ఇప్పటికే వాయిదా పడిన నిర్భయ హంతకుల శిక్ష అమలుకు ఇటీవలే కోర్టు మరో తేదీని ప్రకటించింది. మార్చి మూడో తేదీన వారికి శిక్షను అమలు చేయాలని కోర్టు ఈ మధ్యనే ప్రకటించింది. ఈ మేరకు డెత్ వారెంట్ జారీ చేసింది. అయితే నిర్భయ హంతకులు తమ పాత ఎత్తుగడలను కొనసాగిస్తూ ఉన్నట్టున్నారు. తమకు శిక్ష అమలు చేయవద్దని ఇప్పటికే వారు పలు మార్లు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ విషయంలో వారు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కోర్టు డెత్ వారెంట్ జారీ చేసినప్పుడల్లా ఒక్కొక్కరుగా కోర్టుకు ఎక్కుతున్నారు. వారందరి శిక్షనూ ఒకేసారి అమలు చేయాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలు నిర్భయ హంతకులకు ఉపయోగపడుతున్నట్టుగా ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కోసారి రాష్ట్రపతికి క్షమా భిక్ష పిటిషన్ పెట్టుకోవడం, అది తిరస్కరణ అయ్యాకా.. మళ్లీ రాష్ట్రపతి మీదా కోర్టుకు వెళ్లడం. ఇప్పటి వరకూ ఇదే జరిగింది. ఇప్పుడు మళ్లీ అదే జరిగేలా ఉంది.
తాజాగా మళ్లీ నిర్భయ హంతకులు ఢిల్లీ హై కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తమకు విధించిన ఉరి శిక్షను జీవితకాల శిక్షగా మార్చాలంటూ వారు మళ్లీ పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే ఆ హంతకుల్లో ఒకడు ఇప్పుడు రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడట. ఏతావాతా మార్చి మూడో తేదీన కూడా వీరికి శిక్ష అమలు అయ్యే అవకాశాలు ఏ మాత్రమున్నాయో?