మార్చి నెల ఇచ్చిన ఉత్సాహాన్ని ఏప్రిల్ నెలలో బాక్సాఫీస్ కొనసాగించలేకపోయింది. దీనికి కారణం నెల మధ్యలోకి వచ్చేసరికి కరోనా తీవ్ర రూపం దాల్చడమే. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఏప్రిల్ నెలలో వకీల్ సాబ్ తో పాటు టక్ జగదీష్, లవ్ స్టోరీ, విరాటపర్వం లాంటి సినిమాలు వచ్చి ఉండేవి. బాక్సాఫీస్ కళకళలాడి ఉండేది.
కానీ మరోసారి థియేటర్లపై కరోనా నీడలు కమ్ముకున్నాయి. మూడో వారానికి చాలా థియేటర్లు మూసేశారు. వకీల్ సాబ్ కోసం కొన్ని తెరిచిపెట్టారు. ఆ గ్యాప్ లో మరికొన్ని చిన్న సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి. మొత్తంగా ఏప్రిల్ నెలలో 14 సినిమాలు రిలీజైతే, అందులో వకీల్ సాబ్ ఒక్కటే చెప్పుకోదగ్గ మూవీ.
యువరత్న, వైల్డ్ డాగ్, సుల్తాన్ సినిమాలతో ఏప్రిల్ నెల మొదలైంది. ఏప్రిల్ 1వ తేదీన వచ్చిన యువరత్న సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా వచ్చిన 24 గంటల వ్యవథిలో వైల్డ్ డాగ్, సుల్తాన్ సినిమాలొచ్చాయి. నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమాకు ప్రశంసలు మాత్రమే దక్కగా, సుల్తాన్ కు అవి కూడా దక్కలేదు. కమర్షియల్ గా చూసుకుంటే రెండు సినిమాలూ ఫ్లాప్ అయ్యాయి.
ఇక ఏప్రిల్ 9న వకీల్ సాబ్ సినిమా థియేటర్లలోకి వచ్చింది. పవన్ కల్యాణ్ కమ్ బ్యాక్ మూవీగా, పింక్ సినిమాకు రీమేక్ గా, భారీ అంచనాల మధ్య విడుదలైంది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో అత్యథిక థియేటర్లు దక్కించుకుంది ఈ సినిమా.
పవన్ కల్యాణ్ కు మంచి రీఎంట్రీ మూవీగా ఇది గుర్తింపు తెచ్చుకుంది తప్ప, కమర్షియల్ గా ఇది పెద్దగా నిలదొక్కుకోలేకపోయింది. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందనుకున్న నిర్మాత, అభిమానుల ఆశల్ని వకీల్ సాబ్ వమ్ముచేశాడు. ఈ సినిమాకు వచ్చిన వసూళ్లపై ఇప్పటికీ అధికారిక ప్రకటన లేదు.
వకీల్ సాబ్ రిజల్ట్ ఏంటనేది తేలిపోవడంతో.. ఆ మరుసటి వారం (16వ తేదీ) చిన్న సినిమాలన్నీ క్యూ కట్టాయి. రాజశేఖర్-రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన ఆర్జీవీ దెయ్యం సినిమాతో పాటు టెంప్ట్ రాజా, చెక్ మేట్, 99 సాంగ్స్, చిట్టిబాబు, ఇట్లు అంజలి లాంటి సినిమాలు వరుసపెట్టి థియేటర్లలోకి వచ్చాయి. ఇవన్నీ ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి.
వీటిలో ఏఆర్ రెహ్మాన్ నిర్మాతగా మారి, తనే మ్యూజిక్ కంపోజ్ చేసిన 99 సాంగ్స్ అనే సినిమా కూడా ఉంది. మంచి లీడ్ యాక్టర్స్ లేకపోవడం, సాంగ్స్ పెద్దగా క్లిక్ అవ్వకపోవడం, సినిమా బోరింగ్ గా సాగడం ఈ సినిమాకు ప్రధాన అడ్డంకులుగా నిలిచాయి.
ఇక 23న శుక్ర, కథానిక అనే మరో రెండు సినిమాలు రిలీజయ్యాయి. ఓవైపు థియేటర్లు మూతపడుతుంటే, మరోవైపు ఈ రెండు సినిమాలు వచ్చాయి. ఇంకోవైపు కరోనా వైరస్ విజృంభన మొదలైపోయింది. దీంతో ఈ రెండు సినిమాల్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. చివరికి 30వ తేదీన కూడా ఓ అమ్మాయి క్రైమ్ స్టోరీ పేరిట ఓ చిన్న సినిమాని రిలీజ్ చేసి చేతులు దులుపుకున్నారు.