జగన్మోహన రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. నిర్దిష్టంగా రాష్ట్రానికి ఇప్పటిదాకా మంచి చెడులు ఏం జరిగాయి? అని లెక్కలు తీస్తే చర్చకు వచ్చేవాళ్లు ఎవ్వరూ ఉండరు! కానీ.. పచ్చ దళాలన్నీ.. మీడియా ముందు మాట్లాడే చాన్సు వస్తే చాలు పాచిపోయిన రికార్డులను పదేపదే ప్లే చేస్తూ ఉంటాయి. పెట్టుబడులు వెనక్కు పోతున్నాయి, ఉపాధి అవకాశాలు పోతున్నాయి.. అంటూ ఒకటే రికార్డు ప్లే చేస్తుంటారు. అయితే.. ఇప్పుడు అతిపెద్ద పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ స్వయంగా వచ్చి ముఖ్యమంత్రితో భేటీ కావడంతో.. చాలా మందిలో అనుమానాలు పటాపంచలు అయిపోతున్నాయి.
ముఖేష్ అంబానీ, తన వారసుడు అనంత్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ నత్వానీ పరిమల్ తో సహా వచ్చి జగన్ తో భేటీ అయ్యారు. ఏదో ముచ్చట్లు చెప్పుకోవడానికి వచ్చిన భేటీ కాదిది. నత్వానీతో సహా రావడం అంటేనే నిర్దిష్ట కార్యచరణకు ఉపక్రమించే అడుగుగానే పరిగణించాలి.
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల గురించి అంబానీ, జగన్ తో చర్చించారు. ఈ చర్చలు ఒక ఎత్తు అయితే.. రాష్ట్రంలో విద్యా వైద్య రంగాల్లో చేపడుతున్న నవీన కార్యక్రమాల్లో రిలయన్స్ భాగస్వామ్యం గురించి జగన్ వారితో మాట్లాడారు. రెండు గంటలకు పైగా కొనసాగిన ఈ చర్చల్లో సీఎం ‘నాడు-నేడు’ గురించి కూడా చర్చించడం గమనార్హం. ఈ చర్చల ఫలితంగా.. రిలయన్స్ సంస్థ నుంచి ఏపీలో పారిశ్రామిక, పెట్టుబడుల ప్రాజెక్టులు రానున్నాయని అంచనా వేయవచ్చు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. వారిద్దరి మధ్య ఇదే తొలి సమావేశం.
రిలయన్స్ పెట్టుబడులు రాష్ట్రానికి వస్తే గనుక.. జగన్ పాలనలో పారిశ్రామికవేత్తలు వెనుకడుగు వేస్తున్నారంటూ తెలుగుదేశం దళాలు సాగిస్తున్న విషప్రచారాలకు అడ్డుకట్ట పడుతుంది. వారి నోర్లు మూతపడాలి. తెదేపా ఎంతగా ప్రచారం చేస్తున్నప్పటికీ.. ఇప్పటిదాకా.. జగన్ ప్రభుత్వ నిర్ణయాల వలన వెనక్కు వెళ్లిపోయిన ప్రాజెక్టు విశాఖ లులూ గ్రూపు ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన కన్వెన్షన్ మాత్రమే. నిజానికి ఆ ప్రాజెక్టులో చంద్రబాబు హయాంలో కేటాయింపులు జరిగినప్పుడే భారీ ఎత్తున అవినీతి, అరాచకాల దందాలు నడిచినట్లుగా ఆరోపణలు వచ్చాయి. అది తప్ప.. పెట్టుబడులు వెనక్కెళ్లిన దాఖలాలు లేవు. బాబు కోటరీ మాత్రం అలాంటి ప్రచారం సాగిస్తూ వచ్చింది. తాజాగా అంబానీతో భేటీ… పెట్టుబడులు పరంగా రాష్ట్రానికి కొత్త ఉత్సాహం కలిగిస్తుందనుకోవచ్చు.