ఈసారి కబ్జా ‘ఈటెలు’ గుచ్చుకుంటున్నాయా?

“మంత్రి ఈటెలకు పదవీ గండం” అనే హెడ్డింగ్ కొత్తగా ఇప్పుడు పుట్టుకొచ్చింది కాదు. ఇంతకుముందే ఈటెలపై ఈ తరహా కథనాలు వచ్చాయి. చిన్నచిన్న అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ ఈసారి సైజు పెద్దది.…

“మంత్రి ఈటెలకు పదవీ గండం” అనే హెడ్డింగ్ కొత్తగా ఇప్పుడు పుట్టుకొచ్చింది కాదు. ఇంతకుముందే ఈటెలపై ఈ తరహా కథనాలు వచ్చాయి. చిన్నచిన్న అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ ఈసారి సైజు పెద్దది. మరీ ముఖ్యంగా మీడియా అంతా కలిసిపోయి, మూకుమ్మడిగా ఈటెలపై కబ్జా ఆరోపణలు చేస్తోంది. ఎంతలా అంటే.. టీఆర్ఎస్ అధికారిక ఛానెల్ లో కూడా ఈటెల కబ్జాకోరు అంటూ గంటల తరబడి కథనాలు వచ్చాయి. వస్తున్నాయి.

ఆ వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు ఆదేశించారు. గంటల వ్యవథిలోనే చకచకా జరిగిన ఈ పరిణామాల్ని చూస్తుంటే.. ఈటెలను కావాలనే కార్నర్ చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

జరిగింది భూ కబ్జా. 100 ఎకరాల అసైన్డ్ భూమిని ఈటెల అనుచరులు కబ్జా చేశారనేది ఆరోపణ. ఆ వంద ఎకరాలు కూడా హైదరాబాద్ లో లేదు. మెదక్ జిల్లాలో మారుమూల ప్రాంతం. అంటే మార్కెట్ రేటు ప్రకారం చూసుకుంటే స్కామ్ సైజ్ చిన్నదే అనుకోవాలి. కానీ తప్పు తప్పే. ఎవరికైనా శిక్ష పడాల్సిందే. అయితే కేసీఆర్ సర్కారులో చర్యలు ఇంత త్వరగా జరుగుతుండడమే ఆశ్చర్యం కలిగించే విషయం. 

ఇంతకుముందు కూడా కేసీఆర్ ప్రభుత్వంపై, పార్టీపై చాలా ఆరోపణలు వచ్చాయి. అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ చాలా ఆరోపణలు చేశాయి. కొన్ని కేసులు కూడా పైల్ అయ్యాయి. వాటిలో కొన్ని ఇప్పుడు చెప్పుకుంటున్న ''ఈటెల కబ్జా'' కంటే చాలా పెద్దవి. మరి వాటిపై జోరుగా జరగని విచారణ, ఈటెల విషయానికొచ్చేసరికి జెట్ స్పీడ్ తో ఎందుకు జరుగుతోందనేది చాలామంది అనుమానం-ఆరోపణ.

ఈ మేరకు కాంగ్రెస్ అధికార ప్రతినిథి దాసోజు శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈటెల వ్యవహారంపై ఇంత వేగంగా స్పందిస్తున్న ప్రభుత్వం.. కేసీఆర్ ఫామ్ హౌజ్ వ్యవహారంపై, మల్లారెడ్డి అవినీతి ఆరోపణలపై, అతడి భూ కబ్జాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. కేసీఆర్ కు ఈటెల నచ్చడం లేదని, అందుకే ఇలా సాగనంపే పథకం వేశారని కూడా శ్రవణ్ ఆరోపించారు.

సరిగ్గా ఇక్కడే కేసీఆర్-ఈటెల మధ్య సంబంధాల అంశం చర్చకొస్తోంది. ముఖ్యమంత్రికి, ఈటెలకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉందనే విషయాన్ని పార్టీలో సభ్యులే అఫ్ ది రికార్డ్ చెబుతుంటారు. ఈ కమ్యూనికేషన్ గ్యాపే రానురాను అభిప్రాయబేధంగా మారిందని కూడా అంటారు చాలామంది.

అటు బీజేపీ నేతలు కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. లక్ష కోట్లు మింగిన దొర కుటుంబం, బడుగు-బలహీన వర్గాలపై చేస్తున్న అణచివేత ప్రక్రియలో తమ్ముడు ఈటెల రాజేందర్ ది ఓ కోణం అంటూ విజయశాంతి స్పందించగా.. కల్వకుంట్ల కుటుంబానికి ఉన్న ఏకైక అడ్డును తొలిగించుకొనేందుకే ఈటెలను టార్గెట్ చేశారంటూ మరో బీజేపీ నేత వివేక్ ఆరోపించారు.

మొత్తమ్మీద ప్రతిపక్షాల ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ.. నిజం మాత్రం నిగ్గుతేలాల్సిందే. ఆందోళన చేస్తున్న బాధితులకు న్యాయం జరగాల్సిందే. ఆ స్థానంలో ఈటెల ఉన్నా, హరీష్ రావు ఉన్నా నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాల్సిందే.