అవసరం అంతగా లేదని అనిపిస్తోందని, తగినంత పనిలేకుండా తాను వుండలేనని, అందుకే ఇక విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నానని, పిడి ప్రసాద్ తన సన్నిహితులతో అంటున్నట్లు తెలుస్తోంది.

హారిక హాసిని సినిమాలను భారీ రేట్లుకు మార్కెట్ చేయడం వెనుక పీడీ ప్రసాద్ చాకచక్యం కాదని అనలేరు. ఇకపై మరి ఆయన తప్పుకుంటే, హారికకు ఆ లోటు అలాగే వుంటుంది.

బిడ్డా రాస్కో.. తెలంగాణ‌లో అధికారం మాదే.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్