2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఖర్చు అధికారిక లెక్కల ప్రకారం రూ.131 కోట్లు. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా విదుదల చేసిన నివేదికలో వివిధ పార్టీల ఎన్నికల ఖర్చు వివరాలున్నాయి. దేశ వ్యాప్తంగా అత్యధికంగా ఎన్నికల ఖర్చు చేసిన ప్రాంతీయ పార్టీగా టీడీపీ రికార్డు సాధించింది. ఆ తర్వాత స్థానం వైసీపీదే.
17వ లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలకు 2019లో ఒకేసారి ఎన్నికలు జరి గాయి. రాజకీయ పార్టీలన్నీ కలిసి 3,046 కోట్లు ఖర్చు చేసినట్టు కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక వెల్లడించింది. బీజేపీ అన్ని పార్టీల కంటే అత్యధికంగా 1,264 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం. ఎన్నికల ఖర్చులో బీజేపీ వాటా 41.49 శాతం. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే రూ.820 కోట్లు ఖర్చు చేసింది. ఎన్నికల ఖర్చులో కాంగ్రెస్ వాటా 26.92 శాతం.
తెలుగు రాష్ట్రాల్లోని నాలుగు ప్రాంతీయ పార్టీలు కలిసి రూ.227 కోట్లు ఖర్చు చేశాయి. ఇందులో టీడీపీదే మెజార్టీ వాటా. రూ.131 కోట్ల ఖర్చుతో టీడీపీ మొదటి వరుసలో నిలిచింది. వైసీపీ రూ.86 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. టీఆర్ఎస్ రూ.9.53 కోట్లు. ఎంఐఎం అతి తక్కువగా రూ.71,961 ఖర్చు చేసినట్టు కేంద్ర ఎన్నికల సంఘం నివేదించింది.
అధికారిక లెక్కలే ఇట్లా వుంటే, ఇక అనధికారిక లెక్కలు ఏ స్థాయిలో వుంటాయో అనే చర్చకు తెరలేచింది. రాజకీయాల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం టీడీపీతోనే మొదలైందనే విమర్శలకు తాజా లెక్కలు బలం కలిగిస్తున్నాయి. నీతులు చెప్పడమే తప్ప, ఆచరణకు మాత్రం టీడీపీ దూరమనే వాస్తవాన్ని ఈ లెక్కలు ప్రతిబింబిస్తున్నాయి. ఇదిలా వుండగా ఈ లెక్కల గురించి వార్త రాసిన ఈనాడు పత్రిక, తన వక్రబుద్ధిని మరోసారి ప్రదర్శించింది.
రూ.131 కోట్ల ఖర్చుతో టీడీపీ తొలిస్థానంలో నిలిచినట్టు గర్వంగా రాసింది. ఇదే తనకు గిట్టని వైసీపీ విషయానికి వచ్చే సరికి రూ. 86 కోట్లతో రెండోస్థానాన్ని ఆక్రమించిందని రాయడం ఈనాడుకే చెల్లింది. వైసీపీ కంటే టీడీపీ దాదాపు 45 కోట్ల రూపాయిలు అత్యధికంగా ఖర్చు చేయడం గమనార్హం.