కరోనా సెకెండ్ వేవ్ తో షూటింగ్స్ అన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆచార్య షూటింగ్ ఆగిపోయింది. మొన్నటివరకు తెగించి షూట్ చేసిన పుష్ప యూనిట్ కూడా పనులు ఆపేసింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇప్పటికీ షూటింగ్ జరుపుకుంటున్న సినిమా ఒకే ఒక్కటి. అదే రజనీకాంత్ హీరోగా నటిస్తున్న అన్నాత్తై.
మరి ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో రజనీకాంత్ తో షూటింగ్ ఎలా నడుస్తోంది? ఈ అనుమానం చాలామందికి ఉంది. ఈ విషయంలో యూనిట్ ను మెచ్చుకొని తీరాల్సిందే.
కరోనా కేసులు బయటపడ్డంతో కొన్ని నెలల కిందట రజనీకాంత్ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఆ టైమ్ లో రజనీకాంత్ కూడా హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. అట్నుంచి అటు నేరుగా ఇంటికెళ్లిపోయారు. మళ్లీ లాంగ్ గ్యాప్ తర్వాత తిరిగి హైదరాబాద్ లో సెట్స్ పైకి వచ్చారు. ఈసారి మాత్రం యూనిట్ పూర్తి జాగ్రత్తలు తీసుకుంది.
అన్నాత్తై షూటింగ్ సెట్ ను ఓ మినీ ఐసీయూ రూమ్ గా మార్చేసింది. లైట్ బాయ్ నుంచి సభ్యులంతా మాస్కులతో పాటు పీపీఈ కిట్స్ ధరించాల్సిందే. అంతేకాదు, సెట్స్ లోకి ఎంటరయ్యే ప్రతి ఒక్కరికి శరీరమంతా శానిటైజ్ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, ప్రస్తుతం అది సినిమా షూటింగ్ సెట్ లా అనిపించదు. ఓ కార్పొరేట్ హాస్పిటల్ లా కనిపిస్తుంది.
ఇక రజనీకాంత్ విషయానికొస్తే.. ఈసారి రజనీకాంత్ కు పూర్తిగా దూరంగా ఉంటున్నారంతా. ఎవరైనా రజనీకి 10 అడుగుల దూరంలో ఉండాల్సిందే. ఒక్క దర్శకుడు శివ మాత్రమే.. సీన్ వివరించాలి కాబట్టి, 4 అడుగుల దూరం మెయింటైన్ చేస్తున్నాడు. ఆ టైమ్ లో కూడా డబుల్ మాస్క్ పెట్టుకుంటున్నాడు దర్శకుడు. ఇక మేకప్ మేన్ కైతే తప్పదు కాబట్టి ఆయన పీపీఈ కిట్ తో, డబుల్ మాస్క్ తో రజనీ పక్కనే ఉంటున్నాడు.
ఆరోజు షూట్ లో రజనీకాంత్ తో ఎవరు నటిస్తారో వాళ్లు మాత్రమే ఆయనకు దగ్గరగా ఉంటున్నారు. వాళ్లు కూడా షాట్ ఓకే అయిన తర్వాత 10 అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిందే. ఇలా పూర్తి జాగ్రత్తలతో సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు. రీసెంట్ గా నయనతార కూడా సెట్స్ లో జాయిన్ అవ్వడంతో షూటింగ్ ఊపందుకుంది. మరో 10 రోజుల్లో టోటల్ సినిమా కంప్లీట్ చేసి, దీపావళికి రిలీజ్ చేయాలనేది ఆలోచన.