ఎన్నికలు నెల ముందు జరిగివుంటే..?

వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. నాలుగైదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా దేశం దృష్టి అంతా బెంగాల్ ఫలితాల పైనే. మోడీ వెర్సస్ దీదీ అన్నంతగా ఈ ఎన్నికల స్థాయిని పెంచేసారు. అంతేకాదు బెంగాల్…

వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. నాలుగైదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా దేశం దృష్టి అంతా బెంగాల్ ఫలితాల పైనే. మోడీ వెర్సస్ దీదీ అన్నంతగా ఈ ఎన్నికల స్థాయిని పెంచేసారు. అంతేకాదు బెంగాల్ లో వీలయినంత ఎక్కువగా హిందూ కార్డు వాడారు. 

దీదీని బేగం మమత అంటూ, ముస్లిం నాయకి అనే విధంగా ప్రొజెక్ట్ చేయడానికి భాజపా ప్రయత్నించింది. 2016 ఎన్నికల్లో మాదిరిగా తమ ఓట్లు సీట్లు పెరిగి, అధికారం చేజిక్కించుకుంటామని కలలు కనేసింది.

కానీ అటు ముస్లిం సంస్థాగత ఓట్లను తన పార్టీకి దూరం కాకుండా చూసుకుంటూనే, తను బ్రాహ్మిన్, తను హిందూ అంటూ భాజపా ప్రచారాన్ని తిప్పి కొడుతూ ముందుకు సాగింది మమత. దేశంలోని ఫైర్ బ్రాండ్ మహిళా రాజకీయ నాయకుల జాబితాలోంచి ఇప్పటికే సోనియా తప్పుకున్నారు. 

జయలలిత లేరు. మాయావతి రాజీ పడ్డారు.ఇక మిగిలింది దీదీ నే. అస్సలు వెనకడుగు వేయలేదు. మనుటయా.. మరణించుటయా..అన్నట్లు పోరాడారు. భాజపా పద్మవ్యూహంలో మమత ఓటమి చెందడం తప్పదన్న సూచనలు కనిపించాయి. 

కానీ తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తాడు. భాజపా చేత్తోనే భాజపా కన్ను పొడుచుకునేలా చేసాడు. ఎన్నికలను కావాలని సుదీర్ఘంగా షెడ్యూలు చేసారు. అక్కడ తన్నేసింది భాజపా అదృష్టం. 

అస్సాం ఎన్నికల మాదిరిగా నెల రోజుల ముందు జరిగి వుంటే బెంగాల్ లో ఎలా వుండేదో? కానీ కరోనా రెండోదశ వ్యాప్తి తరువాత కూడా బెంగాల్ లో ఎన్నికలు జరిగాయి. అప్పటికే మోడీ ప్రభ మసకబారడం ప్రారంభమైంది. 

గత నెల రోజుల్లో మోడీ గ్రాఫ్ సర్రున కిందకు జారిపోయింది. ఆ ప్రభావం బెంగాల్ లో స్పష్టంగా కనిపించింది.కొత్తగా ఓట్లు, సీట్లు తోడు కావడం మాట దేవుడెరుగు, వున్న సీట్లు, ఓట్లు జారిపోయాయి. ఈ మాట ఒప్పుకోలేక, ఇప్పుడు అడ్డమైన సాకులు వెదుకుతున్నారు భాజపా జనాలు.