వివాదాస్పద అంశాలపై సినిమాలు చేయడం రామ్ గోపాల్ వర్మకు కొత్త ఏమీ కాదు. ఈ మధ్య కాలంలో వివిధ రాజకీయ అంశాల మీద ఆయన సినిమాలేవో చేశారు. అవి వార్తల్లో అయితే నిలిచాయి కానీ, ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అయితే రాజకీయ వివాదాల గురించి సినిమాలు చేసుకుంటే.. అది వేరే కథ. కానీ ఇప్పుడు ఆర్జీవీ ఒక విషాద సంఘటన గురించి సినిమా చేస్తూ ఉన్నాడు. దుర్మార్గుల చేతిలో బలైన దిశ కథ ఆధారంగా ఆర్జీవీ సినిమా చేస్తున్నట్టుగా ఆ మధ్య ప్రకటించాడు. ఇప్పుడు సైలెంట్ గా అందుకు సంబంధించిన షూటింగ్ ను కూడా చేసేస్తూ ఉన్నాడట ఈ దర్శకుడు. హైదరాబాద్ పరిసరాల్లో, దిశపై అఘాయిత్యం జరిగిన ప్రాంతాల్లో రామ్ గోపాల్ వర్మ షూటింగ్ ను చేపట్టినట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే ఆర్జీవీ ఈ విషయంలో దిశ కేసులో నిందితులో ఒకడైన, పోలీసుల ఎన్ కౌంటర్లో మరణించిన వ్యక్తి భార్యను కలిశాడు. అలాగే ఈ కేసును ముందుగా ధర్యాప్తు చేసిన పోలీసు వాళ్లను కూడా ఆర్జీవీ కలిశాడు. వారి నుంచి వివరాలను సేకరించినట్టుగా తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశం మొత్తాన్నీ కదలించిన సంఘటన దిశ పై అఘాయిత్యం. చాలా వ్యూహాత్మకంగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి, అత్యంత క్రౌర్యంగా హత్య చేసి.. కాల్చి చంపి.. కిరాతాకానికి పాల్పడ్డారు నిందితులు. దిశ హత్యపై ప్రజల నుంచి వ్యక్తం అయిన నిరసనను ప్రభుత్వం కూడా తట్టుకోలేకపోయింది. దీంతోనే నిందితుల ఎన్ కౌంటర్ జరిగిందనే అభిప్రాయాలున్నాయి. అందుకు సంబంధించిన కేసులు, విచారణలు కొనసాగుతూ ఉన్నాయి.
అయితే దిశ హత్యపై మాత్రం పోలీసులు ఆధారాలు చూపించారు. అయితే ఎన్ కౌంటర్ పై మాత్రం విచారణ సాగుతూ ఉంది. ఇలాంటి క్రమంలో ఆర్జీవీ సినిమా అంటున్నాడు. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా.. ఆర్జీవీ వేరే రకమైన పరిస్థితులను ఎదుర్కొనాల్సి రావొచ్చు. వివాదాల మీద సినిమాలు చేయడం వేరు, విషాదాల మీద సినిమాలు చేయడం వేరు.. ఆర్జీవీకి ఈ విషయం తెలిసే ఉండవచ్చు.