ఇప్పటికే జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆ పార్టీలో ఉన్నట్టా? లేనట్టా? అనేది ఆ పార్టీ వీరాభిమానులకే ఒక డౌట్ గా మారింది. ఒక్కడే గెలవడాన్ని కూడా ఒక దశలో చాలా గొప్ప ఘనతగా చెప్పుకున్నారు పవన్ కల్యాణ్ వీరాభిమానులు. అయితే ఆ ఘనత కూడా ఆ పార్టీకి ఎక్కువ కాలం కొనసాగేలా లేదన్నట్టుగా మారింది పరిస్థితి. పవన్ కల్యాణ్ ప్రతి విషయంలోనూ ద్వేషించే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఓపెన్ గా పొగుడుతూ ఉన్నారు జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక. జగన్ మీద పవన్ కల్యాణ్ విపరీత ద్వేషం వ్యక్తం చేస్తూ ఉండగా, రాపాక మాత్రం ఆ ఛాయలేమీ లేకుండా నడుచుకుంటూ ఉన్నారు.
ఇక జగన్ మొదలుపెట్టిన పలు పథకాలను, అనుసరిస్తున్న పలు విధానాలను కూడా పవన్ కల్యాణ్ తీవ్రంగా తప్పు పట్టారు. అయితే అవే విధానాలను అటు సభలోనూ, ఇటు సభ బయట రాపాక గట్టిగా సమర్థిస్తూ ఉన్నారు. పవన్ కల్యాణ్ మూడు రాజధానుల ఫార్ములాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాపాక మాత్రం ఆ విషయంలో జగన్ ను మెచ్చుకుంటూనే ఉన్నారు.
ఈ క్రమంలో తను జనసేనలో ఉన్నట్టేనా? అనే అంశం మీద కూడా ఆ ఎమ్మెల్యే స్పందించారు. తను జనసేనకు దగ్గరగానూ లేనని, అలాగని దూరం కూడా అయిపోలేదని ఈ ఎమ్మెల్యే ప్రకటించారు. రాజధాని వికేంద్రీకరణకు తను మద్దతు ఇస్తున్నట్టుగా, ప్రభుత్వ విధానాల్లో నచ్చే వాటికి తను మద్దతు పలకబోతున్నట్టుగా కూడా ఈ ఎమ్మెల్యే ప్రకటించేశారు. పవన్ కల్యాన్ స్పందనతో తనకు సంబంధం లేదని, తన విధానం తనదని జనసేన ఏకైక ఎమ్మెల్యే తేల్చి చెప్పారు. మరి పవన్ పుండు మీద కారం చల్లుతున్నట్టుగా మాట్లాడిన రాపాకను ఎలా డీల్ చేయాలో కూడా జనసేనకు తెలియకపోవచ్చు.