“మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ వచ్చేస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ కి పూర్వ వైభవం వస్తుంది. సీనియర్లంతా మళ్లీ యాక్టివ్ అవుతారు. పక్కకు వెళ్లిపోయినవారంతా తిరిగి కాంగ్రెస్ గూటికి వస్తారు. ఇదీ ప్రస్తుతం ఏపీలో ఓ వర్గం మీడియా వల్లె వేస్తున్న మాటలు.” కానీ ఏపీలో కాంగ్రెస్ కి అంత సీన్ ఉందా.
సీనియర్లంతా అంత పొందికగా, ఒద్దికగా ఒక్కచోట చేరగలరా..? కమాండింగ్ చేసే నాయకుడు లేనంతకాలం ఏపీలో కాంగ్రెస్ కి దిక్కు లేనట్టే. అలాంటి నాయకుడే ఉంటే జగన్ లాగా సొంత పార్టీ పెట్టుకుంటారు కానీ, కాంగ్రెస్ గుర్తు కోసం పాకులాడరు.
కాంగ్రెస్ లో కిరణ్ కుమార్ రెడ్డికి చివరి దశలో సీఎం సీటు ఎలా వచ్చిందో అందరికీ తెలుసు. కిరణ్ కంటే చాలామంది సీనియర్లు పార్టీలో ఉన్నా ఆయన్ను ఏరికోరి ముఖ్యమంత్రిని చేయడానికి కారణం డబ్బు సంచులు కాక మరోటి కాదు.
నిజంగానే రాష్ట్ర విభజనని అడ్డుకునే కోరిక ఉంటే తెలంగాణకు చెందిన వ్యక్తికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించేవారు. కానీ అది కూడా కాదనుకుని కిరణ్ ని అందలమెక్కించారు. ఏపీలో పార్టీని సర్వనాశనం చేశారు. చివరకు ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఆయన చెప్పు గుర్తుపై పోటీచేసి అవతారం చాలించేశారు.
కిరణ్ రాకతో ఏమవుతుంది..?
ఇప్పుడు మళ్లీ కిరణ్ కుమార్ రెడ్డి వస్తే ఏమవుతుంది. గతంలో కూడా ఆయన మాటకారి కాదు, కేవలం మూటకారి మాత్రమే. ఇప్పుడు కూడా ఆయన పార్టీలోకి వచ్చి ఎవరినీ తన పేరుమీద చేర్చుకోలేరు, తన మాటకారితనంతో ఆకర్షించనూలేరు. పోనీ కాంగ్రెస్ మీదున్న ప్రేమతో కొంతమంది యాక్టివేట్ అయినా అందర్నీ ఒకే చోట చేర్చి నడిపించే నాయకత్వ పటిమ కిరణ్ కుమార్ రెడ్డిలో లేదు.
సో ఆయన వచ్చినా, ఇంకెవరు వచ్చినా ఏపీలో పార్టీని ఏమీ చేయలేరు. అసలు ఏపీలో కాంగ్రెస్ కి నాయకులు, కార్యకర్తలు లేనప్పుడు రాహుల్ పాదయాత్రలతో, సోనియా ఓదార్పు యాత్రలతో ఫలితం ఏముంటుంది. తెలంగాణలో ఎగిరెగిరి పడుతున్న రేవంత్ రెడ్డి లాంటి నాయకులతో కొద్దోగొప్పో ప్రచారం లభిస్తోంది కానీ, ఏపీలో కనీసం అది కూడా లేదు. ఒకవేళ ఉన్నా ఇక్కడంతా పక్కా కమర్షియల్.
రాహుల్ కే దిక్కులేదు.. ఇక ఏపీలోని నాయకులకు పార్టీ ఏం చేస్తుంది..? సో.. ఎలా చూసుకున్నా ఏపీలో కాంగ్రెస్ బతికి బట్టకట్టే అవకాశం లేదు. పార్టీ కోసం వచ్చేవారు లేరు, ఖర్చు పెట్టుకునేవారు కూడా లేరు. ఉన్నవారంతా వైసీపీలోనో, టీడీపీలోనో, లేక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోనో చేరి కాలం గడుపుతున్నారు. మీడియా, సోషల్ మీడియా హడావిడి తప్ప.. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అనే పేరు నాలుగు రోజుల తర్వాత వినపడనే వినపడదు.