నెల్లూరులో హైటెక్ కిడ్నాపర్.. పోలీసులు షాక్

“నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు, అయ్యో ఇప్పుడే నా ఫోన్ చార్జింగ్ అయిపోయింది, ఒకే ఒక్క కాల్ చేసుకుని ఇస్తాను, మీ ఫోనివ్వండి ప్లీజ్” అనే డైలాగ్ మనం చాలాసార్లే విని ఉంటాం. పరోపకారం…

“నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు, అయ్యో ఇప్పుడే నా ఫోన్ చార్జింగ్ అయిపోయింది, ఒకే ఒక్క కాల్ చేసుకుని ఇస్తాను, మీ ఫోనివ్వండి ప్లీజ్” అనే డైలాగ్ మనం చాలాసార్లే విని ఉంటాం. పరోపకారం కోసం కొన్నిసార్లు మనం ఫోన్ కూడా ఇచ్చే ఉంటాం. అయితే అందరికీ ఇలా ఫోన్లు ఇస్తే పరోపకారం సంగతి దేవుడెరుగు.. పక్కాగా బుక్ అవుతామంటున్నారు పోలీసులు. అవును ఇది నిజం. ఇటీవలే నెల్లూరులో ఓ కిడ్నాప్ ముఠా పోలీసులకు దొరకడంతో ఈ విషయం బైటపడింది.

కిడ్నాపర్ ఉపయోగించిన ఫోన్ నెంబర్లన్నీ ట్రేస్ చేసిన పోలీసులు అవాక్కయ్యారు. ఎందుకంటే.. అవి అసలు అతనికి సంబంధం లేని నెంబర్లు. ఆటోలో వెళ్తూ.. బాస్ మీ ఫోన్ ఒక్కసారి ఇవ్వండి అని తీసుకుంటాడు, తన వ్యవహారం చక్కబెట్టుకుని వెంటనే అతనికిచ్చేస్తాడు. అలాగే బస్టాండ్ లు, రైల్వే స్టేషన్లలో తిరుగుతూ.. పక్కన ఉన్నవారి ఫోన్ తీసుకుని కిడ్నాప్ ఎపిసోడ్ లో వాడుకున్నాడు. చివరకు పోలీసులు ఆ నెంబర్లు వాడే వ్యక్తులను పట్టుకుంటే.. వారంతా నోరెళ్లబెట్టారు. మీ ఫోన్ లోనుంచే కదా డబ్బులు డిమాండ్ చేశారు, అంటే వారి వద్ద సమాధానం లేదు.

అన్ లిమిటెడ్ ఔట్ గోయింగ్ కదా.. ఎవరూ పెద్దగా దీన్ని పట్టించుకోలేదు. అవతలివాడు ఎవరికి ఫోన్ చేస్తున్నాడని కూడా ఆరా తీయలేదు. అలా తీయకపోవడం వల్లే చాలామంది చిక్కుల్లో ఇరుక్కున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం కిడ్నాపర్ తన ఫోన్ ని ఎవరూ ట్రాక్ చేయకుండా పక్కనవాళ్ల ఫోన్లు తీసుకుని డబ్బులు డిమాండ్ చేశాడు. చివరకు పోలీసులు ఈ ఫోన్ ఓనర్ల దగ్గర నుంచి వివరాలు తీసుకుని సీసీ టీవీ ఫుటేజీ చెక్ చేసుకుంటే కానీ అసలు నిందితుడు దొరకలేదు.

ఇలా పోలీసుల్నే ముప్పతిప్పలు పెట్టాడు ఓ కిడ్నాపర్. చివరకు నిందితుడ్ని పట్టుకుని కిడ్నాప్ ఎపిసోడ్ ని క్లోజ్ చేసిన నెల్లూరు పోలీసులు.. అపరిచితులకు ఫోన్లు ఇవ్వొద్దని ప్రజలకు సూచించారు. ఒకవేళ ఇచ్చినా వారు ఎవరికి కాల్ చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారనే విషయంపై ఓ చెవి వేయాలని చెబుతున్నారు. సో.. బీ కేర్ ఫుల్.. ఎవరైనా ఫోన్ కావాలని అడిగితే.. ఎగబడి ఇచ్చేయకండి, కాస్త ముందూ వెనకా ఆలోచించి ఇవ్వండి.