ఆరడుగుల టెన్నిస్ అందాల తార, 18 ఏళ్లకే ప్రపంచ నెంబర్ 1 ర్యాంక్‌ను సొంతం చేసుకున్న రష్యా టెన్నిస్ క్రీడాకారిణి షరపోవా తన ఆటకు గుడ్ బై చెప్పింది. షరపోవా నిర్ణయం లక్షలాది మంది క్రీడాభిమానులు జీర్ణించుకోలేకున్నారు. ఆటకు ఆట, అందానికి అందం …ఆమె సొంతం. టెన్నిస్ క్రీడా మైదానంలో ఆమె ఆటను, అందాన్ని కళ్లు ఆర్పకుండా చూసే అభిమానులు ఎందరో. టెన్నిస్‌లో స్టెపీగ్రాప్ తర్వాత అంతగా అభిమానులను చూరగొన్న క్రీడాకారిణి ఎవరైనా ఉన్నారా అంటే…ఒక్క షరపోవా అని మాత్రమే అని చెప్పాలి.
ఒకప్పుడు ప్రపంచ నెంబర్‌వన్‌గా నిలిచిన షరపోవా, ఆటకు గుడ్‌బై చెప్పేనాటికి 373వ ర్యాంకుతో కొనసాగుతుండడం గమనార్హం. 32 ఏళ్ల ఈ రష్యన్ స్టార్.. టెన్నిస్ క్రీడే తన జీవితంగా గడిపింది. టెన్నిస్ నుంచి తప్పుకొంటున్నట్టు బుధవారం ‘వోగ్, వానిటీ ఫెయిర్’ అనే వెబ్‌సైట్లకు రాసిన వ్యాసంలో ప్రకటించి అభిమానులకు ఆవేదన మిగిల్చింది.
‘అనిర్వచనీయమైన ఆనందాలను పంచి.. కనిపించని కన్నీళ్లను మిగిల్చి.. ప్రేమించిన ఆటను మానేయాల్సి వస్తోంది. ఇన్నేళ్లుగా ఓ కొత్త కుటుంబాన్ని, నాకు అండగా నిలిచిన అభిమానులను అందించిన ఆటను వదిలేయాల్సి వస్తోంది. అందుకే.. నన్ను క్షమించు. టెన్నిస్.. నీకు వీడ్కోలు పలుకుతున్నా. 28 ఏళ్లు.. 5 గ్రాండ్‌స్లామ్స్ తర్వాత మరో శిఖరాన్ని అధిరోహిం చేందుకు సిద్ధమయ్యా’ అని ఆమె ముగింపు వాక్యాలను పలికారు.
అంటే నాలుగేళ్ల వయసు నుంచే ఆమె టెన్నీస్ ఆడడం మొదలు పెట్టింది. ‘ఇంతింతై’ అన్నట్టు ఆమె క్రీడా ప్రస్థానం ఓ స్ఫూర్తిదాయకం. ఎందుకంటే టెన్నిస్ అనేది ఖరీదైన ఆట. 1987 ఏప్రిల్ 19న రష్యాలోని న్యాగన్ పట్టణంలో యూరీ, యెలెనా దంపతులకు షరపోవా జన్మించింది. కూతురికి టెన్నిస్‌పై ఇష్టాన్ని పసిగట్టిన తండ్రికి అందుకు తగ్గట్టు ప్రోత్సహించాడు.
కూతురికి మెరుగైన కోచింగ్ ఇప్పించాలనే తపన, పట్టుదలతో అమెరికాలోని ప్లోరిడాకు కేవలం 700 డాలర్లతో రష్యా నుంచి వెళ్లారు. ఆర్థిక ఇబ్బందులకు తోడు తండ్రీకూతుళ్లకు ఇంగ్లీష్ ఏ మాత్రం రాదు. కొద్దిరోజుల్లోనే వాళ్ల దగ్గర డబ్బులు అయిపోవడంతో చివరికి హోటళ్లలో ప్లేట్‌లు కడగడం లాంటి చిన్నాచితకా పనులు కూడా తండ్రి యూరీ చేశాడు. తండ్రి కష్టాన్ని వృథా కానివ్వకూడదనే పట్టుదలతో ఆమె పూర్తిగా ఆటపై దృష్టి సారించింది.
2001లో డబ్ల్యూటీఏ టూర్‌తో ప్రొఫెషనల్ టెన్నిస్‌లో అరంగేట్రం చేసిన షరపోవా.. తక్కువ కాలంలోనే అగ్రశ్రేణి క్రీడాకారిణిగా ఎదిగింది. 2004 వింబుల్డన్ ఫైనల్లో అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్‌కు షాకిచ్చి 17 ఏళ్ల వయసులో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్న షరపోవా ఒక్కసారిగా సెలెబ్రిటీగా మారిపోయింది. 2005 ఆగస్టులో ప్రపంచ నెంబర్‌వన్‌గా అవతరించి 18 ఏళ్లకే ఈ ఘనత సాధించిన తొలి రష్యన్ ప్లేయర్‌గా రికార్డుకెక్కి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 2006లో యూఎస్ ఓపెన్, 2008 లో అస్ట్రెలియాన్ ఓపెన్, 2012, 2014లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు సాధించింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుచుకుంది.
టెన్నిస్ కోర్టులో షరపోవా ఉందంటే చాలు టీవీలకు అతుక్కుపోయే వారు. ఆమె ఆట, అందం, అరుపులు, అభినయం…ఇలా ప్రతి ఒక్కటీ లక్షలాది మంది క్రీడాభిమానులను సంపాదించి పెట్టింది. ఇప్పుడు ఆమె లేని టెన్నిస్‌ను ఊహించుకోవడం…జీర్ణించుకోలేనిదే. షరపోవాను టెన్నిస్, టెన్నిస్‌ను ఆమె మిస్ కావడం…కేవలం వాళ్లిద్దరికి సంబంధించిన వ్యవహారం కానే కాదు. క్రీడకు, క్రీడాకారులకు మధ్య వారధులుగా నిలిచే అభిమానుల కోణం నుంచి కూడా చూడాలి. అందుకే షరపోవా లేని టెన్నిస్ గురించి ఇంత ఆవేదన.