విశాఖ ప్రజలు మంచివాళ్ళు.. ఈ బిస్కెట్లు వేసే కార్యక్రమం ఇంకా గట్టిగా టీడీపీ పెద్దలు ఇపుడు చేస్తున్నారు. ఎందుకంటే తాజాగా విశాఖ ఎయిర్ పోర్టులో చంద్రబాబు పరువు పోయింది. వచ్చిన బాబుని వెనక్కి పంపి తిరుగు విమానం ఎక్కించేశారు. దాంతో బాబు ఉత్తరాంధ్రా ద్రోహి అన్నది బాగా ఎస్టాబ్లిష్ చేయడంతో వైసీపీ సక్సెస్ అయింది. అది పూర్తిగా జనం నమ్మితే సైకిల్ పంక్చర్ అవుతుందని కంగారు పడ్డ పచ్చదళం కోరస్ లా ఒకటే పల్లవి పాడుతున్నారు. బాబుతో పాటు, పార్టీ నాయకులంతా విశాఖ వాళ్ళు మా చెడ్డ మంచోళ్ళు అంటూ ఒకటే పొగుడుతున్నారు.
బాబుని అడ్డుకుంది వైసీపీ గూండాలు తప్ప విశాఖ వాసులకు ఏం సంబంధం లేదని కూడా పెద్ద సర్టిఫికేట్లు ఇస్తున్నారు. ఇలా అడ్డుకోవడం, గొడవలు చేయడం విశాఖ వాసులకు తెలియని పని అని కూడా అంటున్నారు. విశాఖ వాసులే బాబుని గో బ్యాక్ అన్నారని చెప్పడం ఆ జిల్లావాసులను అవమానించడమేనని టీడీపీ సీనియర్ తమ్ముడు యనమల రామక్రిష్ణుడు దీర్ఘాలు తీస్తున్నారు. అలా విశాఖవాసులను వైసీపీ నేతలు రౌడీలతో పోల్చడాన్ని యనమల తప్పు పట్టారు.
ఇది సరేననుకున్నా విశాఖవాసులు ఎవరూ రాజధాని కోరుకోవడం లేదని చంద్రబాబుతో సహా టీడీపీ పెద్దలు చెప్పడం కూడా వారిని అవమానించడం కాదా. విశాఖవాసులు రాజధాని ఇచ్చినా మాకు వద్దు అనేంత అమాయకులని చెప్పడమా పచ్చ పార్టీ నేతల ఉద్దేశ్యమా. ఉత్తరాంధ్ర ఎంతో వెనకబడిపోయింది, విశాఖకు రాజధాని వస్తే ఏదో గుడ్డిలో మెల్ల అయినా బాగుపడుతుందని ఆశపడడం తప్పు అన్నట్లుగా టీడీపీ తమ్ముళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడవచ్చునా. విశాఖకు రాజధాని ఎవరు అడిగారని ఎగతాళి చేయడం ద్వారానే చంద్రబాబు తమ్ముళ్ళు ఏనాడో ఇక్కడ వాళ్ళను అవమానపరచారు.
నిజానికి విశాఖకు రాజధాని అయ్యే అర్హత లేదనా టీడీపీ ఉద్దేశ్యమన్న ప్రశ్న కూడా వస్తోంది. అంటే విశాఖ ఉత్త సిటీగానే ఉండాలి, ఇంకా పుట్టీ పుట్టని అమరావతి మాత్రం వరల్డ్ క్లాస్ సిటీ కావాలి. ఇలా ఆసియా ఖండంలోనే అతి పెద్ద నగరంగా ఇప్పటికే ఉన్న విశాఖను టీడీపీ నేతలు ఎంతగా అవమానిస్తున్నారో తమ్ముళ్ళు గుర్తిస్తున్నారా అని మేధావులు అడుగుతున్న ప్రశ్నలకు చంద్రబాబు సహా టీడీపీ నేతల వద్ద సమాధానం ఉందా.