అమరావతి పరిరక్షణ ఉద్యమం 500 రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా పర్చువల్ సభను నిర్వహించారు. ఈ సభలో చంద్రబాబు సహా ఆయన కుడి భుజం సీపీఐ రామకృష్ణ, ఎడమ భుజం సోము వీర్రాజు తదితర ప్రముఖులంతా గొప్పగొప్ప ప్రసం గాలు చేశారు.
ఎప్పటికైనా న్యాయం, ధర్మానివే గెలుపని, కావున అమరావతి ఉద్యమకారులు కూడా విజయం సాధిస్తారని చంద్రబాబు ఆకాంక్షించారు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతికి అన్యాయం జరుగుతుందని చంద్రబాబు ఎంతగా ఘోషించినా, ఆయన మాటలు నమ్మొద్దని మీకు చెప్పి , మీ గొంతు కోశామని అన్నారు.
ఆ పాపంలో సింహభాగం తమ ముఖ్యమంత్రిదే అయినా, తనకూ కొంత భాగం ఉన్నందుకు సిగ్గుపడుతున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. క్షమించాలని ఆయన వేడుకోవడం గమనార్హం. సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ అమరావతిపై కేంద్రం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు.
సీఎం జగన్ అప్రజాస్వామిక విధానాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. ఏ ప్రజాస్వామ్యం ద్వారా అయితే 2019 ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్కారో అధికారాన్ని చేపట్టగానే దానికి పాతరేస్తున్నారని ఆయన విమర్శించారు.
పర్చువల్ సభలో నేతల ఆవేశపూరిత ప్రసంగాలన్నీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్‌కు తుస్సుమన్నాయి. అమరావతి పరిరక్షణ ఉద్యమంపై బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. మీడియా సమావేశంలో ఉద్యమంపై బొత్స నిప్పులు కురిపించారు. బొత్స ఏమన్నారో ఆయన మాటల్లోనే…
‘అమరావతిలో 500 రోజులు కాకపోతే వెయ్యి రోజుల పండగ చేసుకోండి.. ఎవదొద్దన్నారు?. అమరావతి పేరుతో చేస్తున్న ఉద్యమాలు, పండగలన్నీ బోగస్. అవి బినామీలను రక్షించుకునే చర్యలే తప్ప రైతుల్ని, అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేవి కాదు.
పది మంది ఫొటోలు, సెల్ఫీలు తీసుకుని, చంద్రబాబు వచ్చినప్పుడు జై అనడాన్ని ఉద్యమం అంటే ఎలా?’ అని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇంతటితో ఆయన ఆగలేదు. జూమ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సంస్థలు, వాటి ప్రజాబలం గురించి కూడా వెటకరించారు.
‘శాసనసభలో ప్రాతినిథ్యంలేని రాజకీయ పార్టీ నేతలు, అమరావతి పరిరక్షణ సమితి నేతలు జూమ్ కాన్ఫరెన్స్ పెట్టారు. దేనికి పరిరక్షణ సమితి? బినామీ భూముల్ని పరిరక్షించుకోవడానికా లేక చంద్రబాబును పరిరక్షించడానికా?. మేము తీసుకున్న మూడు రాజధానులకు కట్టుబడి ముందుకెళ్తాం.
రాష్ట్ర ప్రజలు దాన్ని ఆమోదించారనేందుకు స్థానిక ఎన్నికల్లో సాధించిన విజయమే నిదర్శనం’ అని చెప్పుకొచ్చారు. ఉద్యమానికి సంబంధించి ఆన్‌లైన్‌లో ఘనమైన సభ నిర్వహించామనే ఆనందాన్ని కాసేపు కూడా బొత్స ఉండనివ్వలేదు. ఎంతైనా బొత్స మాటకు కరుకుతనం ఎక్కువే.