భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ… తమ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని కొత్తగా చెప్పుకొస్తున్నారు. అమరావతి రాజధాని కి సంబంధించిన వ్యవహారంలో… ఆయన అక్కడ పోరాడుతున్న రైతులకు మద్దతు పలుకుతున్నారు.
గుంటూరు జిల్లాకు చెందిన నాయకుడు కావడం వలన… కన్నా లక్ష్మీనారాయణ రాజధాని అనేది పూర్తిగా అమరావతిలో మాత్రమే ఉండాలని కోరుకోవడంలో విచిత్రం లేదు. కానీ, అక్కడి రైతులకు మద్దతు ఇస్తున్న క్రమంలో … ఆయన తమ పార్టీ మేనిఫెస్టో వాగ్దానాలను విస్మరిస్తున్నారు.
రాజధాని రైతుల దీక్షలకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ నిర్వహించదలచుకున్న బహిరంగ సభకు పోలీస్ అనుమతులు రాలేదు. కన్నా లక్ష్మీనారాయణ ఆదివారం నాడు పార్టీ నాయకులతో కలిసి ర్యాలీగా తుళ్లూరు వరకు వెళ్లారు. అనంతరం మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. ఇదంతా బాగానే ఉంది… కానీ అమరావతి మాత్రమే రాజధాని అని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని కన్నా ప్రకటించడంలో పేచీ వస్తోంది.
అధికార వికేంద్రీకరణ చేస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను… ఏ నైతిక హక్కుతో కన్నా వ్యతిరేకిస్తున్నారో తెలియదు. ఎందుకంటే 2019 ఎన్నికలకు పూర్వం భారతీయ జనతా పార్టీ తమ మేనిఫెస్టోలో… కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తాం అని విస్పష్టంగా ప్రకటించింది.
నిజానికి ఇలాంటి హామీలను జగన్మోహన్ రెడ్డి కూడా తన మేనిఫెస్టోలో పెట్టలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత… భారతీయ జనతాపార్టీ హామీలను జగన్ అమలు చేస్తున్నందుకు కన్నా అభినందించాల్సింది బదులుగా… విమర్శలు గుప్పిస్తున్నారు.
అమరావతి రైతులు పోరాటానికి మద్దతు ఇస్తూ… తమది మాటమీద నిలబడే పార్టీ అని ఆయన గుర్తు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో… భాజపా ఎంతమేరకు, మాటమీద నిలబడుతుందో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు.
ప్రత్యేక హోదా విషయంలో మోడీ సర్కార్ ఏ రకంగా మోసం చేసిందో అందరికీ తెలుసు… ప్యాకేజీ అంటూ మాయమాటలు చెప్పి అది కూడా ఎలా పెట్టారో అందరికీ తెలుసు. ఇప్పుడు తమది మాట మీద నిలబడే పార్టీ అని చెప్పుకుంటే ప్రజలు ఎలా నమ్ముతారని కన్నా భావిస్తున్నారో తెలియడం లేదు.