కులానుబంధ రూపేణా…

స్వాతంత్ర్యకాలం లో ఆస్తులు అమ్ముకుని మీడియాను నడిపి, ప్రజలను చైతన్యవంతం చేసిన కాలం కాదిది. మీడియా మీద ఇంకా అరకొరగా మిగిలిన నమ్మకాన్ని అమ్ముకునే రోజులు వచ్చేసాయి. మీడియా అనేది బహుళార్ధకసాధక వ్యాపారమైపోయింది. అంతే…

స్వాతంత్ర్యకాలం లో ఆస్తులు అమ్ముకుని మీడియాను నడిపి, ప్రజలను చైతన్యవంతం చేసిన కాలం కాదిది. మీడియా మీద ఇంకా అరకొరగా మిగిలిన నమ్మకాన్ని అమ్ముకునే రోజులు వచ్చేసాయి. మీడియా అనేది బహుళార్ధకసాధక వ్యాపారమైపోయింది. అంతే కాదు బహుళ జాతీయ వ్యాపారంగా విస్తరించింది. అయితే ఎంత ఎదిగినా, ఎంత వ్యాపారమైన కొన్నింటిలోనైనా విలువలు లేదా, కనీసపు బాధ్యతలు విస్మరించకూడదు. పార్టీల ప్రయోజనాన్ని పక్కన పెట్టి, ప్రజా ప్రయోజనాన్ని కాస్తయినా ఆలోంచించాల్సి వుంది.

మీడియాకు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏకంగా నాలుగో స్థాయి కట్టబెట్టారు. ఫోర్త్ ఎస్టేట్ అంటూ లీగల్, పొలిటికల్, ఆడ్మినిస్ట్రేషన్ల సరసన కూర్చోపెట్టారు అంటే మీడియాకు ఇచ్చిన గౌరవం కన్నా, బాధ్యత ఎంత అన్నది ఆలోచించాలి. రాజకీయ పార్టీలు తమ చిత్తానికి నిర్ణయాలు తీసుకున్నా, తమ చిత్తానికి పని చేసుకుంటూ పోయినా, తమకంటూ ఓ స్టాండ్ తీసుకుని, ఆ దిశగా వార్తలు వండి వార్చకుని, వడ్డించుకుంటూ పోవడం వరకు సబబే. కానీ అలా అని చెప్పి, కేవలం గుడ్డిగా ప్రతి దానిని టేకిట్ గ్రాంట్ గా విమర్శించుకుంటూ పోవడం ఎంత వరకు సబబు?

జగన్ అంటే ఓ వర్గపు మీడియాకు పడదు. అది వారి ఇష్టం. సో, ఆ ఇష్టా ఇష్టాలకు అనుగుణంగా వారి వారి మీడియాను ముందుకు నడిపిస్తారు. అది కూడా వారి ఇష్టం. నమ్మడం, నమ్మకపోవడం లేదా వారి స్టాండ్ కరెక్ట్ నా కాదా? అన్నది జనం చూసుకుంటారు. కానీ కేవలం జగన్ అంటే తమకు కిట్టదు కదా అని, మంచి విషయాల్లో కూడా సహకరించకపోతే, సదరు మీడియా తన బాధ్యతలను విస్మరించినట్లే అవుతుంది. మీడియాగా సమాజానికి ద్రోహం చేసినట్లే అవుతుంది. సమాజానికి, రాష్ట్రానికి పనికి వచ్చే మంచి వ్యవహారాలకు మీడియా తన తోడ్పాటును, వ్యక్తిగత రాగ ద్వేషాలకు అతీతంగా మద్దతు ప్రకటించాల్సి వుంది.

ఆంధ్ర దేశంలో మద్యపాన వ్యవహారం ఓసారి చూద్దాం.

జగన్ సిఎమ్ కాక ముందు పరిస్థితి ఎలా వుండేది? ఎక్కడ పడితే అక్కడ మద్యం దుకాణాలే. జాతీయ రహదారులు, ప్రధాన రహదారుల పక్కన మద్యం దుకాణాలు వుండకూడదని కోర్టు ఆదేశిస్తే, దుకాణాలన్నీపొలాల్లోకి మారాయి. కానీ అంతలోనే మళ్లీ రోడ్ల మీదకు వచ్చాయి. ఇది ఎలా సాధ్యమైంది. కోర్టు తీర్పును చంద్రబాబు ప్రభుత్వం భలే సులువుగా మాయ చేసింది. ప్రధాన రహదారులను సాదా సీదా రహదారులుగా డీ నోటిఫై చేసేసింది. దీంతో మళ్లీ మద్యం దుకాణాలు రోడ్ల మీదకు వచ్చాయి.

ఈ విషయంలో ఒక్క మీడియా చంద్రబాబును తప్పు పట్టిందా? ఇదేం అన్యాయం. కోర్టు తీర్పును ఇలా అపహాస్యం చేసి, పక్కదారి పట్టిస్తే ఎలా అని ఏమన్నా? అడిగారా?

సరే అంతకు ముందు ఏం జరిగింది. ఎన్టీఆర్ హయాంలో మద్యపాన నిషేథం విధించారు. ఆ విధించడానికి పూర్వరంగం ఎవరు సిద్దం చేసారు. తెలుగునాట మీడియానే కదా. తెలుగు నాట ప్రజా ఉద్యమాలు నిర్మించి, జెండాలు, ప్రచార సామగ్రి రూపొందించి, దాన్ని తామే విక్రయించి, నానా హడావుడి చేసారు. ఆ మేరకు ఎన్టీఆర్ నిషేథం తీసుకువచ్చారు.

మరి అప్పుడు జనం యానం పరుగెత్తలేదా? బరంపురం వంక చూడలేదా? బీదర్ దారి పట్టలేదా? ఆ తరువాత చంద్రబాబు నిషేధాన్ని ఎత్తి వేయలేదా? మరి అప్పుడు ఈ మీడియా ఏమంది?

ఇన్నాళ్ల తరువాత జగన్ దశలవారీ మద్యపాన నిషేధానికి పూనుకున్నారు. ప్రతి విషయం అమలులో కొన్ని లోపాలు వుంటాయి. కానీ మీడియా ఈ నిషేధానికి సహకరించాలి కానీ, జగన్ ప్రభుత్వం కారణంగా పక్క రాష్ట్రాల మద్యం దుకాణాలు బాగుపడుతున్నాయి. తెలంగాణలో మద్యం అమ్మకాలు పెరిగాయి. మద్యం వ్యాపారాలు తెలంగాణకు షిప్ట్ అవుతున్నారు, మందు బాబులు ఇబ్బంది పడిపోతున్నారు. ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది, అని రాయడం అంటే ఏమనుకోవాలి?

నిజానికి మీడియా ప్రభుత్వాన్ని గైడ్ చేయాలి. ఇక్కడ లిక్కర్ ను బ్లాక్ చేసి అమ్ముతున్నారు. ఇక్కడ లిక్కర్ ఇల్లీగల్ రవాణా జరుగుతోంది అని వెల్లడించి అరకట్టడానికి సహకరించాలి. అంతే కానీ మద్య నిషేధం నగుబాటు అవుతోందని వార్తలురాయడం అంటే ఏమనుకోవాలి? ఇక సినిమాల్లో ప్రసార మాధ్యమాల్లో మద్యం మంచిది కాదు, హానికరం అనే ప్రకటనలు ఎందుకు? ప్రభుత్వానికి కోట్లకు కోట్లు దండగ కాకపోతే. కేవలం తమ అనుకూల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు అనే ఒకే ఒక్క ఆలోచనతో ఓ మంచి కార్యక్రమాన్ని తుంగలో తొక్కే పని చేయడం అంటే మీడియా బాధ్యతతో వ్యవహరిస్తున్నట్లా? బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నట్లా?

రేషన్ కార్డుల వ్యవహారం

మన రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు అన్నది అన్ని ప్రభుత్వ పథకాలను అయాచితంగా పొందడానికి వీలయిన, అత్యంత కీలకమైన వ్యవహారం. తెల్ల కార్డుకు అర్హుల సంఖ్య కన్నా, కార్డు దారుల సంఖ్య ఎక్కువ అన్నది అందరికీ తెలిసిన విషయం. పలెల్లో మోతుబరులు, తగిన ఆదాయం వున్నవారు కూడా అనేక మంది తెల్ల కార్డుదారులే. గతంలో అనేకసార్లు మన మీడియానే ఈ విషయాన్ని ఎత్తి చూపింది. మన ఖర్మ ఏమిటంటే, ఏ ప్రభుత్వం ఈ తేనె తుట్టను కదిపి, బోగస్ తెల్ల కార్డులను ఏరివేయాలి అనుకున్నా కూడా, ప్రతిపక్షాలు యాగీ చేస్తుంటాయి. పేద ప్రజలకు అన్యాయం జరిగిపోతోంది అంటూ భారీ రేంజ్ లో గగ్గోలు పెడుతుంటాయి.

ఇలాంటి నేపథ్యంలో మీడియా ఏ స్టాండ్ తీసుకోవాలి? నిజమైన బోగస్ కార్డుల ఏరివేతకు మద్దతుగా నిలవాలి కదా? అది ఏ ప్రభుత్వమైనా? కూడా. కానీ మన మీడియా అలా చేయడం లేదు. తమ అనుకూల ప్రభుత్వం వుంటే ఓ విధంగా, కాదంటే మరో విధంగా. మళ్లీ ఇదే మీడియా ఎలా రాస్తుంది అంటే, ఆర్థిక వ్యవస్థ బాగాలేదు. వడ్డీలు కడుతున్నారు. నానా ఇబ్బంది అవుతోంది అంటూ. ఇదంతా ఏమిటి? ఒక వరస వాడి లేకుండా కేవలం రాజకీయ అజెండాతో ముందుకు పోవడం తప్ప వేరు కాదుకదా?

సంక్షేమ ఆర్థిక పథకాలు

కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, మన విధానాల్లో లోపం అనే విత్తనం ఎప్పుడో నాటుకుంది. అది మర్రిమానై కూర్చుంది. ఇప్పుడు చేయాల్సింది అది మరింత వెర్రి కొమ్మలు వేయకుండా చూడడం. అంతే కానీ పక్షపాత వైఖరితో అడ్డమైన రాతలురాసి, దానికి ఎరువు వేసి, మరింత పెంచడం కాదు.

ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వాలు అన్నీ రాబిన్ హుడ్ టైపు వ్యవహారాలే అమలు చేస్తున్నాయి. అర్హులైన వారి నుంచి ముక్కు పిండి పన్ను వసూలు చేయడం, ఓట్ల కోసం సంక్షేమ పథకాల పేరిట డబ్బులు వెదజల్లడం. కేవలం ఆదాయపన్ను మాత్రమే అర్హులు కడుతున్నారు అనుకుంటే అమాయకం అవుతుంది. ఆదాయపన్ను కట్టేవారే, మళ్లీ వాహనపన్ను కడతారు. వాహనపన్ను కట్టేవారే మళ్లీ టోల్ గేట్ల దగ్గర రోడ్ల నిర్మాణానికి డబ్బులు చెల్లిస్తారు. ఆదాయ పన్ను కట్టేవారే మళ్లీ ప్రతి చోటా జీఎస్టీ కట్టేది. ఆదాయ పన్ను కట్టేసాం కదా అని వేరే వేరే వ్యవహారాలకు పన్ను కట్టకుండా వుండే వెసులుబాటు ఈ దేశంలో లేదు.

ఇలా వచ్చిన డబ్బులతో ఫ్యాక్టరీలు కట్టి ఉపాధి కల్పించడం అన్నది పాత చింతకాయ పచ్చడి లాంటి మాట. ఇప్పుడు అంతా డబ్బులు జల్లేయడమే. వ్యవసాయం లాభసాటి కాదు కనుక రైతుకు సాయం చేయడం అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఎవరికి పడితే వారికి అక్కౌంట్ లో డబ్బులు జల్లే సంస్కృతికి చంద్రబాబు తెరతీసారు అన్నది వాస్తవం. సరిగ్గా ఎన్నికల ముందు పసుపు కుంకుమ పేరిట మహిళల ఖాతాల్లో డబ్బులు వేసారు. ఇక అప్పట్లో చూస్కోండి వార్తలు వండి వార్చాయి ఈ మీడియాలు. ఇంక ఇలాంటి బ్రహ్మాస్త్రం నెవ్వర్ బిఫోర్..ఎవ్వర్ ఆఫ్టర్ అన్నట్లుగా.

సరే ఇదేదో బాగుందని, ఆ తరువాత వచ్చిన జగన్ సర్కారు అదే దోవన పోతోంది. ఇప్పుడు ఏం అంటున్నాయి ఈ మీడియా వర్గాలు, రాష్ట్ర ఆర్థికవ్యవస్థ సర్వనాశనం అయిపోతోంది అంటున్నాయి. నిజమే. దొంగతనం తప్పు అనే చెప్పాలి. కానీ పెద్దయ్యాక కాదు, తొటకూర దొంగతనం చేసిన నాడే చెప్పాలి. అప్పుడు. ముద్దుగా వుంటే, ఇప్పుడు చేదుగా వున్నా ఏమీ చేయలేం.

అయితే ఇక్కడ జగన్ సర్కారు ఓ తెలివైన పని చేస్తోంది. టెక్నాలజీని వాడుకుని, కొన్ని గైడ్ లైన్స్  పెట్టి, అర్హుల విషయంలో వీలయినంత ఫిల్టర్ చేస్తోంది. మరి మన మీడియా ఏం చేస్తోంది? ఓ పక్క పందేరాలు చేస్తున్నారంటూ గోల పెడుతోంది. మరోపక్క అర్హులకు అందడం లేదు, అసలు ఎక్కువ మందికి ఇవ్వకుండా హడావుడి చేస్తున్నారు అంటూ రెండు భిన్నమైన మార్గాలు ఎంచుకుని వార్తలు వండుతోంది.

డబుల్ స్టేట్ మెంట్

ఇలా మన మీడియాది ప్రతి చోటా డబుల్ స్టేట్ మెంట్ వ్యవహారామే. మనవాడు అయితే ఇలా రాయి, పరాయి వాడు అయితే అలా రాయి అన్నదే ఎజెండా అయిపోయింది. దీనికి ఏ మీడియా కూడా అతీతం కాదు. ఒకళ్లు గట్టున మేస్తున్నారు అని లేదు. అందరూ చేలోనే మేస్తున్నారు. ఈ ధోరణి ప్రమాదకరం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలోని మూడు ఎస్టేట్ లకు ఒకటే మిగిలింది.

రాజకీయ శక్తికి ఇటు ఆడ్మినిస్ట్రేషన్ ఏనాడో లొంగిపోయింది. ఇక జ్యూడిషియరీ మీద కూడా అప్పుడప్పుడు  మరకలు పడుతున్నాయి. ఆ మేరకు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మిగిలింది మీడియా. ఇది కూడా కులానుబంధాల్లో, సిద్దాంత బంధాల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది.

ఇలాంటి నేపథ్యంలో ఇక ఏది ఈ దేశాన్ని ఓ దిశగా నడిపించగల శక్తి?

చాణక్య
[email protected]