ఇప్పటికే పలు బ్యాంకులు తమ తమ ఏటీఎంలో 2000 నోటు ను ఉంచడం లేదు. ఈ విషయాన్ని ఆయా బ్యాంకులు అధికారికంగానే ప్రకటించాయి. నోట్ల రద్దు తర్వాత వచ్చిన 2000 నోటు కోసం చాలా తతంగమే నడిచింది. అలాంటి నోటు మారకంలోకి వచ్చి జనాలకు కాస్త అలవాటు పడుతుండగానే.. ఇంతలోనే దాని రద్దు ఊహాగానాలు చెలరేగాయి. ఆ నోటు రద్దు అవుతుందనే ప్రచారాలు చాన్నాళ్లుగా జరుగుతూ ఉన్నాయి.
ఇక ఇటీవలే బ్యాంకులు అధికారికంగానే రెండు వేల రూపాయల నోటును తమ ఏటీఎంలలో ఉంచడం లేదని ప్రకటించడంతో.. ఆ నోటు మారకం పట్ల మరిన్ని సందేహాలు నెలకొన్నాయి! ఇలాంటి క్రమంలో ఈ విషయంలో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఆమె ఏమంటారంటే.. రెండు వేల రూపాయల నోటును రద్దు చేసే ఆలోచన లేదని చెప్పారు!
రెండు వేల రూపాయల నోటును ఏటీఎంలో ఉంచవద్దని తాము బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వలేదని కూడా నిర్మల చెప్పారు. తనకు తెలిసి అలాంటి ఆదేశాలు వెళ్లలేదని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం. ఇలా ఆ నోటు రద్దు కాదు, మారకంలో ఉంటుందంటూ ఆమె భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.