Advertisement

Advertisement


Home > Politics - Opinion

సినిమా హీరోలకి, దర్శకులకి మరీ ఇంత ఆకలా?

సినిమా హీరోలకి, దర్శకులకి మరీ ఇంత ఆకలా?

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. ఆ క్రమంలో పక్కింటి దీపం ఆర్పేయమనైతే చెప్పరు. 

ధనార్జన మీద సినిమా హీరోల, దర్శకుల ఆశ మాత్రం హద్దులు దాటి అసహ్యమేసేలా తయారవుతోంది. 

ఒక ప్రభుత్వం ప్రజలమీద ట్యాక్సులేస్తోందంటే అందులో అభివృద్ధి, సంక్షేమం, సరిహద్దు రక్షణ, ఉద్యోగుల జీతభత్యాలు ఇలా అనేకముంటాయి. 

అదే సినిమా హీరోకో, దర్శకుడికో అయితే ఏముంటాయి? కచ్చితంగా పెట్టుబడి మీద లాభమో, శ్రమకు తగిన ఫలితం పొందడమో అవసరం. కానీ అగ్నిదేవుడి ఆకలి లాగ ఎంత మింగినా చల్లారకపోతే ఎలా? 

ముందు సినిమా బడ్జెట్ ని సాకుగా చూపించి తదుపరి సినిమా బడ్జెట్ పెంచేసుకోవడం. పంపిణీదారులకి జనం మీద పడి ఎలా బాదాలో దారులు చెప్పడం, పభుత్వాన్ని కుదిపేసి టికెట్ల రేట్లు పెంచమని పేదరుపులు అరవడం, అంతా అయ్యాక ఓటీటీలకి అమ్మే క్రమంలో కూడా బేరంలో ఎక్కడా తగ్గకుండా అవసరమైతే జనం మీద పడి బాదమని సంకేతాలివ్వడం...ఇదీ పరిస్థితి. 

కరోనాకలంలో మాస్కులు, హాస్పిటళ్లతో పాటు ఆర్ధికంగా లాభపడ్డ వ్యాపారం ఓటీటీలు. నెలకో ఏడాదికో ఇంతని కట్టేస్తే ఇంట్లో కూర్చుని కావల్సినన్ని కొత్త సినిమాలు చూసేయొచ్చు అనే ఆలోచన పై నుంచి మధ్యతరగతి వరకు చాలామందిని కదిలించింది. 

ఆ దెబ్బతో ప్రతి ఓటీటీ ప్లాట్ఫాం కూడా జనాభా లెక్కలు, ఇంటర్నెట్ వాడకందారుల సంఖ్య లెక్కేసి రానున్న ఇన్ని ఏళ్లల్లో ఓటీటీ వ్యాపారం ఎన్నో బిలియన్ డాలర్లకు పాకిపోతుందని స్వయంతృప్తి చెంది పెట్టుబళ్లు పెట్టేసారు. 

అదే అదనుగా చూసుకుని పెద్ద సినిమాలు భారీ మొత్తాన్ని కొల్లగొట్టేసాయి ఆయా ప్లాట్ఫాంస్ నుంచి. 

కానీ అన్నీ అనుకున్నట్టు జరగట్లేదు. మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అనే చందాన లెక్కకు మించిన ఓటీటీలు ఎదురుగా ఉండడంతో సబ్స్క్రైబ్ అయిన జనం కూడా రిన్యూవల్ చేయకుండా వైదొలగుతున్నారు. వారిని కాపాడుకోవాలంటే అదిరిపోయే కంటెంట్ వడ్డించాలి. దాని కోసం పెట్టుబడి పెట్టాలి. పెద్ద దర్శకుల దర్శకత్వంలో నడుచుకునే నిర్మాతలు భారీగా కోట్ చేస్తున్నా ఊపిరి బిగబెట్టి కొనెయ్యాలి.. ఇదీ వరస. 

కానీ అప్పటికీ కొత్త సబ్స్క్రైబర్స్ రాకపోతే ఎలా? దానికి సమాధానంగా కనీసం ఆయా సినిమాల మీద ఉన్న క్రేజ్ ని అయినా క్యాష్ చేసుకునే విధంగా టికెట్ పెట్టి అమ్మాలన్న ఆలోచనలొచ్చాయి ఆయా ఓటీటీ సంస్థల యజమానులకి. 

యూట్యూబులో పెయిడ్ సినిమాలుంటాయి. కారణం అది ఫ్రీ ప్లాట్ఫాం. అన్నీ ఉచితంగా చూస్తూ ఏదో ఒకదానికి డబ్బు కట్టమంటే ఓకే. నచ్చితే కట్టి చూస్తారు లేకపోతే లేదు. కానీ ఓటీటీలు అలా కదు కదా. ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ పేరుతో కట్టించుకుని, మళ్లీ ఫలానా కొత్త సినిమా చూడాలంటే రూ 100 లేదా రూ 200 టికెట్టంటే జనం ఎలా ఫీలౌతారు? తమని ఓటీటీలు వెర్రిపప్పల్ని చేసి ఆడుకుంటున్నాయని అనుకోరా? అదే జరుగుతోంది. 

ఆర్.ఆర్.ఆర్, కేజీఎఫ్-2 సినిమాలకి విపరీతమైన క్రేజ్ బిల్డైన మాట వాస్తవమే. విడుదలయ్యి నెల, రెండు నెలలు గడిచాక ఓటీటీలోకొస్తున్నాయి. కానీ కొన్నాళ్లు టికెట్ కొనుక్కుని చూడాలట. ఏవిటి ఈ విపరీతం? బుద్ధున్నవాళ్లు ఆ "కొన్నాళ్లు" ఆగి ఫ్రీగానే చూస్తారు తప్ప వెంపార్లాడిపోయే వెంటనే చూసేయడానికి అవేమైనా డైరెక్ట్ ఓటీటీ రిలీజులా? 

పిండే వాడున్నంతమాత్రాన పిండించుకోవడానికి జనం సిద్ధంగా ఉండొద్దు..! పిండే కొద్దీ పాలు కారుతున్నాయి కదా అని ఆవునైనా ఒక స్థాయికి దాటి పిండితే కొమ్ము విసురొచ్చు, కాలుతో ఒక్క తన్ను తన్నొచ్చు. ఇప్పుడు ఓటీటీలు అలా తన్నించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయల్లే ఉంది. ఇప్పటికే ఉన్నదాన్ని నిలబెట్టుకునే క్రమంలో నానా కష్టాలు పడుతుంటే, ఇప్పుడీ టికెట్ కొనుక్కుని ఆన్లైన్లో సినిమా చూడాలనే కాన్సెప్ట్ బెడిసికొట్టొచ్చు. 

ఎంత ఓటీటీలే ఈ పని చేస్తున్నా..అన్నిటికీ మూలకారణం పెద్ద హీరోల, దర్శకుల అతి ఆకలి, నాలుగు తరాలకి సరిపడా ఒక్క సినిమాతోనే సంపాదించేయాలనే పేరాశ. 

పైకి గెడ్డాలు పెంచి సాధువుల్లాగ సింపుల్ గా కనిపిస్తున్నా ఈ దర్శకుల ఆకలి వినోదరంగానికి, ప్రజల జేబులకి పెద్ద చేటులా మారింది. ఓటీటీ సంస్థల్ని భ్రష్టుపట్టించి దివాళా తీయించగల మహాదిట్టలు మన పేరాశ హీరోలు, దురాశ దర్శకులు. 

శ్రీనివాసమూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?