కూకట్ పల్లిలో బాబు మాటే

మొత్తానికి తన వ్యూహం ప్రకారం చంద్రబాబు కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని రంగంలోకి దింపుతున్నారు. అనూహ్యంగా సుహాసిని పేరు రెండు రోజుల క్రితం బయటకు తీసుకువచ్చారు. అది అప్పటికి…

మొత్తానికి తన వ్యూహం ప్రకారం చంద్రబాబు కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని రంగంలోకి దింపుతున్నారు. అనూహ్యంగా సుహాసిని పేరు రెండు రోజుల క్రితం బయటకు తీసుకువచ్చారు. అది అప్పటికి బాబు మనసులోని మాట. సరిగ్గా 48 గంటలు గడవకుండా దానిని అమలులోకి తీసుకువచ్చారు.

చిరకాలంగా ఈ సీటుపై ఆశలు పెట్టుకున్న పెద్దిరెడ్డి, తదితరులను కాదని, కాకినాడ నుంచి అభ్యర్థిని దిగుమతి చేసారు. అయితే హైదరాబాద్ లో పుట్టి, కాకినాడను మెట్టిన అమ్మాయి కాబట్టి లోకల్ అనే అంటారు. వాస్తవానికి కూకట్ పల్లి బరిలో దిగేందుకు నందమూరి హరికృష్ణ కుటుంబ సభ్యులు ఎవరికీ ఇష్టం లేదని వినికిడి.

తమ కుటుంబం ఇప్పట్లో రాజకీయాల్లోకి రాకూడదని, దూరంగా వుండాలన్నది హరికృష్ణ తనయుల ఆలోచనగా తెలుస్తోంది. అందుకే కళ్యాణ్ రామ్ కు టికెట్ ఆఫర్ చేసినా నో అనేసారు. దాంతో తెలివిగా బాబు అట్నుంచి నరుక్కు వచ్చారు.

హరికృష్ణ కుమార్తె అత్తింటివారికి చిరకాలంగా రాజకీయాలతో అనుబంధం వుంది. పైగా అటు వాళ్లంతా ఇటు బాలయ్యకు, నందమూరి కుటుంబాలకు బంధుబలగమే. కానీ సుహాసిని కూడా పోటీకి విముఖత కనబర్చారని తెలుస్తోంది. ఎప్పుడూ పెద్దగా బయటకు రాని తను, రాజకీయాల్లోకి రావడానికి పెద్దగా ఇష్టపడలేదని తెలుస్తోంది.

దీంతో బాబు అత్తింటివారి వైపు నుంచి ఆమెపై వత్తిడి తెచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చిన అవకాశం వద్దనకూడదని, వారు వత్తిడి చేయడంతో, సుహాసిని అవును అనక తప్పలేదని తెలుస్తోంది. మొత్తంమీద హరికృష్ణ కుటుంబానికి బాబు న్యాయం చేసారు అనిపించేసుకున్నారు.

బతికుండగానే హరికృష్ణను పక్కనపెట్టి బాలయ్యను ముందుకు తెచ్చారు. ఇప్పుడు హరికృష్ణ పోయాక, కుమార్తెకు టికెట్ ఇచ్చి మార్కులు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

మీటూ.. ప్రైవేట్ సెటిల్ మెంట్లు జరుగుతున్నాయా? …చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్