హైకోర్టులకు సర్వోన్నత న్యాయస్థానం హితవు చెప్పింది. ఏది పడితే అది కామెంట్ చేయవద్దని గట్టిగా హితవు చెప్పింది. సుప్రీం కోర్టు తాజా హెచ్చరికపై సర్వత్రా చర్చనీయాంశమైంది.
కోవిడ్-19 నియంత్రణపై జాతీయ విధానం రూపకల్పనకు సంబంధించి సుప్రీంకోర్టు తనకు తానుగా కేసు విచారణ చేపట్టింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్.నాగేశ్వరావు, జస్టిస్ రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
విచారణలో భాగంగా ఇటీవల మద్రాస్, ఢిల్లీ హైకోర్టులు చేసిన తీవ్ర వ్యాఖ్యలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాతో పాటు బీహార్ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్ సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టుల ఘాటు వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సీరియస్‌గా పరిగణించింది.
విచారణ సందర్భంగా అనవసర, అప్రయత్న వ్యాఖ్యలు చేయవద్దని హైకోర్టులను సుతిమెత్తగా హెచ్చరించింది. ఇలాంటి వ్యాఖ్యల వల్ల తీవ్ర ప్రభావాలు ఉంటాయని అభిప్రాయపడింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల అధికారులు అసలు పని చేయడం లేదన్న భావన కలుగుతుందన్నారు.
సున్నితమైన అంశాల్లో గౌరవం, సంయమనం పాటించాలని ధర్మాసనం హితవు పలికింది. ఇదే సందర్భంలో న్యాయవాదుల నుంచి సమాచారం రాబట్టడానికి కొన్నిసార్లు అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని, నొచ్చుకోవాల్సిన పనిలేదని సుప్రీంకోర్టు అనునయించడం గమనార్హం.