కడుపు ఉబ్బరం (గ్యాస్‌)

డాక్టర్లు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకపోయినప్పటికీ, పేషెంట్లు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే ఆరోగ్య సమస్యలు కొన్ని ఉన్నాయి. అటువంటి వాటిల్లో గ్యాస్‌ సమస్య ఒకటి. ఈ నాగరిక ప్రపంచంలో గ్యాస్‌ సమస్య చాలా మందిని ఇబ్బందులపాలు చేస్తుంటుంది.…

డాక్టర్లు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకపోయినప్పటికీ, పేషెంట్లు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే ఆరోగ్య సమస్యలు కొన్ని ఉన్నాయి. అటువంటి వాటిల్లో గ్యాస్‌ సమస్య ఒకటి. ఈ నాగరిక ప్రపంచంలో గ్యాస్‌ సమస్య చాలా మందిని ఇబ్బందులపాలు చేస్తుంటుంది. కడుపులో గ్యాస్‌ తయారవుతున్నప్పుడు, దానిని తగ్గించుకోవడానికి చూడాలి తప్పితే, బలవంతంగా నొక్కి పట్టకూడదని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. చరకసంహిత అనే ఆయుర్వేద చికిత్సా గ్రంథం 'న వేగాన్‌ ధారయేత్‌' అంటూ, పదమూడు రకాలైన శారీరక సహజ కృత్యాలను ఆపుకోకూడదనీ, ఒకవేళ ఆపుకున్నట్లయితే తదనుగుణమైన సమస్యలుత్పన్నమవుతాయనీ పేర్కొంది. వాటిలో మల మూత్రాది వేగాలతో పాటు పేగులలో తయారయ్యే వాయువు ఒకటైతే, ఆమాశయంలో ఏర్పడే త్రేన్పు (ఉద్గారం) మరొకటి.

ఇలా తయారయ్యే సహజ వాయువును అలా ఉంచితే, ఒకోసారి ఆహార విహార కారణాల వల్లగాని, ఇతర ప్రత్యేక కారణాల వల్లగాని, వాతం ప్రకోపించి జీర్ణవ్యవస్థలో అమితంగా గ్యాస్‌ తయారయ్యేలా చేస్తుంది. ఇటువంటి స్థితిని ఆయుర్వేదం 'ఆధ్మానం' అని వ్యవహరించింది. గ్యాస్‌ అనేది సాధారణంగా మనం తినే ఆహారంతోగాని, తాగే ద్రవపదార్థాలతోగాని, లాలాజలంతోగాని శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీనిలో కొంత భాగం ఆమాశయం నుంచి త్రేన్పు రూపంలో బైటకు వెళ్లిపోతే మిగిలిన భాగం పేగులలోకి ప్రవేశించి, అక్కడనుంచి శరీరంలోకి విలీనమవుతుంది. చివరగా మిగిలిన సూక్ష్మాంశం, నత్రజనితో కలిసి మలద్వారం నుంచి వెలుపలకు గ్యాస్‌ రూపంలో వెళ్లిపోతుంది.

ఆహారాన్ని నమలకుండా అమాంతం మింగడం; గ్యాస్‌తో నిండిన కూల్‌డ్రింకులను, సోడాలను తాగడం; పొగాకు, కిళ్లీలు, చాక్లెట్లు, బబుల్‌గమ్‌లూ మొదలైన వాటిని అదే పనిగా నములుతుండటం; మసాలా పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం ఇటువంటి వాటి వల్ల ఆమాశయంలోకి వాయువు ఎక్కువగా ప్రవేశిస్తుంది. ఈ కారణాలను అలా ఉంచితే, కొన్నిసార్లు ఆందోళన, భయం, ఉద్వేగం వంటి మానసిక కారణాలు సైతం గ్యాస్‌ తయారీకి దోహదపడతాయి. అలాగే కొన్ని సందర్భాల్లో పేగుపూత, అల్సర్లు, శరీరంలో నీరు శోషణ చెందటం (డీహైడ్రేషన్‌) మొదలైన స్థితులు కూడా గ్యాస్‌కు కారణాలుగా నిలుస్తాయి.

జీర్ణ వ్యవస్థలోనికి ప్రవేశించిన ఆహారం సూక్ష్మాంశాలుగా విభాజితమయ్యేటప్పుడు పులిసి పోతే, అప్పుడు కూడా గ్యాస్‌ తయారవుతుంది. నిజానికి ఇలా తయారయ్యే గ్యాస్‌కే చికిత్స అవసరమవుతుంది.

పిండి పదార్థాలను సరిగ్గా ఉడికించనప్పుడుగాని, మలబద్దకం విరేచనాలు వంటి స్థితిగతులు ప్రాప్తించినప్పుడుగాని, జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైములు తక్కువైనప్పుడుగాని, యాంటీ బయాటిక్స్‌ను అధికంగా వినియోగించినప్పుడుగాని, ఇటువంటివే ఇంకా అనేక సందర్భాలు ఎదురైనప్పుడుగాని ఆహారం పేగులలో నిలువ ఉండి, పులిసిపోయి గ్యాస్‌ తయారవుతుంది.

1. ఆహారం పడకపోవటం (ఫుడ్‌ ఎలర్జీ)

చాలామంది పేషెంట్లు తాము ప్రత్యేకంగా ఆహారమేదీ తీసుకోవడం లేదనీ, అయినా ఎందుకనో గ్యాస్‌ ఎక్కువగా తయారవుతోందనీ అంటుంటారు. అయితే అకారణంగా గ్యాస్‌ తయారవడమనేది సాధారణంగా జరగదు. గ్యాస్‌ తయారు కావడానికి ఆహారపరమైన కారణాలే ముఖ్యమైనవి.

సూచనలు : మాట్లాడుతూ తినకూడదు. ప్రతి ముద్దనూ నింపాదిగా నమిలి తినాలి. క్యాబేజీ, ఉల్లిపాయ, యాపిల్స్‌, అరటిపండు, ముల్లంగి, గోధుమపిండి, మినుములు, కోడిగ్రుడ్లు… ఇటువంటి వాటి వల్ల గ్యాస్‌ ఎక్కువగా తయారవుతుంది కనుక వీటి వాడకాన్ని తగ్గించాలి. టీ, కాఫీలను ఎక్కువగా మరిగించడం వలన లేదా వీటిల్లో పంచదార ఎక్కువగా కలపడం వల్ల గ్యాస్‌ ఉత్పన్నమౌతుంది. తీపి పదార్థాలు ప్రేవులలోకి వెళ్లి త్వరగా పులిసిపోతాయి. ఫలితంగా వీటినుంచి గ్యాస్‌ వెలువడుతుంది.

కొంతమంది పీచు పదార్థాలు ఎంత ఎక్కువగా తీసుకుంటే అంతమంచిదనే అభిప్రాయంతో వాటిని అపరిమితంగా తీసుకుంటుంటారు. అయితే నార కలిగిన పీచు పదార్థాల వలన కూడా గ్యాస్‌ తయారయ్యే అవకాశముందని గుర్తించాలి. ఇవి ఆలస్యంగా జీర్ణమవుతూ గ్యాస్‌ను విడుదల చేస్తాయి. మీరు బీన్స్‌ వంటి ఆహార పదార్థాలను వాడుకోవడం తగ్గించుకోలేకపోతే వాటిని ఒక రోజంతా నీళ్లలో నానబెట్టి కుక్కర్‌లో ఉడికిస్తే సరిపోతుంది.

ఆమాశయాన్ని పూర్తిగా ఆహారంతో నింపకుండా పావు భాగాన్ని గాలికోసం వదిలివేయడం, భోజనం చేసిన తరువాత కనీసం వంద అడుగులు నడవడం వంటివి కూడా ఆధ్మానానికి ఆయుర్వేదం సూచించిన నివారణలు.

గృహచికిత్సలు : 1) కడుపు ఉబ్బరింపు వలన ఏ అర్థరాత్రో మీకు మెళకువ వచ్చి, గుండె ప్రాంతమంతా పట్టేసినట్లుంటే, ఒక గుడ్డను కుదురుగా చుట్టి, పెనం మీద వేడి చేసి ఉదర ప్రాంతంలో కావడం పెట్టుకోండి. దీనితో ఉదర ప్రాంతపు కండరాలు సడలి ఉబ్బరింపు తగ్గుతుంది. 2) డుపు ఉబ్బరింపు ఉన్నప్పుడు ఒక గ్రాము అల్లంలో చిటికెడంత ఉప్పును కలిపి రెండుపూటలా తీసుకుంటే కూడా చక్కని ఫలితం ఉంటుంది. 3) వాము (నాలుగు భాగాలు), శొంఠి (రెండు భాగాలు), నల్ల ఉప్పు (ఒక భాగం), శంఖ భస్మం (ఒక భాగం) వీటన్నిటినీ కలపండి. ఈ మిశ్రమాన్ని అరచెంచాడు చొప్పున ఒక కప్పు వేడి నీటితో కలిపి తీసుకోవాలి. 4) త్రిఫలా చూర్ణం (కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ), త్రికటు చూర్ణం ఈ రెండింటిని కలుపగా తయారైన మిశ్రమాన్నుంచి ఒక చెంచాడు చూర్ణాన్ని డికాక్షన్‌ కాచుకుని తాగాలి.

ఔషధాలు : మహాశంఖవటి, హింగ్వాష్టక చూర్ణం.

2. కడుపునొప్పితో కూడిన మలవిసర్జన (ఇరిటబుల్‌ బొవెల్‌ సిండ్రోమ్‌)

ఆయుర్వేదంలో వివరించిన 'గ్రహణి' అనే వ్యాధిలో ఉదరంలో నొప్పి, మలబద్దకం, విరేచనాలు మార్చి మార్చి కనిపిస్తాయి. ఈ వ్యాధిలో పై లక్షణాలే కాకుండా కడుపు ఉబ్బరింపు, కడుపు నొప్పి, గ్యాస్‌ తయారవడం వంటి లక్షణాలుంటాయి. దీనిని ఇరిటబుల్‌ బొవెల్‌ సిండ్రోమ్‌ లేదా, స్ప్రూ అనే వ్యాధులతో పోల్చవచ్చు.

దీనిలో ప్రత్యేక లక్షణం కడుపు నొప్పి మలవిసర్జనతో కొంత తగ్గినట్లనిపించడం. ఒక్కొక్కసారి ఆహార సేవనతో ఎక్కువవుతుంది. మలం రిబ్బన్‌లాగా వెడల్పుగా వెలువడుతుంది. ఒక్కొసారి చిన్న చిన్న ఉండలుగా కూడా ఉండవచ్చు. ఉదయంపూట హెచ్చు మోతాదులో, పలుచగా మల విసర్జన జరగడం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. రాత్రిపూట విరేచనమవడం చాలా అరుదు. అలాగే ఆహారం తీసుకున్న వెంటనే మల విసర్జన చేయాలనిపించడం కూడా ఈ వ్యాధి లక్షణాలలో ప్రధానమైనది.

ఇతర లక్షణాల విషయానికి వస్తే, మల విసర్జన సంతృప్తికరంగా జరుగదు. కడుపు లోపల జనించే గడబిడ శబ్దాలు బైటకు సైతం వినిపిస్తాయి. ఒక్కొక్కసారి మూత్ర విసర్జన కూడా ఎక్కువ సార్లు చేయాల్సి వస్తుంది.

ఆయుర్వేదంలో ఈ వ్యాధికి సంతృప్తికరమైన చికిత్స ఉంది. దీనిలో పర్పటి యోగాలను ప్రయోగించాల్సి ఉంటుంది. వీటిని వాడుతున్నప్పుడు పటిష్టమైన ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది కనుక దీనికి వైద్య పర్యవేక్షణ తప్పనిసరి.

సూచనలు : దీనికి ఆయుర్వేదోక్త వ్యాధి పరీక్షలైన రోగ పరీక్ష, రోగి పరీక్షలు రెండూ చేయాల్సి ఉంటుంది. ఐ.బి.యస్‌. (ఆయుర్వేదంలో గ్రహణి) అని తేలితే పీచుపదార్థాలు, సంకోచహర ఔషధాలతో పాటు మానసిక స్థిరత్వాన్ని కలిగించడం కోసం సత్వావజయ చికిత్సలు, కౌన్సిలింగ్‌లూ అవసరమవుతాయి.

ఆహారపరంగా మార్పులు, చేర్పులూ చేసుకోవాలి. పాలు, ఇతర పాల పదార్థాలు; కెఫిన్‌ అధికంగా ఉండే టీ, కాఫీ, కోలా డ్రింకులు; మద్యం, మసాలాల వంటి ఉత్ప్రేరక పదార్థాలు; చాక్లెట్లు, ఇతర చాక్లెట్‌ కలిగిన పదార్థాలు (బూస్టు, బోర్నవిటా తదితరాలు) బాగా తగ్గించాలి. లేదా, మానేయాలి.

మృదుకోష్ఠం కలిగిన వ్యక్తులు ఆహారంలో పీచు పదార్థాలను మానేయాలి. క్రూర కోష్ఠం కలిగిన వ్యక్తులు పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. పండ్లు, ఆకుకూరలు, గింజధాన్యాల పైనుండే పొట్టు వీటన్నిటిలో పీచు పదార్థం ఉంటుంది. ఆయుర్వేద వైద్యుల సహాయంతో మీకున్నది మృదుకొష్ఠమా, లేక క్రూర కోష్ఠమా అనేది తెలుసుకోవచ్చు. పోతే, మద్యం, టీ, కాఫీ, కోలాడ్రింకులు, తీపి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, నూనె పదార్థాలు, గ్యాస్‌ను పుట్టించే తినుబండారాలు, మసాలా దినుసులు వీటిని ఎంత వీలైతే అంత తక్కువగా వాడుకోవాలి.

మానసికమైన ఒత్తిడిలకు దూరంగా ఉండాలి. ఆయుర్వేదంలో ఒత్తిడిని తగ్గించడానికి జపం, ధ్యానం వంటి ఆద్రవ్యభూత చికిత్సలతో పాటు ధారా చికిత్స వంటి క్రియా కల్ప చికిత్సలను చెప్పారు. అలాగే, అశ్వగంధ, జటామాంశీ వంటి మూలికలు కూడా ఉపయోగ పడతాయి. పేగుల లోపల ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడానికి శంఖభస్మ వంటి మందులు పని చేస్తాయి. గ్యాస్‌ను అదుపు చేయటానికి వాము, అజమోద గింజలు, నల్లజీలకర్ర, అల్లం, పుదీనా వంటివి పని చేస్తాయి. విరేచనాలను ఆపడానికి మెంతులు, బూరుగబంక, యష్టిమధుకం వంటివి ఉపకరిస్తాయి. లక్షణాలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు పర్పటి వర్గానికి చెందిన ఔషధాలు, ఇతర శక్తివంతమైన ఔషధాలు అవసరమవుతాయి.

ఔషధాలు : కుటజఘనవటి, గ్రహణీకపాట రసం, బిల్వలేహ్యం, శాల్మలీ నిర్యాసం, లాక్షాది చూర్ణం, పంచామృత పర్పటి.

3. గాలిని మింగటం (ఎయిరోఫేజియా)
ఈ నైజం ఉన్నవారు ఆహారాన్ని నమలకుండా హడావిడిగా మింగుతారు. ఆహార సేవన మీద మనసు నిలుపరు. ఇటువంటప్పుడు గాలి ఆహారం మధ్య బందీ అయిపోయి కడుపు ఉబ్బరింపును కలుగచేస్తుంది. హడావిడి మనస్తత్వాన్ని సరిదిద్దుకోవడం అనేది దీనికి చక్కని పరిష్కారం.

4. ఆహారం జీర్ణం కాకపోవటం (ఇండైజేషన్‌)
అజీర్ణానికి, కడుపు ఉబ్బరింపుకూ సంబంధం ఉంది. ఆయుర్వేదంలో అజీర్ణానికి ఎన్నో శక్తివంతమైన మందులున్నాయి. 

గృహచికిత్సలు : 1) ధనియాలు, శొంఠి వీటిని సమతూకంగా తీసుకుని కషాయం కాచి పూటకు అరకప్పు మోతాదుగా రెండుపూటలా ఆహారానికి ముందు పుచ్చుకోవాలి. 2) కరక్కాయ పెచ్చులు, పిప్పళ్ళు, సౌవర్చల లవణం వీటిని సమాన భాగాలు తీసుకుని పొడిచేసి పూటకు అరచెంచాడు మోతాదుగా వేడినీళ్ళతో లేదా పెరుగు మీద తేటతో తీసుకోవాలి. 3) శొంఠి పొడిని (అరచెంచాడు) బెల్లంతో కలిపి మూడుపూటలా పుచ్చుకోవాలి. 4) కరక్కాయ పెచ్చుల చూర్ణాన్ని పూటకు అరచెంచా చొప్పున అంతే మోతాదు పటిక బెల్లం (మిశ్రి)తో కలిపి ఆహారానికి ముందు రెండు పూటలా తీసుకోవాలి.

ఔషధాలు : హింగ్వాష్టక చూర్ణం, భాస్కరలవణం, చిత్రకాదివటి, పంచాసవం, పిప్పల్యాసవం, అగ్నితుండివటి.

5. పిత్తాశయం వ్యాధిగ్రస్తమవటం (గాల్‌బ్లాడర్‌ డిసీజ్‌)
గాల్‌బ్లాడర్‌కు ఇన్ఫెక్షన్‌ సోకినప్పుడుగాని, దానిలోపల రాళ్లు తయారైనప్పుడుగాని గాల్‌బ్లాడర్‌లో నిలువ ఉండే స్రావాలు నిలిచిపోతాయి. ఫలితంగా కొవ్వు పదార్థాలూ, నూనె పదార్థాలూ జీర్ణం కాకుండా ఉండిపోతాయి. దీనితో కడుపు ఉబ్బరిస్తుంది. దీనికి కారణానుగుణమైన చికిత్స అవసరమవుతుంది.

గృహచికిత్సలు : 1) గోమూత్రంలో కరక్కాయలను ఉడికించి, ఎండించి పొడిచేయాలి. దీనికి లోహభస్మం, బెల్లం కలిపి తీసుకోవాలి. 2) వేపాకురసాన్ని పూటకు రెండు చెంచాలు చొప్పున రెండుపూటలా తీసుకోవాలి. 3) త్రిఫలాలు, వేప బెరడు, కటుకరోహిణి, రేలగుజ్జు వీటినన్నిటినీ సమానభాగాలు కలిపి కషాయం కాచి పూటకు అరకప్పు వంతున రెండు పూటలా చెంచాడు తేనె చేర్చి తీసుకోవాలి. 4) శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, ఇంగువ, శంఖభస్మం, సైంధవలవణం అన్నీ సమభాగాలుగా తీసుకొని పొడిచేసి ఒకటిగా కలపాలి. దీనిని అరచెంచాడు చొప్పున వేడి నీళ్ళతో రెండుపూటలా తీసుకోవాలి.

ఔషధాలు : ఆరోగ్యవర్థినీ వటి, మేదోహరవిడంగాదిలోహం, చంద్రప్రభావటి.

6. పాలు సరిపడకపోవటం (మిల్క్‌ ఇంటాలరెన్స్‌)
కొంతమందికి పాలూ, పాల పదార్థాలూ సరిపడవు. వీటిని తీసుకున్నప్పుడల్లా గ్యాస్‌ తయారవుతుంది. పాలను పచనం చెందించడానికి తోడ్పడే ల్యాక్టేస్‌ అనే ఎంజైమ్‌ లోపించడమే దీనికి కారణం. అలా అని పాలు పూర్తిగా మానేస్తే శరీరానికి అవసరమైన కాల్షియం సమీకరణ కుంటుపడుతుంది కాబట్టి పాలకు బదులు పెరుగునుకాని, మజ్జిగనుకాని తీసుకోవాలి. పాలను తోడుపెట్టిన తరువాత పెరుగుగా మరేప్పుడు దీనిలో ఉండే బ్యాక్టీరియా ల్యాక్టేస్‌ అనే ఎంజైమ్‌ను విడుదల చేస్తాయి. అంటే, పాలను జీర్ణం చేయడానికి అవసరమైన రసాయనిక చర్య బయట వాతావరణంలోనే జరిగిపోతుంది కనుక పాలు జీర్ణం కాకపోవటమనే సమస్య ఉత్పన్నం కాదు. పెరుగును / మజ్జిగను తీసుకుంటే పాల ద్వారా అందాల్సిన పోషకతత్వాలన్నీ శరీరానికి అందుతాయి.

7. క్యాన్సర్‌

ఉదరావయవాల్లో క్యాన్సర్‌ పెరుగుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో గ్యాస్‌ తయారవ్వడమనేదే ప్రధానంగా వుంటుంది. ఆమాశయం, ప్యాంక్రియాస్‌, పేగులు, తదితర భాగాల్లో పెరిగే క్యాన్సర్లు ఇలాంటి లక్షణాన్ని ప్రదర్శిస్తాయి. మలబద్దకం, విరేచనాలవంటి వాటితోపాటు గ్యాస్‌ తయారవ్వటం అనేది ప్రధానంగా వుంటే క్యాన్సర్‌ గురించి కూడా ఆలోచించాలి. వయస్సు మళ్ళిన వారిలో ఇది మరింత అవసరం.

ఔషధాలు : లవణభాస్కర చూర్ణం, కాంకాయనవటి (గుల్మ), పియూషవల్లీరసం, ప్రాణదాగుటిక, సంజీవనీవటి.

డా.చిరుమామిళ్ల మురళీ మనోహర్..  ఎండీ (ఆయుర్వేద)
సెల్ – 9177445454

టీడీపీలోకి పంపి.. ఎమ్మెల్సీ సీట్లను కొనిచ్చిన చరిత్ర ఆయనది.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్