ఈ మాత్రం చిత్తశుద్ధి ఆరోజు ఉంటేనా…

గత జల సేతు బంధనం అన్న సామెత చందంగా ఉన్నది చంద్రబాబునాయుడు చేస్తున్న కసరత్తు. అమరావతిలో రాజధాని నిర్మించడం గురించి ఆయన గట్టి పని ఏమీ చేయనేలేదు. కానీ.. అమరావతినుంచి అసలు రాజధానిని విశాఖకు…

గత జల సేతు బంధనం అన్న సామెత చందంగా ఉన్నది చంద్రబాబునాయుడు చేస్తున్న కసరత్తు. అమరావతిలో రాజధాని నిర్మించడం గురించి ఆయన గట్టి పని ఏమీ చేయనేలేదు. కానీ.. అమరావతినుంచి అసలు రాజధానిని విశాఖకు తరలించాలనే విధాన నిర్ణయం జరిగిపోయిన తర్వాత.. ఇప్పుడు చందాలెత్తుతున్నారు… జోలె పడుతున్నారు… నిధులు సేకరిస్తున్నారు. ఇదంతా అమరావతి నిర్మాణం కోసం కాదు! రాజధాని అమరావతిలో మాత్రమే ఉండాలనే పోరాటం కోసం!! ఈ మాత్రం చిత్తశుద్ధి గత అయిదేళ్లలో చూపించి ఉంటే.. అడుగుపెట్టిన ప్రతిచోటా జోలెపట్టి ఉంటే.. ఈ పాటికి అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణాలు కొన్నయినా పూర్తయి ఉండేవని ప్రజలు అంటున్నారు.

అమరావతి ప్రాంతంలో చంద్రబాబు రాజధానిని ప్రకటించిన తర్వాత.. అక్కడి రైతులతో ఒక్కసారిగా కోట్లకు పడగలెత్తారు. సంపదతో తులతూగుతున్నారు. ఆ సంపదకు విఘాతం కలుగుతుందనే భయంతోనే ఇప్పుడు రాజధాని తరలిపోవడానికి వీల్లేదని పోరాటం చేస్తున్నారు. అదే సమయంలో… వారి పోరాటానికి అయ్యే ఖర్చుల కోసం- అంటే బహుశా షామియానాలు, దీక్షా శిబిరాల వద్ద భోజనాల ఖర్చులూ గట్రా కావొచ్చు- చంద్రబాబునాయుడు రాష్ట్రమంతా తిరుగుతూ చందాలు సేకరిస్తున్నారు. తాజాగా విశాఖపట్నం ఉద్రిక్త ఎపిసోడ్ తర్వాత.. హైదరాబాదుకు వచ్చేసిన చంద్రబాబుకు, ఇక్కడ సెటిలైన ఆంధ్రప్రజలు అమరావతి పోరాటం కోసం ఓ యాభైవేల రూపాయల విరాళం కూడా ఇచ్చారు.

మామూలుగా పెద్దస్థాయి నాయకులతో కలిసి ఫోటో దిగడానికి, సంపన్నులకు పార్టీ ఫండ్ ఇవ్వడం అనేది ఒక ‘షార్ట్ కట్’ దారిగా ఉండేది. ఇప్పుడు దాని పేరు ‘అమరావతి పోరాటానికి విరాళం’గా మారింది. తలో వెయ్యి రూపాయలు మీవి కాదనుకుంటే.. మీరో యాభైమంది వెళ్లి.. చంద్రబాబునాయుడుతో పార్టీ ఆఫీసులో ఫోటో దిగవచ్చు. ఇదంతా ఒక ప్రహసనంగా మారిపోయింది.

కొత్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే. అప్పటికి రాష్ట్రం వద్ద నిధులు లేవనే సంగతి ఆయనకు తెలుసు. కేంద్రంనుంచి రాగలిగేది అంతంతమాత్రమే అని కూడా తెలుసు. అద్భుత రాజధానిగా తాను ఊహించినది చాలా వ్యయంతో కూడుకున్నదనీ తెలుసు! అలాంటి సమయంలో.. ఇప్పుడు చేసినట్లుగా చందాలకోసం ప్రజల విరాళాలు, భాగస్వామ్యం కోసం ఆయన ప్రయత్నించి ఉండాల్సింది.

అలాంటి కసరత్తు జరిగింది గానీ.. చాలా మొక్కుబడి, నామమాత్రపు కసరత్తు. దాని ఫలితం కూడా అలా మొక్కుబడిగానే వచ్చింది. కానీ.. డిజైన్లు, విదేశీ కన్సల్టెంట్లు, విదేశీ టూర్ల రూపేణా వందల కోట్ల రూపాయలు తగలేశారంటే అతిశయోక్తి కాదు. ‘‘ఇదీ పూర్తయింది’’ అంటూ కొన్ని నిర్మాణాలైనా చేయడంపై ఆ పాటి దృష్టి పెట్టలేదు. ఇవాళ ఏకంగా రాజధాని మార్చే పరిస్థితి వచ్చింది. అందుకే ఇప్పుడు ప్రజలు- పోరాటానికి చందాలెత్తే చిత్తశుద్ధి, రాజధాని నిర్మాణంపై ఆనాడే ఉండిఉంటే బాగుండేది కదా.. అని అంటున్నారు.

ఇంటి ప‌నుల‌తో పాటు బాడీ మసాజ్ లు చేయిచుకుంటున్న యాంక‌ర్‌