విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపనందేంద్రస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై మొదటిసారిగా స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఆయన మాట్లాడ్డం ఆసక్తికరంగా మారింది. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. శారదా పీఠాధిపతి రాజకీయాలకు కేంద్రంగా మారిందనే వాదన లేకపోలేదు.
ఈ నేపథ్యంలో మహాశివ రాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్‌పై తన మనసులో మాట బయట పెట్టారు. విశాఖ ఆర్.కె బీచ్ వద్ద టి.సుబ్బరామిరెడ్డి శ్రీ లలితా కళా పీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివరాత్రి ఉత్సవాల్లో స్వరూపనందేంద్ర స్వామి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మ నందేంద్ర స్వామి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వాళ్లిద్దరూ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి తెలుగు వ్యక్తి వ్యతిరేకిస్తారని స్పష్టం చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయివేట్‌పరం కానివ్వమని గురుశిష్యులైన స్వాములిద్దరూ గట్టిగా చెప్పడం విశేషం. రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌పై శారదా పీఠాధిపతి స్పందించడమే కాకుండా , అడ్డుకుంటామని చెప్పడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.