విశాఖపై ఆగని కామెడీ.. ట్రంప్ ను కూడా వదలరేమో!

విశాఖలో చంద్రబాబు పరాభవం ఎపిసోడ్ ని మరింత కామెడీ చేసుకుంటోంది టీడీపీ. “అయ్యా బాబుగారిని అడ్డుకున్నారు, అయ్యా బాబుగారిపై చెప్పులేశారు, టమోటాలు, కోడిగుడ్లు విసిరేశారు”. అంటూ ఎక్కేగడప, దిగేగడపలా వ్యవహారం మార్చేశారు. చంద్రబాబుపై స్థానికులు…

విశాఖలో చంద్రబాబు పరాభవం ఎపిసోడ్ ని మరింత కామెడీ చేసుకుంటోంది టీడీపీ. “అయ్యా బాబుగారిని అడ్డుకున్నారు, అయ్యా బాబుగారిపై చెప్పులేశారు, టమోటాలు, కోడిగుడ్లు విసిరేశారు”. అంటూ ఎక్కేగడప, దిగేగడపలా వ్యవహారం మార్చేశారు. చంద్రబాబుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తే, దానికి పోలీసులు కారణమంటూ వితండవాదం చేయడమే కాదు, గవర్నర్ ని కలసి కూడా ఫిర్యాదు చేసింది టీడీపీ బ్యాచ్.

రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, శాంతి భద్రతలను కాపాడటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని గవర్నర్ వెంటనే కలుగజేసుకోవాలంటూ వినతిపత్రం అందించారు. టీడీపీ వాలకం చూస్తుంటే ఇంకొన్ని రోజులాగితే.. గవర్నర్ ని కూడా ఈ వివాదాల్లోకి లాగుతారన్న అనుమానం కలగకమానదు. అప్పుడిక టీడీపీకి ఉన్న ఆప్షన్ ప్రధాని ఆ తర్వాత రాష్ట్రపతి మాత్రమే. ఇప్పటికే సీఎం జగన్, ప్రధాని మోదీ భేటీపై కారాలు మిరియాలు నూరుతున్న పచ్చ బ్యాచ్.. నేరుగా రాష్ట్రపతికే ఫిర్యాదు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

మాకు రాజధాని రాకుండా అడ్డుకోవాలని చూస్తున్న చంద్రబాబుని మా ప్రాంతంలో తిరగనిచ్చేది లేదని అంటున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా అక్కడికి వెళ్లాలని చూసిన చంద్రబాబుకి ఊహించని ఎదురుదెబ్బే తగిలింది. అయితే కిందపడ్డా పైచేయి తనదేనంటూ.. ఆందోళన చేసింది వైసీపీ బ్యాచ్ అంటూ నిందలేస్తున్నారు. వారికి పోలీసులు సహకరించారని మరింతగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. విశాఖ ఉదంతంతో చంద్రబాబుకి మైండ్ బ్లాక్ అయి.. ఇంట్లో నుంచి బైటకు రాని సందర్భంలో టీడీపీ నేతలు ఇలా వినతిపత్రాలు తీసుకుని అందరి చుట్టూ తిరుగుతూ.. సింపతీ కోసం పాకులాడుతున్నారు.

అన్నిటికంటే పెద్ద కామెడీ ఏంటంటే.. గవర్నర్ ని కలసి బైటకొచ్చిన వర్ల రామయ్య.. విశాఖ ఘటన గురించి గవర్నర్ తనకన్ని వివరాలు తెలుసన్నారని చెప్పుకొచ్చారు. అంటే విశాఖలో చంద్రబాబు చేసిన ఓవర్ యాక్షన్ తెలుసని గవర్నర్ అన్నారు కాబోలు. దాన్ని టీడీపీ నేతలు తమకి అనుకూలంగా చెప్పుకుంటున్నారు. మొత్తమ్మీద.. బ్రహ్మాండం బద్దలైపోయినట్టు, రాష్ట్రంలో పాలన స్తంభించినట్టు టీడీపీ రచ్చ చేస్తోంది. వీళ్ల ఓవరాక్షన్ ఎలా ఉందంటే.. ట్రంప్ కూడా తమపై సానుభూతి కురిపించాడని చెప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.