ప్రపంచంలోనే భారీ ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్న దేశంగా నిలిచిన భారత్, తాజాగా రోజువారీ కేసుల్లో 4 లక్షల మార్కు అందుకుంది. అవును.. ఒకేరోజు 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి ఇండియాలో. గడిచిన 24 గంటల్లో దేశంలో 4,01,911 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో ఇదే అత్యథికం.
ఏప్రిల్ 22వ తేదీన రోజువారీ కరోనా కేసుల్లో 3 లక్షల మార్కు అందుకుంది భారత్. ఇప్పుడు 4 లక్షల మార్కును చేరింది. అంటే.. కేవలం 9 రోజుల్లోనే ఇండియాలో రోజువారీ కేసులు లక్షకు పైగా పెరిగాయన్నమాట. దేశంలో ఒక రోజులో ఇన్ని కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగించే విషయం. తాజా ట్రెండ్ ను గమనిస్తే, ప్రతి వారం లక్ష చొప్పున కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ వేవ్ మరో 5 రోజుల పాటు ఇలానే ఉంటుందంటున్నారు నిపుణులు.
ప్రస్తుతం దేశంలో నిమిషానికి 270 కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అంటే, సగటున సెకెనుకు 4 కేసులు నమోదవుతున్నాయన్నమాట. ఇక మరణాల విషయానికొస్తే, ఇండియాలో ప్రస్తుతం కరోనా వల్ల నిమిషానికి ఇద్దరు చనిపోతున్నారు.
నెల రోజుల్లోనే 45వేల మంది మృతి
కరోనా కల్లోలానికి దేశంలో గడిచిన నెల రోజుల్లో 45వేలమంది మృత్యువాత పడ్డారు. ఏప్రిల్ 1 నుంచి నిన్నటి వరకు డేటాను పరిశీలిస్తే ఈ సంఖ్య లెక్కతేలింది. ఇందులో ఏప్రిల్ 21 తర్వాత అంటే.. 10 రోజుల్లోనే 27,800 మరణాలు సంభవించాయి.
రాష్ట్రాలవారీగా చూసుకుంటే.. కేవలం 10 రాష్ట్రాల్లోనే 77శాతానికి పైగా మరణాలు సంభవిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. మహారాష్ట్రలో ప్రతి గంటకు 32 మంది కరోనాతో మరణిస్తున్నారు. ఇక ఢిల్లీలో ప్రతి గంటకు 16 మంది కరోనాతో మరణిస్తున్నారు.
టీకాలపై మాత్రం అదే నిర్లక్ష్యం
ఓవైపు కరోనా విధ్వంసం సృష్టిస్తుంటే టీకాల పంపిణీపై మాత్రం కేంద్ర ప్రభుత్వం అదే నిర్లక్ష్యం వీడుతోంది. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వ్యక్తులు ఎక్కువగా కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో.. వాళ్లకు అత్యవసరంగా టీకా ఇవ్వాల్సింది పోయి, వాయిదాలు వేస్తోంది.
సరైన ప్రణాళిక లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి దాపురించింది. 45 ఏళ్లు నిండిన వ్యక్తులకే ఇంకా సెకెండ్ డోస్ ఇవ్వని స్థితిలో ఉంది ఇండియా. ఈ లెక్కన 18-45 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తుల కోసం ఉద్దేశించిన వ్యాక్సినేషన్ డ్రైవ్ మరో నెల రోజులు ఆలస్యం కానుంది.